బీసీ రిజర్వేషన్లపై రేవంత్ హిడెన్ అజెండా ఇదేనా ?
x
Revanth

బీసీ రిజర్వేషన్లపై రేవంత్ హిడెన్ అజెండా ఇదేనా ?

స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు జారీచేసిన జీవో న్యాయసమీక్షకు నిలబడదని రేవంత్ కు బాగా తెలుసు


కిందపడ్డా పైచేయి తనదే అనిపించుకోవాలన్నది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పద్దతి. ఎలాసాధ్యమంటే బీసీ రిజర్వేషన్ బిల్లును హైకోర్టు కొట్టేసినా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక లాభంచేకూర్చటమే రేవంత్(Revanth) హిడెన్ అజెండా. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్(BC reservations) అమలుకు జారీచేసిన జీవో న్యాయసమీక్షకు నిలబడదని రేవంత్ కు బాగా తెలుసు. అంతకుముందు అసెంబ్లీ తీర్మానంచేసి పంపిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగులో ఉన్నపుడు ప్రభుత్వం జీవో జారీచేసినా చెల్లదని ప్రభుత్వానికి తెలుసు. తెలిసికూడా జీవో ఎలాగిచ్చింది ? ఎలాగంటే బీసీలకు ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పించినా హైకోర్టు(Telangana High court) అడ్డుకుంది అని ప్రచారం చేసుకోవటానికి. ఇలాంటి ప్రచారంచేసుకుని రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో లబ్దిపొందాలన్నదే రేవంత్ హడెన్ అజెండా.

రేవంత్ అనుకున్నట్లే కోర్టు స్పందించింది. ‘‘50శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేందుకు లేదని గతంలో సుప్రింకోర్టు తీర్పును ప్రభుత్వం ఎలా ఉల్లఘించింది’’ అని విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఎ సుదర్శన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వం పంపిన బిల్లు గవర్నర్ ఆమోదం తెలపకుండానే జీవో ఎందుకు జారీచేశార’’ని నిలదీసింది. ఏ బిల్లయినా సరే శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినా, మెజారిటితో ఆమోదించినా సదరు బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అమల్లోకి వస్తుంది లేకపోతే కోల్డ్ స్టోరేజీలో ఉండాల్సిందే. విచారణలో జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ద్విసభ్య ధర్మాసనం ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్(ఏజీ)ను సూటిగా ప్రశ్నించింది. పంచాయితీరాజ్ చట్టసవరణను అసెంబ్లీఏకగ్రీవంగా ఆమోదించిందన్న ఏజీ వాదనను ద్విసభ్యధర్మాసనం పట్టించుకోలేదు. అసెంబ్లీ చేసిన తీర్మానంపై గవర్నర్ సంతకం ఉందా లేదా అని మాత్రమే కోర్టు చూసింది. లేదుకాబట్టే గవర్నర్ ఆమోదంలేకుండా ప్రభుత్వం జీవో ఎలా జారీచేస్తుందని గట్టిగా ప్రశ్నించింది.

గవర్నర్ ఆమోదంలేకుండా జారీచేసే జీవో చెల్లదని, జీవోను ప్రభుత్వం జారీచేసినా అమల్లోకి వచ్చే అవకాశాలు లేవని రేవంత్ ప్రభుత్వానికి బాగాతెలుసు. తెలిసికూడా ఉద్దేశ్యపూర్వకంగానే బిల్లుపై అసెంబ్లీతీర్మానం, గవర్నర్ ఆమోదంలేకుండానే జీవో జారీ అయిపోయాయి. పిటీషనర్లు బి. మాధవరెడ్డి, ఎస్ రమేష్ తరపు లాయర్లు మయూర్ రెడ్డి, జే ప్రభాకర్ వాదనలతో ద్విసభ్య ధర్మాసనం ఏకీభవించింది. పంచాయితీరాజ్ చట్టాన్ని సవరిస్తు అసెంబ్లీ చేసిన తీర్మానానికి గవర్నర్ ఆమోదంలేదన్న పిటీషనర్ల వాదననే హైకోర్టు సమర్ధించింది. రిజర్వేషన్లు 50శాతం మించకూడదని ‘‘కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’’, ‘‘వికాస్ కిషన్ రావు గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’’ కేసులో సుప్రింకోర్టు చెప్పిందని గుర్తుచేసిన లాయర్ల వాదనతో ద్విసభ్య ధర్మాసనం ఏకీభవించింది.

అయితే మూడువైపుల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి ఊరటలభించేట్లుగా కొన్నిసూచనలు చేసింది. అవేమిటంటే ‘‘ఎలక్షన్లు వాయిదావేసుకుని చట్టప్రకారం అన్నీ అడ్డంకులను తొలగించుకుని అప్పుడు ఎన్నికలు నిర్వహించకోవచ్చ’’ని చెప్పింది. ‘‘దసరాపండుగ సెలవుల తర్వాత వరకైనా ఎన్నికలను వాయిదావేసే అంశాన్ని ప్రభుత్వం ఆలోచించాల’’ని సూచించింది. విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం ‘‘ఆరోజుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తన వాదనలతో రావాల’’ని ఆదేశించింది. అయితే 42శాతం రిజర్వేషన్ల అములుకు రేవంత్ ప్రభుత్ జారీచేసిన జీవో 9పై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కాబట్టి సదరు జీవో లైవ్ లోనే ఉన్నట్లు అనుకోవాలి.

రేవంత్ కు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తున్నట్లు జనాలు అనుకోవాలి. ముఖ్యంగా బీసీలకు ఈమెసేజ్ వెళ్ళాలి. ఇదేసమయంలో జీవోను కోర్టుఅడ్డుకున్నా వచ్చే నష్టంఏమీలేదు. ఎందుకంటే ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటే తాము చేయగలిగేది ఏమీలేదని రేవంత్ ఎన్నికల్లో బీసీ సామాజికవర్గానికి చెప్పుకుంటారు. రేవంత్ వాదనను ఎవరూ తప్పుపట్టేందుకు లేదు. ఇప్పటివరకు రేవంత్ అనుకున్నట్లే జరుగుతోంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమేరకు లబ్దిపొందుతుందో చూడాల్సిందే.

Read More
Next Story