జనాలకు బీఆర్ఎస్ దూరమైపోతోందా ?
x
KTR and Harish

జనాలకు బీఆర్ఎస్ దూరమైపోతోందా ?

చాలామంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, నేతలకు చెరువులు, కుంటల్లో అక్రమనిర్మాణాలున్నట్లున్నాయి. వీటిని హైడ్రా ఎప్పుడు కూల్చేస్తుందో అనే టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది.


అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి బీఆర్ఎస్ నేతలకు దిక్కుతోచటంలేదు. నేతలంటే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని మాత్రమే. ఎందుకంటే మిగిలిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా నోరిప్పటంలేదు. ఇక్కడ పై ముగ్గురి సమస్య ఏమిటంటే అధికారంలో ఉంటే తాము మాత్రమే ఉండాలని. తాము అధికారంలో లేకపోతే ప్రభుత్వంలోని పార్టీపై ప్రతిరోజూ ఆరోపణలు, విమర్శలతో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనే కనబడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఒకఎత్తయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం మరింత సమస్యగా మారింది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరనుండి ప్రతిరోజు ఏదో బురద చల్లేస్తునే ఉన్నారు.

తాజా విషయం ఏమిటంటే హైడ్రా దెబ్బకు బీఆర్ఎస్ లోని కీలక నేతలంతా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ముఖ్యంగా కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి లాంటి వాళ్ళు. వీళ్ళే ఎందుకంటే చెరువులు, కుంటలను ఆక్రమించేసి ఫాం హౌసులు, పెద్ద పెద్ద నిర్మాణాలను చేసేసుకున్నారు కాబట్టి. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ స్ధలాలను కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హైడ్రా అనే ఏజెన్సీని ఏర్పాటుచేశారు. దీనికి కమీషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాధ్ ను నియమించారు. ఇరిగేషన్, రెవిన్యు, పంచాయితీరాజ్ శాఖల్లోని సిబ్బందితో పాటు 259 మంది పోలీసు సిబ్బందిని కూడా హైడ్రాకు ప్రభుత్వం ఇచ్చింది. తొందరలోనే హైడ్రాకు పోలీసుస్టేషన్ హోదాను కూడా ఇవ్వబోతోందని సమాచారం.

కొద్దిరోజులుగా హైడ్రా అక్రమకట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ అసలు హీట్ మాత్రం జన్వాడలో కేటీఆర్ ఫాం హౌస్ నిర్మాణం అక్రమమని హైడ్రా తేల్చటంతోనే మొదలైంది. ఫాం హౌస్ ను కూల్చేస్తామని హైడ్రా నోటీసులివ్వటంతో మొదలైన హీట్ ప్రముఖ సినీనటుడు, హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేయటంతో పీక్సుకు చేరుకుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ భవనాలు చెరువును చెరబట్టి నిర్మించినవే అని బయటపడటంతో కూల్చేయటానికి హైడ్రా రెడీ అయ్యింది. దాంతో పల్లా కోర్టులో కేసువేశారు. ఇఫుడా విషయం కోర్టు పరిధిలో ఉంది.

సరిగ్గా ఇక్కడే కేటీఆర్, హరీష్ గోలగోల చేస్తున్నారు. ఏమనంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను రేవంత్ టార్గెట్ చేశారని. రుణమాఫీ ఫెయిల్యూర్ నుండి జనాల దృష్టిని మళ్ళించేందుకే రేవంత్ హైడ్రా అంటు నాటకాలు మొదలుపెట్టారని గోల చేశారు. అయితే ఎంత గొంతుచించుకుని గోలచేసినా జనాలు పట్టించుకోలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కునేందుకే హైడ్రాను రేవంత్ ఉసిగొల్పుతున్నారనే కొత్త ఆరోపణలు మొదలుపెట్టారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దీనికీ జనాలు కాదుకదా పార్టీ నేతల మద్దతే దొరకటంలేదు. ఇదే సమయంలో తమ ఎంఎల్ఏలను లాక్కునేందుకే హైడ్రాను ప్రయోగిస్తున్నాడని కేటీఆర్, హరీష్ అంటున్నారే కాని తమ ఎంఎల్ఏలు శుద్ధపూసలని చెప్పటంలేదు. చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేయలేదని మాత్రం అనటంలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, నేతలకు చెరువులు, కుంటల్లో అక్రమనిర్మాణాలున్నట్లున్నాయి. ఈ నిర్మాణాలను హైడ్రా ఎప్పుడు కూల్చేస్తుందో అనే టెన్షన్ కేటీఆర్, హరీష్ లో పెరిగిపోతున్నట్లుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేటీఆర్, హరీష్ జనాలకు దూరమైపోతున్నారు. కూల్చివేతలను బీఆర్ఎస్ ఎంత వ్యతిరేకిస్తోందో జనాలు అంతగా మద్దతిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలతో జనాలు పిచ్చహ్యాపీగా ఉన్నారు. చెరువులు, కుంటల పరిరక్షణకు పోరాటాలు చేస్తున్న ఎన్జీవోలు, ఆక్రమణలు, కబ్జాలను వ్యతిరేకించే జనాలందరు హైడ్రాకు పూర్తి మద్దతిస్తున్నారు. హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో కూడా మద్దతు ర్యాలీలు చేస్తున్నారు. హైడ్రా పరిధిని రాష్ట్రమంతా విస్తరించాలని రేవంత్ కు విజ్ఞప్తిచేస్తున్నారు.

జనాల మూడ్ ను గమనించిన బీజేపీ హైడ్రా యాక్షన్ కు మద్దతుగా మాట్లాడుతోంది. సీపీఐ కూడా హైడ్రాకు మద్దతుగా నిలబడింది. కాంగ్రెస్ ఎంఎల్ఏలు కూడా కూల్చివేతలకు బహిరంగంగా మద్దతుగానే మాట్లాడుతున్నారు. ఎటొచ్చి జనాల మూడ్ ను గ్రహించలేక బీఆర్ఎస్ కూల్చివేతలను వ్యతిరేకిస్తు రేవంత్ దెబ్బకు గిలగిల్లాడిపోతోంది. ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story