Revanth | పంచాయితీఎన్నికల్లో ‘ఇద్దరు’ నిబంధనపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం ?
x
Revanth

Revanth | పంచాయితీఎన్నికల్లో ‘ఇద్దరు’ నిబంధనపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం ?

పంచాయితీ రాజ్ చట్టం 2018 సెక్షన్(3)ప్రకారం ఇద్దరుపిల్లలకన్నా ఎక్కువమంది ఉన్నవారు ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులు.


తొందరలోనే జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో కీలకమైన నిబంధనను ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఎత్తేయబోతున్నట్లు సమాచారం. ఇపుడు పంచాయితీ రాజ్ చట్టం 2018 సెక్షన్(3)ప్రకారం ఇద్దరుపిల్లలకన్నా ఎక్కువమంది ఉన్నవారు ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులు. ఉమ్మడి ఏపీలో పంచాయితీరాజ్ చట్టంని సెక్షన్ 3 ప్రకారం ఇద్దరు పిల్లల నిబంధనను 1995లో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పట్లో ఈనిబంధనను ప్రభుత్వం ఎందుకు తెచ్చిందంటే కుటుంబనియంత్రణను అమలుచేయాలని, ప్రోత్సహించాలని. ఈనిబంధన ప్రకారం ఎంతోమంది ఆశావహులు పోటీకి దూరమైపోతున్నారు. అందుకని చట్టాన్ని సవరించాలని లేదా రద్దుచేయాలని ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ప్రభుత్వాలు అంగీకరించలేదు.

అలాంటిది తాజాగా ఈ చట్టాన్ని సవరించి ఇద్దరు పిల్లల నిబంధనను రద్దుచేయాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. చట్టసవరణ లేదా రద్దుపై ఇపుడు ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తున్నదంటే ప్రజాప్రతినిధుల నుండి బాగా ఒత్తిడి వస్తున్నది. బహుసంతానం విషయంలో ఉన్న చట్టం పోటీకి ప్రతిబంధకంగా తయారైందని స్ధానిక నేతలు గోలగోల చేస్తున్నారు. ఈచట్టంవల్ల ఇద్దరికన్నా ఎక్కువమంది సంతానం ఉన్న నేతలు పోటీచేయలేకపోతున్నట్లు వాపోతున్నారు. కాబట్టి ఈచట్టాన్ని రద్దుచేసి పోటీచేయటానికి మార్గం ఏర్పరచాలని గ్రామ, మండలస్ధాయిలోని నేతలు ఎంఎఎల్ఏలు, ఎంఎల్సీ, మంత్రులపై బాగా ఒత్తిడి తెస్తున్నారు.

లోకల్ బాడీ ఎన్నికలంటే పంచాయితి, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే నిబంధన వర్తించేది ఒకపుడు. అయితే 2019లో కేసీఆర్ ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. సవరణల ప్రకారం ఇద్దరు పిల్లలనిబంధన నుండి మున్సిపల్ ఎన్నికలను మినహాయించింది. మున్సిపల్ చట్టాన్ని సవరణచేసి ఇద్దరు పిల్లల నిబంధనను రద్దుచేసింది. దాంతో ఇద్దరికన్నా ఎక్కువమంది పిల్లలున్న నేతలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయగలుగుతున్నారు. అదేపద్దతిలో పంచాయితి రాజ్ చట్టానికి కూడా సవరణలు చేసి ఇద్దరు పిల్లల నిబంధనను ఎందుకు ఎత్తేయకూడదనే ఒత్తిడి గ్రామ, మండలస్ధాయి నేతలనుండి పెరిగిపోతోంది. అప్పట్లోనే మున్సిపల్ చట్టంలో సవరణలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టంలో ఎందుకు ఈ నిబంధనను ఎత్తేయలేదో తెలీదు.

తొందరలో స్ధానికసంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇపుడీ డిమాండును లోకల్ నేతలు మళ్ళీ తెరమీదకు తెచ్చారు. తమప్రాంతాల్లోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, మంత్రులపై ఒత్తిడి తెచ్చి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసేట్లుగా రేవంత్ ను ఒప్పించాలని ఒత్తిడిపెడుతున్నారు.

నిబంధన ఎత్తేయాలి

స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఇద్దరుపిల్లల నిబంధనను ఎత్తేయాలని తెలంగాణ పంచాయితిరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఫెడరల్ తో రెడ్డి మాట్లాడుతు ‘‘ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువమంది ఉన్న నేతలు పోటీకి అనర్హులు అనేనిబంధన నేతలకు ప్రతిబంధకంగా తయారైంద’’న్నారు. ‘‘ఈనిబంధనను కేసీఆర్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో రద్దుచేసినపుడు పంచాయితీ ఎన్నికల్లోమాత్రం ఎందుకు కంటిన్యు చేస్తున్నారో అర్ధంకావటంలేద’’న్నారు. ‘‘ఇదేవిషయమై ఈమధ్యనే తాము రేవంత్ ను కలిసి విజ్ఞప్తిచేసి’’నట్లు చెప్పారు. ‘‘తమ డిమాండుకు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని తొందరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో సరైన నిర్ణయం తీసుకుంటారని తాము అనుకుంటున్నామ’’ని రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.

Read More
Next Story