
‘జూబ్లీ’ ఫలితం నుండి బీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకుంటుందా ?
సోషల్ మీడియాను, మీడియాను మాత్రమే నమ్ముకుంటే జనాలు హర్షించరని గుర్తించాలి.
విజ్ఞలు ఏమిచేస్తారంటే ఎదురుదెబ్బల నుండి గుణపాఠం నేర్చుకుంటారు. ఇపుడు బీఆర్ఎస్ పార్టీ కూడా చేయాల్సింది ఇదే. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాత్రం ఓటమి కారణాలను నిజాయితీగా విశ్లేషించకుండా కాంగ్రెస్+బీజేపీ ఏకమయ్యాయని జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills by poll) ఉపఎన్నిక ఫలితం నిరూపించిందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అక్రమాలుచేసి, అన్యాయాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికలో గెలిచిందని అరిగిపోయిన రికార్డును వినిపించారు. అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్(BRS) గెలిచిన నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొన్న విషయాన్ని కేటీఆర్ మరచిపోయినట్లున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ళు ఎన్ని అరాచకాలకు పాల్పడిందో జనాలు మరచిపోలేదన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలి.
బీఆర్ఎస్ అరాచకాలకు ఉదాహరణగా టెలిఫోన్ ట్యాపింగ్ ఒక్కటే చాలు. ఓటిమిని హుందాగా అంగీకరించకుండా కాంగ్రెస్ పై ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది. కేటీఆర్ గమనించాల్సింది ఏమిటంటే సానుభూతి అన్నది అన్నిసార్లు గెలిపించలేందని. ఇదేసమయంలో క్షేత్రస్ధాయిలో జనాలకు దూరమైపోయి సోషల్ మీడియాను, మీడియాను మాత్రమే నమ్మకుంటే జనాలు హర్షించరని గుర్తించాలి. బీఆర్ఎస్ ఓడిపోయిన దగ్గర నుండి జనాల్లోకి వచ్చి ఉద్యమాలు చేసిన ఘటనలు చాలాతక్కువ. మూసీ విస్తరణలో ఇళ్ళు కోల్పోయిన బాధితులను పరామర్శించటం, హైడ్రా బాధితులను పరామర్శించటం లాంటి అంశాలు తప్పించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ చేసింది ఏమీలేదు. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రానపుడు క్షేత్రస్ధాయిలో తిరగాల్సిన బాధ్యతను కేటీఆర్ మరచిపోయారు.
ఎంతసేపు పార్టీఆఫీసులో కూర్చుని ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటమే రాజకీయమని కేటీఆర్ భావించారు. ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలోను, ప్రెస్ మీట్లతో మీడియాలో తప్పించి కేటీఆర్ క్షేత్రస్ధాయిలోకి అడుగుపెట్టిన సంఘటనలు చాలా తక్కువ. ఇదేసమయంలో రేవంత్ ప్రభుత్వం అనవసరమైన ఆరోపణలు కూడా చాలానే చేసేవారు. చిన్నవిషయాలను కూడా బూతద్దంలో చూపిస్తే జనాలు నమ్మేసి తమకు మద్దతుగా నిలుస్తారని కేటీఆర్ అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఉదాహరణకు తాము అధికారంలో ఉన్నపుడు గ్రేటర్ పరిధిలోని 28 వేల ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడుతు పోలీసులను దగ్గరపెట్టుకుని కబ్జాలు, ఆక్రమణలను తొలగించాల్సిందే అని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇపుడు హైడ్రా పేరుతో రేవంత్ చేస్తున్నది ఇదే కదా.
బీఆర్ఎస్ హయాంలో కూడా గురుకుల్ ట్రస్ట్, మాదాపూర్లోని అయ్యప్పసొసైటిలో అక్రమనిర్మాణాలను కూల్చేసిన విషయం కేటీఆర్ మరచిపోయినా జనాలు మరచిపోరుకదా. అలాగే మూసీ ప్రాజెక్టు పేరుతో నదికి రెండువైపుల ఉన్న ఆక్రమణలను, ఇళ్ళను తొలగించాలని ఉన్నతాధికారులను కేటీఆర్ ఆదేశించిన వీడియోలు ఇప్పటికీ సర్క్యులేషన్లో ఉన్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది కూడా ఇదే. తాము అధికారంలో ఉన్నపుడు ఏదైతే చేయాలని మొదలుపెట్టారో ఇపుడు రేవంత్ అదే చేస్తున్నారు. అయితే తాము అధికారంలో ఉన్నపుడు ఒకలాగ, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరోలాగ వ్యవహరిస్తున్న విషయాన్ని జనాలందరు గమనిస్తున్నారని కేటీఆర్ మరచిపోయారు.
ప్రతిపక్షం అంటే ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరంలేదన్న విషయాన్ని కేటీఆర్ గుర్తించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. జూబ్లీ ఉపఎన్నికలో పార్టీఓటమికి దారితీసిన నిజమైన కారణాలపై ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కేటీఆర్ నిజాయితీగా విశ్లేషించాలి. సమీక్షల్లో తాను మాట్లాడటం నేతలు వినటం కాకుండా నేతలు మాట్లాడితే తాను వినాలి. అప్పుడే లోటుపాట్లు, తప్పొప్పులు బయటపడతాయి. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత సమీక్షలు నిర్వహించినా నేతలు, కార్యకర్తలు ప్రస్తావించిన లోపాలను వినటానికి కేటీఆర్ ఇష్టపడలేదు. అందుకనే సమీక్షలను అర్ధాంతరంగా ముగించేశారు.
ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదు తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలు, ఆ తర్వాత జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ పుంజుకోవాలంటే ఇపుడు విశ్లేషణల్లో నిజాయితీ ఉండాలి. పార్టీలోని తప్పులను అంగీకరించి దిద్దుబాటుకు ఉపక్రమించాలి. అప్పుడే పార్టీ పుంజుకునేందుకు అవకాశాలుంటాయి. లేకపోతే పార్టీకి ఎదురయ్యే ప్రతిఓటమికీ కాంగ్రెస్ అధికార దుర్వినియోగమే కారణమని సమర్ధించుకుంటుంటే పార్టీ మరింత బలహీనపడటం ఖాయమని కేటీఆర్ గుర్తించాలి.

