Jr NTR | జూనియర్ అభిమానులు ఏపీలో ప్రెస్ మీట్లు పెట్టేందుకు లేదా ?
x
Jr NTR fans

Jr NTR | జూనియర్ అభిమానులు ఏపీలో ప్రెస్ మీట్లు పెట్టేందుకు లేదా ?

ప్రసాద్ ఫోన్లో మాట్లాడుతు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ను బండబూతులు తిట్టినట్లుగా ఒక ఆడియో ప్రచారంలో ఉంది


జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ లో మరీ ఇంత ఘోరంగా ఉందా ? అవుననే అంటున్నాడు జూనియర్ అభిమానసంఘాల్లో కీలక వ్యక్తి నరేంద్ర చౌదరి. ఏపీలో ప్రెస్ మీట్లు పెట్టుకునే అవకాశం లేకపోవటం వల్లే తాము హైదరాబాదు(Hyderabad)కు వచ్చి మీడియాసమావేశం పెట్టాల్సొచ్చిందని ఆవేధనతో చెప్పాడు. ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగురోజుల క్రితం అనంతపురం అర్బన్ టీడీపీ ఎంఎల్ఏ దగ్గుపాటి వెంకటేశ్వర(TDP MLA Daggupati Prasad) ప్రసాద్ ఫోన్లో మాట్లాడుతు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ను బండబూతులు తిట్టినట్లుగా ఒక ఆడియో ప్రచారంలో ఉంది. ఆ ఆడియోలో జూనియర్ తో పాటు ఆయన తల్లిని కూడా నోటికొచ్చినట్లు తిట్టాడు. పనిలోపనిగా జూనియర్ నటించిన వార్-2 సినిమా(War-2 Movie)ను ఎలా ఆడిస్తారో చూస్తామని ఎంఎల్ఏ సదరు వ్యక్తితో మాట్లాడుతు చాలెంజ్ కూడా చేసినట్లుంది.

దీనిపై బాగా రచ్చ జరగటంతో స్పందించిన ఎంఎల్ఏ ఆడియోలో వినబడుతున్న గొంతు తనదికాదన్నారు. ఎంఎల్ఏ వివరణ ఇచ్చినా జూనియర్ అభిమానులు అయితే ఒప్పుకోకపోగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ వివాదం బాగా పెద్దదై చివరకు చంద్రబాబునాయుడు దాకా వెళ్ళింది. ఈవివాదంపై జూనియర్ ఏమీ మాట్లాడలేదు కాని తన అభిమానులు మాత్రం మండిపోతున్నారు. తమలోని ఆగ్రహాన్ని వ్యక్తంచేయటానికి అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నిస్తే సాధ్యంకాలేదు. ప్రెస్ మీట్ నిర్వహించేందుకు పోలీసులు అంగీకరించలేదు. అనంతపురంలో కుదరలేదని విజయవాడలో ప్రయత్నించారు. విజయవాడలో కూడా ప్రెస్ మీట్ పెట్టేందుకు పోలీసులు అనుమతించలేదు. దాంతో చేసేదిలేక అభిమానుల్లో కొందరు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టుకున్నారు.

దీంతోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీకి లేదా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టేందుకు లేదన్న విషయం అర్ధమైపోతోంది. ప్రెస్ క్లబ్ లో నరేంద్ర, సుధీర్ రాజు, కావూరి కృష్ణ, బాబ్జి, ఆదోని ముజీబ్ మాట్లాడుతు ఎంఎల్ఏపై మండిపడ్డారు. దగ్గుపాటిని వెంటనే పార్టీనుండి సస్పెండ్ చేయాలని,, రెండురోజుల్లో ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ డిమాండును పట్టించుకోకపోతే అనంతపురం ముట్టడికి పిలుపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దగ్గుపాటి ఎవరికైతే ఫోన్ చేసి జూనియర్ ను బూతులు తిట్టాడు అతన్నే పక్కనపెట్టుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పారు.

టీడీపీలో ఎవరిగురించి జూనియర్ పల్లెత్తు మాటనకపోయినా పార్టీలో కొందరు నేతలు మాత్రం జూనియర్ ను పదేపదే కించపరిచేట్లుగా వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు. దగ్గుపాటిని పిలిపించుకున్న చంద్రబాబు ఏమి మాట్లాడారు ? జూనియర్ అభిమానుల డిమాండుపై దగ్గుపాటి ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తిగా మారింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story