Ration system for Kingfisher beers| రేషన్ విధానంలో కింగ్ ఫిషర్ బీర్లు
x
Kingfisher beer dearth in Telangana

Ration system for Kingfisher beers| రేషన్ విధానంలో కింగ్ ఫిషర్ బీర్లు

ఇపుడు బ్రూవరీస్ కార్పొరేషన్ దగ్గర నిల్వున్న కింగ్ ఫిషర్ బీర్లు మరో వారంరోజులకన్నా వచ్చే అవకాశంలేదని అంచనా.


బీర్లమార్కెటింగ్ విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. వైన్ షాపులతో పాటు బార్లకు రేషన్ పద్దతిలో కింగ్ ఫిషర్ బీర్ల(Kingfisher Beer)ను సరఫరా చేస్తోంది. ఎందుకంటే కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాలో కొరత వచ్చేస్తోంది. ఇపుడు బ్రూవరీస్ కార్పొరేషన్ దగ్గర నిల్వున్న కింగ్ ఫిషర్ బీర్లు మరో వారంరోజులకన్నా వచ్చే అవకాశంలేదని అంచనా. అందుకనే మరికొన్ని రోజులు బీర్ల కొరత రాకుండా ఉండాలంటే రేషన్ పద్దతిని పాటించకతప్పదని ప్రభుత్వానికి బాగా అర్ధమైపోయింది. ఈ కారణంగానే ఇపుడు డిపోల్లో ఉన్న కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ ను చాలాజాగ్రత్తగా మార్కెట్లోకి పంపుతోంది. కమీషన్ పెంచే విషయంతో పాటు బకాయిలను క్లియర్ చేసే విషయంలో యునైటెడ్ బ్రూవరీస్(United Breweries)కంపెనీకి ప్రభుత్వంతో వచ్చిన పేచీ కారణంగా యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యం కింగ్ ఫిషర్ బీర్లను మార్కెట్లో సరఫరా చేయటం నిలిపేసింది. కింగ్ ఫిషర్ బ్రాండులోనే కింగ్ ఫిషర్ లైట్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ వెరైటీలు ఉన్న విషయం తెలిసిందే.

ఎప్పుడైతే యూబీ కంపెనీ కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపేసిందో అప్పటినుండి మార్కెట్లో కొరత మొదలైపోయింది. ఇపుడు ప్రభుత్వ డిపోల్లో ఉన్న కింగ్ ఫిషర్ బీర్ల నిల్వలు మరోవారం పాటు వస్తాయంతే. మరి వారం తర్వాత కింగ్ ఫిషర్ బీర్ల పరిస్ధితి ఏమిటి ? మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్లు దొరకకపోతే మందుబాబుల పరిస్ధితి ఏమిటి ? అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. అందుకనే ముదుజాగ్రత్తగా ప్రభుత్వం కింగ్ ఫిషర్ బీర్లను డిపోల వారీగా రేషన్ విధానంలో సరఫర చేయిస్తోంది. అంటే వైన్ షాపులు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలు పెడుతున్న ఇండెంట్ల ప్రకారం బీర్లు సరఫరా చేయకుండా ఇండెంట్లలో కోత విధిస్తోంది. కింగ్ ఫిషర్ బీర్లు మార్కెట్లో వారం తర్వాత దొరకవనే విషయం అందరికీ తెలుసు. అందుకనే ఎంతవీలైతే అన్నీ బీర్లను తెచ్చుకుని స్టాక్ పెట్టుకుందామని అమ్మకందార్లు ప్లాన్ వేశారు. ముందుజాగ్రత్తగా అవసరానికి మించి ఇండెంట్లు పెడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం కూడా అందుతున్న ఇండెంట్లలో కోతపెడుతోంది. అంతకుముందు పెట్టిన ఇండెంట్లకన్నా ఇపుడు పెడుతున్న ఇండెంట్లలో తక్కువ బీర్లనే సరఫరా చేస్తోంది.

కింగ్ ఫిషర్ బీర్లతో పాటు మిగిలిన కంపెనీలు తయారుచేస్తున్న బీర్లు రోజుకు 15 లక్షల బాటిళ్ళు అమ్ముడుపోతున్నాయి. మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్ తో పాటు రాయల్ చాలెంజ్(Royalchallange), బడ్ వైజర్(Budweiser), కార్ల్స్ బర్గ్ లాంటి 30 రకాల బీర్లు జనాలకు అందుబాటులో ఉన్నాయి. అయితే జనాలు ఎక్కువగా ఇష్టపడేది మాత్రం కింగ్ ఫిషర్ బీర్లనే. బీర్ల మర్కెట్లో కింగ్ ఫిషర్ బీర్ల మార్కెట్ సుమారు 70 శాతం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రోజువారీ 15 లక్షల బీర్లలో కింగ్ ఫిషర్ బీర్లు సుమారు 11 లక్షలు అమ్ముడుపోతున్నాయి. అందుకనే ఇపుడున్న స్టాక్ ప్రకారం కింగ్ ఫిషర్ బీర్లను వీలైనన్ని వైన్ షాపులు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లకు సరఫరా చేయటంకోసం రేషన్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

ఇదేసమయంలో కింగ్ ఫిషర్ బీర్ కు ప్రత్యామ్నాయంగా ఇతర కంపెనీలు తయారుచేస్తున్న బీర్లఉత్పత్తిని పెంచేట్లుగా యాజమాన్యాలతో ప్రభుత్వం(Telangana government) మాట్లాడుతోంది. బీర్లఉత్పత్తిని పెంచటంలో ఆసక్తి, సామర్ధ్యం ఉన్న కంపెనీలతో బ్రూవరీస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే యూబీ కంపెనీకి ఉన్న నాలుగుయూనిట్లలో రెండింటిలో బీర్లతయారీని నిలిపేసింది. మిగిలిన యూనిట్లను కూడా నిలిపేస్తే వారంరోజుల తర్వాత తెలంగాణ మొత్తంమీద కింగ్ ఫిషర్ బీరన్నదే కనబడదు. మరి ప్రభుత్వానికి, యూనైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యానికి ఏర్పడిన ప్రతిష్ఠంభన ఎప్పుడు తొలుగుతుందో చూడాలి.

Read More
Next Story