బీఆర్ఎస్ లో ఒక్క బీసీ నేత కూడా లేరా ?
x
Giant-size vinyl Poster in BRS meeting

బీఆర్ఎస్ లో ఒక్క బీసీ నేత కూడా లేరా ?

బీసీలను గుర్తించి, పదవులిచ్చింది బీఆర్ఎస్సే అని కేటీఆర్ ప్రతిరోజు పదేపదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే


ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ లో చెప్పుకోవటానికి అయినా ఒక్కరంటే ఒక్క బీసీ నేత కూడా లేరా ? ఆశ్చర్యంగా ఉంది వేదికమీద ఏర్పాటుచేసిన జైంట్ సైజ్ వినైల్ లోని పోస్టర్ చూసి. ప్రాంతీయపార్టీలంటే అధినేతల సొంత ఆస్తుల్లాంటివే అనటంలో సందేహంలేదు. ఆస్తికి యజమాని కాబట్టి అధినేత ఏమిచెబితే అదే ఫైనల్. కాదంటే పార్టీలో నుండి ఎంతటివారైనా సరే గెటౌటే. దీనికి ఉదాహరణ మాజీమంత్రి ఈటల రాజేందరే(Eetala Rajendar). ఇపుడు విషయం ఏమిటంటే హనుమకొండలోని ఎల్కతుర్తి(Elkaturti BRS meeting) గ్రామంలో బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభ జరగబోతోంది. పార్టీ ఏర్పాటుచేసి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతినుద్దేశించి ప్రసంగించాలని అనుకున్నారు. అందుకనే పదిలక్షలమంది జనాల అంచనాతో భారీ బహిరంగసభను ఏర్పాటుచేశారు.

పదిలక్షలమంది అంచనాతో భారీ బహిరంగసభ అన్నాక అందుకు తగ్గట్లే బాహుబలి లాంటి వేదిక కూడా ఏర్పాటుచేయాలి కదా. సుమారు 200 అడుగుల వెడల్పుతో, ఎనిమిది అడుగుల ఎత్తులో బ్రహ్మాండమైన వేదిక ఏర్పాటుచేశారు. ఈ వేదికమీద సుమారు 400 మంది సీనియర్ నేతలు కూర్చునేట్లుగా సీటింగ్ కూడా ఏర్పాటుచేశారు. వేదిక వెడల్పుకు తగ్గట్లే జైంట్ సైజ్ వినైల్ కూడా ఏర్పాటైంది. ఆ పోస్టర్లో ఎడమవైపు కేసీఆర్(KCR) ఫొటో, కుడివైపున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫొటో ఉంది. మధ్యలో ‘బీఆర్ఎస్ రజతోత్సవ సభ’ అని పెద్దగా రాసుంది. ఇంతవరకు బాగానే ఉన్నా పోస్టర్లో ఎక్కడా మూడోనేత ఫొటో కనబడలేదు. హరీష్ రావు, కూతురు కల్వకుంట్ల కవిత ఫొటోలు కూడా లేవు. వీళ్ళ ఫొటోలు కూడా వేస్తే అంతా కుటుంబం సభ్యుల ఫొటోలేనా అనే గోలవుతుందని అనుకున్నారో ఏమో కాని హరీష్, కవిత ఫొటోలు వేయలేదు.

వీళ్ళిద్దరి ఫొటోలున్నా లేకపోయినా నష్టంలేదు. అయితే బీసీ నేత ఫొటో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు లేదు ? ఇపుడు తెలంగాణ రాజకీయాలన్నీ బీసీ సామాజికవర్గం చుట్టూనే తిరుగుతోంది కదా ? ఈవిషయం కేసీఆర్, కేటీఆర్ కు బాగా తెలుసు. బీసీలను గుర్తించి, పదవులిచ్చింది బీఆర్ఎస్సే అని కేటీఆర్ ప్రతిరోజు పదేపదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. నిజంగానే బీసీలపై కేసీఆర్, కేటీఆర్ కు అంత ప్రేమే ఉంటే పోస్టర్లో ఒక్క బీసీ నేత ఫొటో కూడా ఎందుకు వేయించలేదు ? పార్టీలో తలసాని శ్రీనివాసయాదవ్, మదుసూధనాచారి, శ్రీనివాసగౌడ్, గంగుల కమలాకర్ లాంటి సీనియర్ బీసీనేతలు చాలామందే ఉన్నారు. అయినా సరే చెప్పుకోవటానికి అయినా ఒక్కరంటే ఒక్క బీసీ నేత ఫొటో కూడా వేయలేదంటే ఏమిటర్ధం ?

Read More
Next Story