
ఎంఎల్సీల ఎంపికపై అధిష్ఠానం సీరియస్ ?
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎంఎల్సీలుగా అవకాశం ఇచ్చేదిలేదని రేవంత్ రెడ్డికి గట్టిగానే చెప్పిందని సమాచారం
ఎంఎల్సీ అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం చాలా సీరియస్ గానే ఉన్నట్లుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎంఎల్సీలుగా అవకాశం ఇచ్చేదిలేదని రేవంత్ రెడ్డికి గట్టిగానే చెప్పిందని సమాచారం. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో రేవంత్(Revanth) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress President Mallikarjuna Kharge)తో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లాంటి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ఎంఎల్సీ అభ్యర్ధుల ఎంపికలో యువత, మహిళలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కని సీనియర్ నేతలకే టాప్ ప్రయారిటి ఇవ్వాలని గట్టిగానే ఆదేశించిందని పార్టీవర్గాల సమాచారం. మార్చిలో ఎంఎల్ఏ కోటాలోని ఐదుగురు ఎంఎల్సీల పదవీకాలం పూర్తయిపోతోంది. ఐదుగురు ఎంఎల్సీ సీట్లు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్(BRS) చేతిలోనే ఉన్నాయి.
వచ్చేనెలలో ఖాళీ కాబోతున్న ఐదుసీట్లలో తాజా అసెంబ్లీలో ఎంఎల్ఏల బలాబలాలను బట్టి నాలుగుస్ధానాలు కాంగ్రెస్ కు, ఒకస్ధానం బీఆర్ఎస్ కు దక్కే అవకాశముంది. మొత్తం ఐదుసీట్లూ కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకోవాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అదిఎంతవరకు సాధ్యమో ఇఫ్పటికైతే క్లారిటిలేదు. ఐదోస్ధానాన్ని కూడా హస్తంపార్టీయే హస్తగతం చేసుకోవాలంటే బీఆర్ఎస్ లోని మరింతమంది ఎంఎల్ఏలను లాగేసుకుంటేనే సాధ్యమవుతుంది. ఇప్పటికైతే కాంగ్రెస్ ఖాతాలో పడబోయే నాలుగుసీట్ల కోసం చాలామంది గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు. రేవంత్ ద్వారా అధిష్ఠానంకు చెప్పించే నేతలు కొందరు. అధిష్ఠానంలోని ముఖ్యనేతలతో రేవంత్ కు చెప్పించుకుని సిఫారసులు చేయించుకుంటున్న నేతలు మరికొందరు. కాంగ్రెస్ అంటేనే పూర్తిప్రజాస్వామ్యమున్న పార్టీ అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇదేసమయంలో మిత్రపక్షమైన తమకు గతంలో ఇచ్చిన హామీప్రకారం ఒక ఎంఎల్సీ సీటును కచ్చితంగా కేటాయించాల్సిందే అని సీపీఐ నేతలు రేవంత్ పైన ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మిత్రధర్మాన్ని పాటిస్తే కాంగ్రెస్ కు మిగిలేది మూడుసీట్లు మాత్రమే. నామినేషన్ల దాఖలు తేదీ చివరివరకు కాంగ్రెస్ లో టికెట్లు ఫైనల్ కావన్న విషయం అందరికీ తెలిసిందే. స్ధూలంగా కాంగ్రెస్ కు వచ్చే మూడుసీట్లను మూడు ప్రధాన సామాజికవర్గాల నేతలకు కేటాయించబోతున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఒక సీటును రెడ్డి సామాజికవర్గానికి, మరో సీటును ఎస్సీ లేదా ఎస్టీలకు, ఇంకో సీటును బీసీలకు కేటాయించాలని అధిష్ఠానం లెవల్లో డిసైడ్ అయ్యిందట.
అధిష్ఠానం ఆలోచనలు, ఆదేశాలు ఎలాగున్నా ఎంఎల్సీ టికెట్ల కోసం చాలామంది సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మెదక్ ఎంపీగా ఓడిపోయిన నీలంమధు ముదిరాజ్, షబ్బీర్ ఆలీ, అజహరుద్దీన్, పోటీచేసే అవకాశం కోల్పోయిన ఎస్సీ నేత అద్దంకి దయాకర్, సిద్ధేశ్వర్, దొమ్మటి సాంబయ్య, ఎస్టీల నుండి రాములు నాయక్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు లాంటి అనేకమంది సీనియర్లు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికి బయటకు వచ్చిన పేర్లు మాత్రమే ఇవి. రోజులు గడిచేకొద్దీ ఇంకెంతమంది నేతలు రేసులో బయటపడతారో చూడాల్సిందే. ఏదేమైనా యువత, మహిళలతో పాటు ఇప్పటివరకు పోటీచేసే అవకాశ దక్కని సీనియర్లకు ప్రయారిట ఇవ్వాలని నిర్ణయించటం మంచి పరిణామమనే చెప్పాలి. లేకపోతే అసెంబ్లీ లేదా పార్లమెంటుకు ఓడిపోయిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ టికెట్ల రేసులో ఉంటారన్న విషయం చాలామందికి తెలిసిందే. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.