BRS or TRS|బీఆర్ఎస్ జాతీయ పార్టీయా ? ప్రాంతీయ పార్టీయా ?
2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరనుండి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అయోమయాన్ని కలిగిస్తున్నాయి
నిజానికి ఈ ప్రశ్న వేయాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే పార్టీలోని ఇద్దరు కీలకనేతల కారణంగానే. 2001లో కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర సమతి(టీఆర్ఎస్)(TRS) అనే ఉద్యమవేదికను ఏర్పాటుచేశారు. ప్రత్యేకతెలంగాణా(Telangana) ఏర్పాటే ప్రధానధ్యేయంగా టీఆర్ఎస్ ఏర్పాటైన విషయం తెలిసిందే. తర్వాత దాన్నే అదేపేరుతో రాజకీయపార్టీగా మార్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 2018లో రెండోసారి గెలిచినతర్వాత జాతీయరాజకీయాల్లో చక్రంతిప్పాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా అప్పటివరకు ప్రాంతీయపార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయపార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)(BRS)గా) 2022, డిసెంబర్ 9వ తేదీన మార్చారు. ప్రాంతీయపార్టీని జాతీయపార్టీగా మార్చుకునేందుకు అవసరమైన పార్టీతీర్మానాలను, డాక్యుమెంట్లన్నింటినీ కేంద్రఎన్నికలకమీషన్(Central Election Commission) కు అందించారు. దాంతో ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ కాస్త జాతీయపార్టీ బీఆర్ఎస్ అయిపోయింది. ఎప్పుడైతే తమపార్టీ జాతీయపార్టీ అయ్యిందో వెంటనే నేతలంతా రెండురోజుల పాటు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.
పైన చెప్పిందంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరనుండి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అయోమయాన్ని కలిగిస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR), ఆయన సోదరి, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత9Kavitha) చేస్తున్న వ్యాఖ్యలు జనాలతో పాటు పార్టీనేతలను కూడా అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ అన్నా,చెల్లెళ్ళు ఏమంటారంటే రెండుజాతీయపార్టీలు కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు తెలంగాణాను ఆగంచేస్తున్నాయని. జాతీయస్ధాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ఆధరణ తగ్గిపోతోందని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదే అని కేటీఆర్ ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయంఏమిటంటే తమపార్టీ ప్రాంతీయపార్టీయా లేకపోతే జాతీయపార్టీయా అన్నవిషయంలోనే చాలామందికి సందేహాలు మొదలయ్యాయి. ప్రాంతీయపార్టీయే అయితే కాంగ్రెస్, బీజేపీతో పాటు తమది కూడా జాతీయపార్టీనే కదా. మరి జాతీయపార్టీలకు ఆధరణ తగ్గిపోతోందని చెప్పటంలో అర్ధమేంటి ? కాంగ్రెస్, బీజేపీలతో పాటు బీఆర్ఎస్ కు కూడా జనాల్లో ఆధరణ తగ్గిపోతోందని అంగీకరించినట్లేనా ? అని జనాల్లో చర్చ మొదలైంది. ఇదేసమయంలో భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదే అని కేటీఆర్ చెప్పటం మరింత అయోమయాన్ని పెంచేసేదే అనటంలో సందేహంలేదు. బీఆర్ఎస్ ప్రాంతీయపార్టీ కాదు జాతీయపార్టీ. అలాంటపుడు భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదే అనిచెప్పటంలో అర్ధంలేదు. కేటీఆర్ మాటల్లోనే జాతీయపార్టీ బీఆర్ఎస్ కు భవిష్యత్తులేదని అంగీకరించినట్లేకదా.
తాజాగా ఇందిరాపార్కు దగ్గర కల్వకుంట్ల కవిత మాట్లాడుతు జాతీయపార్టీలు అంటు కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి చాలా ఆరోపణలు చేశారు. తమపార్టీ కూడా జాతీయపార్టీ అనేవిషయాన్ని మరచిపోయి జాతీయపార్టీలపైన ఆరోపణలు చేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అన్నా,చెల్లెళ్ళు చేస్తున్న ఇలాంటి అనాలోచితమైన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయపార్టీయా లేకపోతే జాతీయపార్టీయా అనే సందేహం జనాల్లో పెరిగిపోతోంది. తమది జాతీయపార్టీ కాదు ప్రాంతీయపార్టీయే అని అనేట్లయితే ఆ విషయంపై అర్జంటుగా అన్నా, చెల్లెళ్ళు క్లారిటి ఇవ్వాలి. ప్రాంతీయపార్టీయే అన్నది నిజమయ్యేట్లయితే మరి జాతీయపార్టీగా చేసిన రిజిస్ట్రేషన్ను కేసీఆర్ ఉపసంహరించుకున్నారా అన్న విషయాన్ని ప్రకటించాలి.
ఎందుకంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే పార్టీలో పెద్దఎత్తున చర్చ జరిగింది. చర్చ ఏమిటంటే టీఆర్ఎస్ ను జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చటాన్ని జనాలు ఆమోదించలేదని. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మర్చగానే పార్టీపేరులో సెంటిమెంటు మాయమైపోయిందని పార్టీనేతలు కేసీఆర్ తోనే స్వయంగా చెప్పారు. కాబట్టి బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాల్సిందే అని చాలామంది నేతలు కేసీఆర్ తో గట్టిగానే చెప్పారు. అయితే ఎవరెంతగా చెప్పినా పార్టీ పేరు మార్చటానికి కేసీఆర్ అంగీకరించలేదు. కాబట్టి అందరికీ అర్ధమైనది ఏమిటంటే బీఆర్ఎస్ జాతీయపార్టీనే అని. మరిదే నిజమైతే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, ఎంఎల్సీ కవిత మాటల్లో మాత్రం తమ పార్టీ జాతీయపార్టీ కాదు ప్రాంతీయపార్టీనే అనే అర్ధమొచ్చేట్లుగా ఎందుకు మాట్లాడుతున్నట్లు ?