జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుకు బీఆర్ఎస్ ప్లాన్ ఇదేనా ?
x
Revanth, KTR and Ramachandra Rao

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుకు బీఆర్ఎస్ ప్లాన్ ఇదేనా ?

తొందరలో జరగబోతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవటం బీఆర్ఎస్ కు అత్యవసరం


తొందరలో జరగబోతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవటం బీఆర్ఎస్(BRS) కు అత్యవసరం. ఉపఎన్నికలో గెలిస్తే పార్టీపరిస్ధితి పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. ఒకవేళ ఓడిపోతేమాత్రం పార్టీ చాలాఇబ్బందులను ఎదుర్కోవాల్సుంటుంది. అందుకనే జూబ్లీహిల్స్(Jubilee Hills by Poll) ఉపఎన్నికలో గెలుపును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సవాలుగా తీసుకున్నది. పార్టీ అధినేత కేసీఆర్(KCR) గురించి ఇక్కడ చర్చఅనవసరం. ఎందుకంటే సార్ వారు ఫామ్ హౌస్ నుండి ఎప్పుడు బయటకు వస్తారో ఆయనకే తెలీదు కాబట్టి. ఉపఎన్నికలో ప్రాచారానికి అయినా వస్తారో లేదో కూడా పార్టీనేతలు చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్ధితిల్లో గెలుపు బాధ్యత అంతా కేటీఆర్ మీదే ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇంతకీ గెలుపుకోసం పార్టీ ప్లాన్ ఏమిటి ? ప్రత్యేకించి ప్లాన్ అంటు ఏమీలేదు రెండు అంశాలమీద బీఆర్ఎస్ గెలుపును నమ్ముకున్నది. మొదటిది దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్ మరణం తాలూకు సానుభూతి. రెండో అంశం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి అంతే. రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు ప్రతిరోజు ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంపై జనాలంతా అసంతృప్తిగా ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ఘనవిజయం ఖాయమని చాలాకాలంగా చెప్పుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్పుకుంటున్నట్లుగా రేవంత్ ప్రభుత్వంపై జనాలు అంతస్ధాయిలో తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారా ? అంటే అనుమానమే. ప్రభుత్వంపైన జనాల్లో అసంతృప్తి సహజమే. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందని వాళ్ళల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ ను ఓడించి మళ్ళీ బీఆర్ఎస్ ను గద్దెపైన కూర్చోబెట్టాలన్నంత స్ధాయిలో జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయినట్లు కనబడటంలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలను జనాలింకా మరచిపోలేదు. ఇపుడు బయటపడుతున్న అవినీతి, అధికార దుర్వినియోగం లాంటివి కల్వకుంట్ల కుటుంబంపై వ్యతిరేకతను పెంచేవే.

బీఆర్ఎస్ దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపినాధ్ గట్టి నేతే అనటంలో సందేహంలేదు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన గోపీనాధ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి. జూబ్లీహిల్స్ లో సీమాంధ్ర ఓటర్లు, ప్రత్యేకించి సినిమా రంగంలో వాళ్ళు చాలా ఎక్కువమంది ఉంటారు. కాబట్టి 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికావటం గోపీకి బాగా కలిసొచ్చింది. మూడునెలల క్రితం హఠాత్తుగా గుండెపోటుతో గోపి మరణించటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అందుకనే గోపి భార్య మాగంటి సునీతకే బీఆర్ఎస్ టికెట్ దాదాపు ఖరారుచేసింది. సునతను పార్టీ ఆఫీసులో కేటీఆర్ సీనియర్ నేతలు, క్యాడర్ కు పరిచయటం చేశారు. ఆ సందర్భంగా పార్టీ పరిస్ధితి నియోజకవర్గంలో బాగుందన్నారు.

కష్టపడితే గెలుపు ఖాయం: కేటీఆర్

నియోజకవర్గంలోని కొన్నిప్రాంతాల్లో పార్టీపరిస్ధితి మెరుగ్గా ఉందని, కొన్నిచోట్ల కాస్త వెనుకబడి ఉన్నట్లు కేటీఆర్ చెప్పారు. నేతలు, క్యాడర్ అంతా ఐకమత్యంతో పనిచేస్తే సునీత గెలుపు కష్టంకాదని కూడా అన్నారు. రేవంత్ ప్రభుత్వం మీద జనాలంతా మండిపోతున్నారని కాబట్టి పార్టీ ఏకతాటిపైకి వచ్చి గెలుపుకోసం కష్టపడాలని చెప్పారు. ఇక్కడే కేటీఆర్ మాటల్లో గోపి మరణం తాలూకు సానుభూతి మీద ఎక్కువగా ఆధారపడ్డారని అర్ధమవుతోంది. అయితే గోపి మరణం తాలూకు సానుభూతితో సునీత గెలుస్తారా అన్నది అనుమానమే.

ఎందుకంటే 2023 ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున లాస్య నందిత గెలిచింది. అయితే కొద్దిరోజుల తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తర్వాత జరిగిన ఉపఎన్నికలో నందిత చెల్లెలు లాస్య నిందినికే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి పోటీచేయించింది. అయితే అప్పటి ఎన్నికల్లో నందిని ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీగణేష్ గెలిచారు. అంటే ఇక్కడ నందిత తాలూకు మరణాన్ని అవకాశంగా తీసుకుని సానుభూతితో గెలవాలన్న బీఆర్ఎస్ ప్లాన్ ఫెయిలైంది. నందిని మరణం తాలూకు సానుభూతి ఉపఎన్నికలో చెల్లెల్ని గెలిపించలేకపోయింది.

మొత్తం ఓట్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు సుమారు 3.55 లక్షలున్నారు. వీరిలో ముస్లిం మైనారిటి ఓట్లే దాదాపు లక్ష వరకు ఉన్నాయి. జూబ్లీహిల్స్ అంటేనే నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ అత్యంత ధనికులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, వివిధ రంగాల్లోని ప్రముఖులున్నారు. అయితే, ఇలాంటి ప్రముఖుల్లో చాలామంది ఓటింగుకు వచ్చేది అనుమానమే. బస్తీల్లో ఉండే జనాభానే ఓటింగులో ఎక్కువగా పాల్గొంటారు. బస్తీల్లో నివసిస్తున్న జనాల్లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలోని 3.55 లక్షల ఓట్లలో పోయిన ఎన్నికల్లో అయిన పోలింగ్ అతితక్కువగా 43శాతం మాత్రమే. పోలైన 1.83 లక్షల ఓట్లలో గోపికి 80,549 ఓట్లు వస్తే ఓడిన కాంగ్రెస్ అభ్యర్ధి మహమ్మద్ అజహరుద్దీన్ కు వచ్చింది 64,212 ఓట్లు. కేసీఆర్ అధికారంలో ఉన్నపుడే గోపీకి వచ్చిన మెజారిటి 16 వేలు మాత్రమే.

ప్రచారం చేయగలరా ?

కల్వకుంట్ల కుటుంబం మొత్తం కేసులు, విచారణలతో అనేక ఇబ్బందులు పడుతోంది. కాళేశ్వరం అవినీతి, టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేసీఆర్ చుట్టూ ముసురుకున్నాయి. సీబీఐ గనుక కాళేశ్వరం కేసు విచారణను టేకప్ చేస్తే కేసీఆర్ మీద కేసు నమోదు తప్పదనిపిస్తోంది. అలాగే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ మీద ఇప్పటికే ఏసీబీ, ఈడీలు కేసులు నమోదు చేసి విచారణలు కూడా చేశాయి. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేటీఆర్ మీద ఏసీబీ చార్జిషీటు వేయటం లేదా డైరెక్టుగా అరెస్టు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే మరో కీలక నేత తన్నీరు హరీష్ రావు మీద కూడా కాళేశ్వరం విచారణ జరిగింది. కేసుల కత్తి ముగ్గురి మెడపైన వేలాడుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నాటికి వీళ్ళ ముగ్గురూ అసలు ప్రచారం చేయగలుగుతారా అన్నది కూడా అనుమానమే. ఎందుకంటే ఏసీబీ, సీబీఐ లేదా ఈడీ కేసుల నమోదుతో అరెస్టయితే ప్రచారానికి అందుబాటులో ఉండేది కూడా డౌటే. ఈ పరిస్ధితుల్లో గోపీ మరణం తాలూకు సానుభూతి భార్య సునీతను గెలిపిస్తుందా ? అనే సందేహం పెరిగిపోతోంది.

అభివృద్ధే గెలిపిస్తుంది : తుమ్మల

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు‘‘ తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే తమ అభ్యర్ధిని గెలిపిస్తాయి’ అని ధీమాను వ్యక్తంచేశారు. ‘‘అభ్యర్ధి ఎవరన్న విషయం పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంద’’ని చెప్పారు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రేవంత్ ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించారు. ఆకమిటీలో గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్ తో పాటు తుమ్మల కూడా సభ్యుడు. ‘‘ఆశావహులందరితోను తమ కమిటి మాట్లాడుతోందని అందరి జాబితాలను సిద్ధంచేసి ముఖ్యమంత్రికి అందించటమే తమ బాధ్యత’’గా మంత్రి తెలిపారు. 2023 ఎన్నికలతో పోల్చుకుంటే ఇపుడు కాంగ్రెస్ మరింత బలోపేతంగా కనబడుతోంది. కాబట్టి నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి గట్టిగా ఎలక్షనీరింగ్ చేయగలిగితే కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి.

ఎంఐఎం మద్దతే కీలకం

కాంగ్రెస్ కు కలిసొచ్చే అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ఈనియోజకవర్గంలో దాదాపు లక్ష ముస్లిం మైనారిటి ఓట్లున్నాయి. కాంగ్రెస్ కు అంశాలవారీగా ఏఐఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. ఉపఎన్నికలో ఎంఐఎం మద్దతుగా నిలబడితే ముస్లిం మెజారిటి ఓట్లు కాంగ్రెస్ అభ్యర్ధిగా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదేసమయంలో బీఆర్ఎస్ నేతల్లో సమన్వయలోపం కనబడుతోంది. నేతలను ఉత్సాహపరిచేందుకు కేటీఆర్ పార్టీ ఆఫీసులో ఎన్నిమాటలు చెబుతున్నా ప్రచారంలో తిరిగేటపుడు అవేవీ ఎన్నికల ప్రచారంలో పనిచేయవు. కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లరూపాయల అవినీతికి పాల్పడిందని, ఆకాశమే హద్దుగా అధికారదుర్వినియోగం చేసిందని, అక్రమసంపాదన, పార్టీలో ఆధిపత్యం కోసమే కేటీఆర్-కవిత మధ్య గొడవలు జరుగుతున్నాయని జనాలు నమ్ముతున్నారు. ఇలాంటి అనేక అంశాలు రేపు ప్రచారంలో ప్రభావంచూపే అవకాశాలున్నాయి. అల్టిమేట్ గా ఇవన్నీ అభ్యర్ధి గెలుపు మీదే ప్రభావం చూపుతాయి.

కమిటి కసరత్తు చేస్తుంది : నారపరాజు

‘‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపుకు తమ పార్టీ గట్టిగా కృషిచేస్తుంద’’ని బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు చెప్పారు. ‘‘గట్టి అభ్యర్ధి ఎంపిక కోసం పార్టీ తరపున కమిటిని ఏర్పాటు చేయబోతున్న’’ట్లు చెప్పారు. అభ్యర్ధికి గట్టిగా ప్రచరంచేసి ఓట్లేయించేంత శక్తి ఉన్న గట్టినేతలు బీజేపీ లేరు. ఈ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది కాబట్టి లోకల్ ఎంపీ, కేంద్రమంత్రిగా గెలుపు బాధ్యతలన్నీ జీ.కిషన్ రెడ్డి మీదే పడుతుంది అనటంలో సందేహంలేదు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను జనాలు గమనిస్తున్నారు కాబట్టి బీజేపీ గెలుపుకు జనాలు మద్దతిస్తార’’న్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. పార్టీలోని సీనియర్ నేతల్లో ఇప్పటికే చాలామంది రామచంద్రరావు, కిషన్ రెడ్డి మీద మండిపోతున్నారు. పదవుల నియామకాలు పార్టీ నేతల మధ్య పద్ద చిచ్చే పెట్టింది. మరి అసంతృప్తిగా ఉన్న నేతలందరినీ కిషన్, రామచంద్రరావు ఏ విధంగా ఏకతాటిపైకి తీసుకొస్తారో చూడాల్సిందే.

పట్టెంతో తేలిపోతుంది : చలసాని

‘‘చెల్లెలు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ తో పార్టీని ఉపఎన్నికల్లో గెలిపించటం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ కు ప్రిస్టేజ్ అయిపోయింద’’ని సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర అభిప్రాయపడ్డారు. ‘‘కాంగ్రెస్ విషయం తీసుకుంటే హై కమాండ్ దగ్గర రేవంత్ కు నెగిటివ్ ఉంద’’ని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కు పార్టీతో పాటు ప్రజల్లో ఉన్న పట్టు ఏమిటో తేలిపోతుందన్నారు. ‘‘రేవంత్, కేటీఆర్, రామచంద్రరావు ముగ్గురికీ ఉపఎన్నిక పరీక్ష లాంటిదే’’ అని నరేంద్ర అన్నారు. ‘‘బీఆర్ఎస్ సానుభూతి మీదే ఎక్కువగా ఆధారపడినట్లుంద’’నే అనుమానం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ లో జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేదని చెప్పారు. ‘‘కాంగ్రెస్ లో అనేక గ్రూపులు పనిచేస్తున్న’’ట్లు తెలిపారు. ‘‘సిటీలో కూడా కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేదు కాబట్టి గెలుపు బాధ్యతంతా రేవంతే తీసుకోవాల’’న్నారు. అభ్యర్ధి ఎంపికకు నియమించిన కమిటిలోని ముగ్గురుమంత్రులు బయటవాళ్ళే అని గుర్తుచేశారు.

Read More
Next Story