‘టెట్’కు ముహూర్తం ఖరారు? త్వరలో విద్యాశాఖ నోటిఫికేషన్ !
x

‘టెట్’కు ముహూర్తం ఖరారు? త్వరలో విద్యాశాఖ నోటిఫికేషన్ !

‘చాన్నాళ్ల తరువాత మెగా డీఎస్సీ పడింది. ప్లీజ్ మరోసారి టెట్ నిర్వహించండి. మళ్లీ ఎప్పుడు డీఎస్సీ పడుతుందో. మాకో అవకాశం ఇప్పించండి ’ అంటూ మూడు లక్షల మంది ..


తెలంగాణలో నియామకాల ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే గ్రూప్ 1, 2, 3 వంటి ఉద్యోగాలకు తేదీలను ప్రకటించిన నియామక సంస్థలు.. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను కూడా నిర్వహించాలని భావిస్తోంది. 11,062 ఉపాధ్యాయుల నియామ‌కానికిగానూ గ‌త నెల 29న రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ప్రభుత్వ విడుదల చేసిన మెగా డీఎస్సీ రాయాలంటే టెట్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో మ‌రోసారి టెట్ నిర్వ‌హించాల‌ని ప్రభుత్వానికి అభ్య‌ర్థుల నుంచి విజ్ఞ‌ప్తులు వెళ్లాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ప్రతిపక్షాలు సైతం కోరాయి.
మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకూ మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పటికే ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే చాలామంది బీఈడీ, డీఈడీ అభ్యర్థులు, గతసారి నిర్వహించిన టెట్ లో అర్హత సాధించని ఉపాధ్యాయులు తిరిగి మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తమకు అవకాశం ఇస్తే మెగా డీఎస్సీ కూడా రాసే అవకాశం లభిస్తుందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దాదాపు 11 వేల పోస్టులతో తిరిగి డీఎస్సీ పడుతుందో అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇప్పుడే టెట్ రాసే ఛాన్స్ ఇవ్వాలని, తిరిగి ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడుతామని ప్రాధేయపడుతున్నారు. దీనిపై మంత్రులతో పాటు విద్యాశాఖ అధికారులను కూడా కలిసి వినతిపత్రాలను ఇస్తున్నారు.
గతంలో నిర్వహించిన టెట్‌ లో ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, వేలమంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని చెబుతున్నారు. అందువల్ల తిరిగి మరోసారి టెట్ ను నిర్వహించాలని కోరుతున్నారు. అవకాశముంటే టెట్‌, డీఎస్సీ రెండింటిని ఒకేసారి నిర్వహించాలని అంటున్నారు.
డీఎస్సీ ఇప్పుడు నిర్వహించినా.. ఫలితాలను మాత్రం ప్రకటించకుండా టెట్‌ను నిర్వహించి ఆ తర్వాత ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గురుకుల రిక్రూట్ మెంట్ లో చేపట్టిన విధానాన్నే డీఎస్సీలో కూడా అమలు చేయాలని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి హరీష్ రావు లేఖ
టెట్ పరీక్షలను నిర్వహించాలనే డిమాండ్ తో ఇటీవలే అభ్యర్థులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు నష్టపోకుండా టెట్ నిర్వహించిన తర్వాతనే డీఎస్సీ పరీక్షలు పెట్టాలని కోరారు.దీనిపై ఆయన సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ కూడా రాశారు.

టెట్‌ నిర్వహించక పోవడం వల్ల ప్రస్తుతం విడుదలైన డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతను అనేకమంది కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుడు సెప్టెంబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టెట్‌ నిర్వహించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్‌ నిర్వహించలేదని పేర్కొన్నారు.
డిసెంబర్‌లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 50 వేల మంది ఉన్నారని వివరించారు. టెట్‌ నిర్వహిస్తే ఇందులో అర్హత సాధించిన వారందరూ డీఎస్సీ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డీఈడీ, బీఈడీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలోనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. డీఎస్సీ కంటే ముందుగానే టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై ఎమ్మెల్సీ బల్మూరీ వెంకట్ విడుదల చేసిన ప్రకటనలో " టెట్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో మూడు లక్షల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై జీఓ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నిరుద్యోగుల పక్షానే ఉంది" అని ఆయన విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.


కాగా మొత్తం ఉద్యోగాల్లో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 పోస్టులు, 796 ఎస్జీటీ పోస్టులు.. అత్యధిక ఖాళీలు హైదరాబాద్ 878 ఉండగా తరువాత స్థానంలో ఖమ్మం 757, నల్గొండ 605, నిజామా 601, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 ఉన్నాయి.
Read More
Next Story