రేవంత్-కేసీఆర్ పై ఐరన్ లెగ్ ముద్ర కరెక్టేనా ?
x
Revanth and KCR

రేవంత్-కేసీఆర్ పై ఐరన్ లెగ్ ముద్ర కరెక్టేనా ?

నిజానికి ఐదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీపై జనాల్లో ఎంతోకొంత అసంతృప్తి ఉండటం సహజమే


ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ తాజా ఎన్నికల్లో ఓడిపోవటమే ఈ ప్రకంపనలకు కారణం. శనివారం వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi elections) పలితాల్లో బీజేపీ(BJP) 48 సీట్లతో విజయంసాధించగా ఆప్(AAP) 22 సీట్లకే పరిమితమైంది. 70 సీట్ల అసెంబ్లీలో బీజేపీ-ఆప్ సీట్లను పంచుకోగా కాంగ్రెస్ పార్టీ ఖాతాకూడా తెరవలేదు. వరుసగా మూడోఎన్నికలో కూడా కాంగ్రెస్(Congress) సున్నా సీట్లకే పరిమితమైంది. ఆప్ ఓడిందన్నది నిజమే అయినా మరీ అంత ఘోరఓటమైతే కాదు. ఆప్ ఓటమికి స్వయంకృతాలు కనబడుతుంటే బీజేపీ గెలుపుకు అనేక అంశాలు తోడయ్యాయి. బీజేపీ గెలుపుబాట మొదలవ్వగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటు ట్విట్టర్లో పెట్టిన వ్యగ్యమైన పోస్టు జాతీయస్ధాయిలో బాగా వైరల్ అయ్యింది.

రాహుల్ ను అవమానిస్తు కేటీఆర్(KTR) పెట్టిన పోస్టుకు కాంగ్రెస్ కూడా అంతేధీటుగా స్పందించింది. కేసీఆర్(KCR) ది ఐరల్ లెగ్ అంటు పెట్టిన పోస్టులు కూడా బాగా వైరల్ అయ్యింది. కేసీఆర్ ఎవరెవరిని అయితే కలిశారో వాళ్ళంతా తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినట్లు కాంగ్రెస్ ప్రచారంచేస్తోంది. తన ప్రచారానికి మద్దతుగా నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan mohan reddy), ఉత్థవ్ థాకరే, కేజ్రీవాల్(Aravind Kejriwal) ను కేసీఆర్ కలిసిన విషయాన్ని గుర్తుచేస్తు అందుకు సంబంధించిన ఫొటోలను వైరల్ చేస్తోంది. కేసీఆర్ ఎవరిని కలిస్తే వారంతా మటాషంతే అనే ట్యాగ్ లైన్ ను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తోంది. దాంతో కేటీఆర్ స్పందించారు. రేవంత్ దే ఐరన్ లెగ్ అంటు గట్టిగానే కాంగ్రెస్ పోస్టును తిప్పికొట్టేప్రయత్నంచేస్తున్నారు. తన వాదనకు కేటీఆర్ చూపిస్తున్న ఆధారాలు ఏవంటే ముంబాయ్, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్ ప్రచారంచేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే అంతకుముందు కర్నాటక ఎన్నికల్లో కూడా రేవంత్ ప్రచారంచేసిన విషయాన్ని కేటీఆర్ కావాలనే మరుగునపరిచారు. రేవంత్ తో పాటు చాలామంది తెలంగాణ నేతలు కర్నాటకఎన్నికల్లో ప్రచారంచేసిన విషయం తెలిసిందే. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంసాధించటాన్ని కేటీఆర్ అండర్ ప్లే చేశారు.

ఇద్దరిలో ఎవరూ కాదు

నిజానికి ఐదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీపై జనాల్లో ఎంతోకొంత అసంతృప్తి ఉండటం సహజమే. అలాంటిది ఏకంగా పదేళ్ళు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఇదేసమయంలో అవినీతిరహిత పాలన హామీతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన కేజ్రీవాల్ మూడోసారి 2020లో సీఎం అయిన తర్వాత అవినీతిలో కూరుకుపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) వెలుగుచూసిన తర్వాత కేజ్రీవాల్ ఇమేజిమొత్తం డ్యామేజి అయిపోయింది. లిక్కర్ స్కామ్ బీజేపీ కుట్రగా కేజ్రీతో పాటు ఆప్ నేతలు చేసిన ఆరోపణలను జనాలు నమ్మలేదు. ఇదే విషయాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) కూడా ప్రస్తావించారు. కేజ్రీవాల్ మీద లిక్కర్ స్కామ్ మినహా మరే అవినీతి ఆరోపణలేదని, కేజ్రీవాల్ ను ఓడించిన ఘనత కల్వకుంట్ల కవితకే దక్కుతుందని బొమ్మ ఎద్దేవాచేశారు. కేసీఆర్ తో స్నేహమే కేజ్రీవాల్ కొంపముంచిందని మహేష్ గౌడ్ సెటైర్లువేశారు.

కేజ్రీవాల్ స్వయంకృతం

కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోకుండా విడిగా పోటీచేయటమే కేజ్రీవాల్ చేసిన అతిపెద్ద తప్పు. అదికారం కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటీపడితే ఓట్లు మూడుపార్టీల మధ్య చీలిపోతాయన్నకనస ఆలోచన కూడా కేజ్రీవాల్ కు లేకపోవటమే విచిత్రం. 14 సీట్లలో గెలిచిన బీజేపీ అభ్యర్ధుల మెజారిటీకన్నా కాంగ్రెస్ అభ్యర్ధులు తెచ్చుకున్న ఓట్లే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. ఆప్ కు పడిన ఓట్లు సుమారు 44 శాతం అయితే కాంగ్రెస్ ఓటు షేర్ సుమారు 6 శాతం. రెండుపార్టీలు విడిగా పోటీచేయటం వల్లే బీజేపీకి గెలుపు సాధ్యమైంది. అదే ఆప్, కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని పోటీచేసుంటే ఎన్నికల ఫలితాలు ఎలాగుండేవో. ఒకళ్ళని మరొకళ్ళు దెబ్బకొట్టాలని ఆప్, కాంగ్రెస్ చేసుకున్న ప్రయత్నాల వల్లే మధ్యలో బీజేపీ గెలిచిందన్న విషయం ఫలితాలను చూస్తే ఎవరికైనా అర్ధమైపోతుంది.

ఇక రేవంత్ లేదా కేసీఆర్ ఐరెన్ లెగ్ అన్నది రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునేందుకు మాత్రమే పనికొస్తుంది. రేవంత్ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారంచేసింది వాస్తవమే. అయితే రేవంత్ ప్రచారంచేసిన కారణంగానే పార్టీ ఓడిపోయిందన్న కేటీఆర్ ఆరోపణలు సరైనవి కావు. పై రాష్ట్రాల్లో పార్టీ గెలుపోటములు స్ధానికంగా అనేక సమీకరణల మీద ఆధారపడుంటుంది. అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, ఆర్ధికవనరులు, ప్రభుత్వం మీద అసంతృప్తి లేదా సంతృప్తి, పొత్తులు, ఓట్లచీలిక, అభ్యర్ధుల ప్రచారం తీరు, ఎలక్షనీరింగ్, సామాజికసమీకరణలు అంటే సోషల్ ఇంజనీరింగ్, ప్రత్యర్ధిపార్టీల అభ్యర్ధుల మీద కూడా ఒకపార్టీ గెలుపోటములు ఆధారపడుంటాయని అందరికీ తెలిసిందే. గుజరాత్, మహారాష్ట్ర, హర్యానాలో కూడా కాంగ్రెస్, ఆప్ విడిగానే పోటీచేశాయి. ఓట్ల చీలిక కారణంగానే పై రాష్ట్రాల్లో బీజేపీ లాభపడిందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి రేవంత్ ప్రచారం చేసినా గెలవలేదన్నది ప్రత్యర్ధులు సెటైర్లు వేసేందుకు మాత్రమే పనికొస్తుంది.

స్ధానికసమీకరణలే కారణం

అలాగే కాంగ్రెస్ ప్రచారంచేస్తున్నట్లుగా కేసీఆర్ ఎవరిని కలిస్తే వాళ్ళంతా మటాషే అన్నది కూడా తప్పే. ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో ఓడిపోయారంటే 25 ఏళ్ళ అప్రతిహత పాలనపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకత. పట్నాయక్ మీద అవినీతి ఆరోపణలు లేకపోయినా పాలనాపరమైన ఆరోపణలు చాలానే ఉన్నాయి. జనాలు మార్పుకోరుకున్నారు కాబట్టే బీజేపీని గెలిపించారు. మహారాష్ట్ర, హర్యానాలో ఇండియా కూటమి అభ్యర్ధుల ఎంపిక సరిగాలేదనే ఆరోపణలు తర్వాత బాగా వినబడ్డాయి. సీట్ల షేరింగులో గొడవలు, ప్రచారంలో లుకలుకలు, అధినేతలు, అగ్రనేతల అలకలు, ఆప్ అభ్యర్ధుల పోటీవల్ల ఓట్లలో చీలిక, చివరినిముషం వరకు అభ్యర్ధులను ఫైనల్ చేయకపోవటం లాంటి అనేక కారణాలతో ఇండియా కూటమి ఓడిపోయింది. అంతేకాని కేసీఆర్ ను కలవటంవల్లే పట్నాయక్, ఉత్థవ్ ఓడిపోలేదు.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమిలో స్వయంకృతమే ఎక్కువ కనబడుతోంది. జగన్ చేసిన పాలనాపరమైన తప్పులతో పాటు పార్టీని నిర్లక్ష్యంచేయటం, నేతలను ఎందుకు పనికిరాకుండా చేసిన ప్రయత్నాలు, అభివృద్ధికన్నా సంక్షేమపథకాలనే ఎక్కువగా నమ్ముకోవటం లాంటి తప్పుల వల్లే జగన్ ఓడిపోయారు. ఇక ఢిల్లీ ఓటమిలో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోకపోవటం ఎంత తప్పో లిక్కర్ స్కామ్ కారణంగా ఇమేజి డ్యామేజీ అయిన మాటా అంతే వాస్తవం. కవిత కారణంగా కేజ్రీవాల్ ఇమేజి డ్యామేజీ అవటం వాస్తవమనే చెప్పాలి. కాబట్టి ఆప్ ఓటమిలో రేవంత్ పాత్రకన్నా కవితపాత్ర ఎక్కువగాఉందన్న విషయం జనాలందరికీ తెలుసు. కాబట్టి రేవంత్(Revanth), కేసీఆర్ లో ఎవరు ఐరెన్ లెగ్గన్న విషయాన్ని పై రెండుపార్టీలు దెప్పిపొడుకుకోవటం కాదు జనాలే తేల్చాలి.

Read More
Next Story