గ్రేటర్ డివిజన్ల సంఖ్య పెంచటంలో రేవంత్ వ్యూహమిదేనా ?
x
Greater Hyderabad Municipal Corporation

గ్రేటర్ డివిజన్ల సంఖ్య పెంచటంలో రేవంత్ వ్యూహమిదేనా ?

తొందరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటు బీజేపీని గట్టిగా దెబ్బకొట్టడమే రేవంత్ వ్యూహం


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 27 మున్సిపాలిటీలను, అనేక గ్రామాలను విలీనం చేసుకుని దేశంలోని అతి పెద్ద మహానగరంగా అవతరించింది. దీనితో తెలంగాణలో రెండుగా చీలిపోయింది. హైదరాబాద్ కార్పొరేట్ తెలంగాణ ఇందులో ఒకటయితే, రెండేది గ్రామీణ తెలంగాణ.

కార్పొరేట్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఇపుడున్న 150 డివిజన్ల నుంచి 300కి విస్తరించిస్తుంది. అంతే, హైదరాబాద్ మునిసిపల్ కౌన్సిల్ అసెంబ్లీ కంటే రెండింతలు కంటే పెద్దది. అసెంబ్లీ స్థానాలు కేవలం 119 మాత్రమే. ఇక జనాభా విషయానికి వచ్తే, హైదరాబాద్ 1.70 కోట్ల జనాభాతో సగం తెలంగాణ కంటే పెద్దగా ఉంటుంది. ఇంత పెద్ద మహానగరాన్ని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఎందుకు సృష్టిస్తున్నట్లు. మరొక రెండు దఫాలు తానే ముఖ్యమంత్రి ని అనే పదే పదేఆయన చెప్పుకోవడానికి దీనికి ఏమైనా రాజకీయ సంబధం ఉందా.

ఖరీదై రియల్ ఎస్టేట్ భూభంగా ఉన్న హైదరాబాద్ ను విస్తరించడమంటే రియల్ ఎస్టే ట్ వ్యాపారాన్ని విస్తరింప చేయడమే. ఇది కేవలం వ్యాపార సంబధమయిన నిర్ణయమనడానికీ వీల్లేదు, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగున్నట్లు ఎవరికైనా అనుమానం వస్తుంది. డివిజన్ల సంఖ్యను పెంచి తొందరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) తో పాటు బీజేపీని గట్టిగా దెబ్బకొట్టడమే రేవంత్(Revanth) వ్యూహ.మేమో అని పిస్తుంది. డివిజన్ల సంఖ్యను పెంచటం వల్ల బీఆర్ఎస్, బీజేపీలను కాంగ్రెస్(Telangana Congress)ఏ విధంగా దెబ్బకొట్టగలదు ? దీనిగురించి తెలుసుకోవాలంటే ముందు గడచిన ఎన్నికల్లో పై రెండుప్రతిపక్ష పార్టీలకు ఎన్నిసీట్లు వచ్చాయో తెలుసుకోవాలి. 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 56 డివిజన్లలో గెలిచింది. బీజేపీ 48, ఏఐఎంఐఎం 44 డివిజన్లలో గెలవగా కాంగ్రెస్ గెలిచింది కేవలం 2 డివిజన్లలో మాత్రమే. 150 డివిజన్లలో 2 అంటే 2 డివిజన్లలో గెలిచిందంటేనే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో అర్ధమైపోతోంది.

జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ పరిస్ధితి ఏమాత్రం మెరుగుపడలేదని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 24 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 16, ఎంఐఎం 7 చోట్ల, బీజేపీ ఒక నియోజకవర్గంలో గెలిచింది. అంటే కాంగ్రెస్ 24 నియోజకవర్గాల్లో పోటీచేసినా ఒక్కచోట కూడా గెలవలేదంటే ఏమిటర్ధం ? గ్రేటర్ పరిధిని దాటి జిల్లాల్లో కాంగ్రెస్ బాగానే సీట్లు గెలుచుకుంది. అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోవటానికి చాలామంది సీనియర్ నేతలున్నా పార్టీ మాత్రం బలహీనపడిపోయింది. ఇలాంటి నేతల వల్ల పార్టీ బలోపేతమవుతుందని కాని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటి సీట్లు సాధించాలనే ఆలోచన కూడా రేవంత్ చేయలేడు.

అందుకనే వాస్తవపరిస్ధితిని అర్ధంచేసుకుని మాస్టర్ ప్లాన్ వేశాడు. అదేమిటంటే గ్రేటర్ పరిధిని పెంచటమే. ఇపుడు గ్రేటర్ పరిధికి ఆనుకుని ఉన్న మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలను కలుపుకుంటే తప్ప గ్రేటర్ పరిధి పెరగదు. గ్రేటర్ పరిధికి ఆనుకుని ఉన్న ఏడునియోజకవర్గాల్లోని 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తే అదనంగా 150 డివిజన్లు వస్తాయని ప్రభుత్వం లెక్కకట్టింది. ఇపుడున్న 150 డివిజన్లకు అదనంగా మరో 150 డివిజన్లను కలిపి గ్రేటర్ పరిధిని ఏకంగా 300 డివిజన్లకు రేవంత్ ప్రభుత్వం పెంచేసింది. రేవంత్ వ్యూహం ఏమిటంటే ఇప్పటికే గ్రేటర్లో ఉన్న 150 డివిజన్లతో పాటు కొత్తగా కలిసిన 150 డివిజన్లలో మెజారిటి డివిజన్లు గెలుచుకుంటే తప్ప కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశంలేదు. మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో గ్రేటర్ కుర్చీని కాంగ్రెస్ గెలుచుకోవాలన్నది రేవంత్ వ్యూహం.

మున్సిపాలిటీలే డివిజన్లయ్యాయా ?


గ్రేటర్ కు ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్ కలిపేసిన ప్రభుత్వం వాటిని డివిజన్లుగా పేర్కొన్నది. డివిజన్ల లెక్కనే తీసుకుంటే రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్, మణికొండ, నార్సింగి, బండ్లగూడజాగీర్ మున్సిపాలిటీలు డివిజన్లుగా మారాయి. పటాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్ పూర్ డివిజన్లు, ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో పెద్ద అంబర్ పేట, ఆదిబట్ల, తుర్కయంజాల్ డివిజన్లున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో 4 డివిజన్లు బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడ డివిజన్లు చేరాయి. మేడ్చల్ నియోజకవర్గంలో తొమ్మిది డివిజన్లు మేడ్చల్, దమ్మాయిగూడ, పోచారం, ఘట్ కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, దుండిగల్, ఫిర్జాదీగూడ, జవహర్ నగర్ గ్రేటర్లో కొత్తగా కలిశాయి. అలాగే ఉప్పల్ నియోజకవర్గంలో నాగారం, బోడుప్పల్ డివిజన్లు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి, నిజాంపేట్ డివిజన్లు కొత్తగా కలిశాయి.

ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఏడునియోజకవర్గాల్లో మూడు కాంగ్రెస్ చేతిలోను, మిగిలిన నాలుగు నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఖాతాలోను ఉన్నాయి. కాంగ్రెస్ చేతిలో డైరెక్టుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గముంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గాలు రాజేంద్రనగర్, పటాన్ చెరు నియోజకవర్గాలున్నాయి. బీఆర్ఎస్ చేతిలో మహేశ్వరం, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాలున్నాయి.

ఏడు నియోజకవర్గాల్లోనే 150 డివిజన్లు


నాలుగు నియోజకవర్గాలు బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నా వీటిల్లో గ్రేటర్ ఎన్నికల నాటికి ఎన్ని కారుపార్టీలోనే ఎన్నింటాయో తెలీదు. మహేశ్వరం ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎంఎల్ఏ కేపీ వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎంఎల్ఏ బండారి లక్షారెడ్డి, మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అయితే వీరిలో మల్లారెడ్డి తరచూ రేవంత్ ను కలుస్తునే ఉన్నారు. రేవంత్ ను ఎందుకు కలుస్తున్నారంటే ఏవేవో కారణాలు చెబుతున్నారు కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటారనే గ్యారెంటీలేదు. ఇక సబిత, వివేకా, లక్ష్మారెడ్డిలో కూడా ఒకళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినా ఆశ్చర్యంలేదు.

ఇప్పటి పాలిటిక్సులో సిద్ధాంతాలకన్నా రాద్దాంతాలకే ఎక్కువ విలువుంటోందన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా చాలామంది ప్రజాప్రతినిధులకు రియల్ ఎస్టేట్ తో పాటు చాలా వ్యాపారాలుంటున్నాయి. వీటిల్లోని లొసుగులను అధికారపార్టీలు అడ్డంపెట్టుకునే ప్రతిపక్షపార్టీల ఎంఎల్ఏలు, ఎంపీలను లొంగదీసుకోవటం మామూలైపోయింది. తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాల ప్రజాప్రతినిధుల విషయంలో కేసీఆర్ చేసిందిదే. అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ, కాంగ్రెస్ నుండి 18 మంది ఎంఎల్ఏలు, 23మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు. అప్పుడు కేసీఆర్ అనుసరించిన విధానాన్నే ఇపుడు రేవంత్ కూడా అనుసరిస్తున్నారు.

రేవంత్ ధీమా ఇదేనా ?


కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి కొత్తగా కలిసిన 150 డివిజన్లలో ఏదోపద్దతిలో మెజారిటి డివిజన్లలో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్నది రేవంత్ ఆలోచన. ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకం, సన్నబియ్యం పథకం వల్ల ప్రజలు ప్రభుత్వాన్ని ఆదరిస్తారనే నమ్మకం రేవంత్ లో ఉంది. అధికారంలో ఉండీ మెజారిటి డివిజన్లలో గెలవకపోతే రేవంత్ ప్రభుత్వానికి అవమానం. పైగా సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటి డివిజన్లలో గెలవలేదంటే వ్యక్తిగతంగా రేవంత్ కు కూడా అవమానమే. అసెంబ్లీ ఎన్నికలఫలితాల ప్రకారంచూస్తే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉందన్న విషయం వాస్తవం. అయితే ఎంతబలంగా ఉందన్న విషయంలో క్లారిటిలేదు. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటమితో పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వం మీద పార్టీనేతల్లో అనుమానాలు మొదలయ్యాయనే ప్రచారంతెలిసిందే. ఇదేనిజమైతే గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలమేమిటో తేలిపోతుంది.

ఇలాంటి అనేకవిషయాలను అంచనావేసుకున్న తర్వాతే రేవంత్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని 27 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకొచ్చి కొత్తగా 150 డివిజన్లుగా మార్చింది. రేవంత్ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందన్న విషయం గ్రేటర్ ఎన్నికలు జరిగితేకాని తెలీదు. గ్రేటర్ పరిధిని 300 డివిజన్లకు మార్చిన విషయంలో ప్రతిపక్షాలు నానా గోలచేస్తున్నాయి.

తప్పుడు నిర్ణయం : కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ కేపీ వివేకానంద మాట్లాడుతు గ్రేటర్ పరిధిలోకి 27 మున్సిపాలిటీలను విలీనంచేయటం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయమన్నారు. ప్రజల సమ్మతిలేకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలోకి ఎలా తీసుకొచ్చిందని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కార్పొరేట్ సంస్ధలు, రియల్ ఎస్టేట్ సంస్ధలకు తప్ప మామూలు జనాలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. తొందరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో లబ్దిపొందటానికే కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్ల సంఖ్యను పెంచిందని మండిపడ్డారు. అశాస్త్రీయపద్దతిలో తీసుకున్న ఇలాంటి నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వివేకానంద డిమాండ్ చేశారు.

రాజకీయ కుట్ర : రామచంద్రరావు

గ్రేటర్ పరిధిలోకి కొత్తగా 150 డివిజన్లను చేర్చటం రేవంత్ ప్రభుత్వ రాజకీయ కుట్రగా బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంవల్ల 27 మున్సిపాలిటీల్లోని ప్రజలకు లాభాలు లేకపోగా నష్టాలు తప్పవన్నారు. మున్సిపాలిటీలు, పంచాయితీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకురావటంతో ప్రజలపై అన్నీరకాల పన్నుల భారం పెరిగిపోతుందని చెప్పారు. ఎంఐఎం సహకారంతో అత్యధిక డివిజన్లను గెలుచుకోవాలన్న ఆలోచన తప్ప రేవంత్ కు ప్రజల సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంలేదని మండిపడ్డారు.

తప్పుడు పాలసీ : ప్రొఫెసర్ కూరపాటి

‘‘హైదరాబాద్ ను ప్రపంచంలోనే అతిపెద్దగా చూపించాలన్న ఉద్దేశ్యంతోనే 150 డివిజన్లను గ్రేటర్ మున్సిపాలిటీలో కలిపేశారు’’ అని కాకతీయ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపటి నారాయణ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతు ‘‘సగం గ్రామీణప్రాంత జనాభాను రేవంత్ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోకి చేర్చేసినట్లయ్యింది’’ అని కూరపాటి అన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయంవల్ల రాష్ట్రం కార్పొరేట్ తెలంగాణ-రూరల్ తెలంగాణగా విడిపోయింది’’ అని చెప్పారు. ‘‘పేదలతెలంగాణ గ్రామీణప్రాంత జిల్లాల్లో ఎడారిగా మారిపోతుంది’’ అని అన్నారు. ‘‘గ్రేటర్ పరిధి మాత్రం ధనవంతుల తెలంగాణగా మారిపోతుంది’’ అని మండిపడ్డారు. ‘‘గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పట్టుసాధించేందుకే 300 డివిజన్లు చేసింది’’ అని అనుమానించారు. ‘‘గ్రేటర్ పరిధిని పెంచేబదులు రాష్ట్రంలో మరో నాలుగు మెగాసిటీలను లేదా శాటిలైట్ సిటీలను ఏర్పాటు చేయచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘గతంలో ఆంధ్ర-తెలంగాణ అన్నట్లుగా భవిష్యత్తులో నార్త్ తెలంగాణ-సౌత్ తెలంగాణ అనేభావన పెరిగే అవకాశముంది’’ అని అనుమానించారు. ‘‘రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది మంచిది కాదు’’ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పట్టుసాధించటమే రేవంత్ వ్యూహంగా కనబడుతోందని ప్రొఫెసర్ అనుమానించారు.

కార్పొరేట్ల కోసమే : చలసాని

‘‘గ్రేటర్ పరిధిని పెంచటం అన్నది రియల్ ఎస్టేట్ విలువలు పెంచటం కోసమే అనే అనుమానంగా ఉంది’’ అని సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర అన్నారు. ‘‘పౌర సదుపాయాలు పెంచటం కన్నా భూముల విలువ పెంచటమే ధ్యేయంగా ఉంది’’ అని అనుమానించారు. ‘‘మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో భూముల ధరలు పెరిగిపోయినట్లే కొత్తగా చేరిన 150 డివిజన్లలోని భూముల ధరలు కూడా పెరగటం తప్ప మరే ఉపయోగం ఉండదు’’ అన్నారు. ‘‘పౌరసేవలు పెంచటానికి బదులు, గ్రేటర్ పరిధిని పెంచటం వల్ల జనాలకు నష్టమే’’ అన్నారు. ‘‘పరిధి పెంచే విషయంలో ఎంఎల్ఏలు, ఎంపీలు, కార్పొరేటర్లు, పబ్లిక్ అభిప్రాయాలు తీసుకోలేదు’’ అని ఆరోపించారు. ‘‘గ్రేటర్ పరిధి పెంచటం కేవలం కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కాని సామాన్య జనాలకు జరిగే ఉపయోగాలు ఏమీలేవు’’ అని చలసాని అభిప్రాయపడ్డారు.

Read More
Next Story