బీజేపీ కెపాసిటి ఇంతేనా ?
x
Telangana BJP

బీజేపీ కెపాసిటి ఇంతేనా ?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలంగాణాకు వచ్చారు. తెలంగాణా నేతలకు ఫుల్లుగా క్లాసు తీసుకోవటానికే వచ్చారని ఒక సమాచారం.


బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలంగాణాకు వచ్చారు. తెలంగాణా నేతలకు ఫుల్లుగా క్లాసు తీసుకోవటానికే వచ్చారని ఒక సమాచారం. అలాంటిది ఏమీ లేదు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్పీడు పెంచటానికే వచ్చారని మరో సమాచారం. ఏదైనా తెలంగాణాలోని కమలనాదులంతా కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సక్సెస్ కాలేదన్న విషయం అర్ధమైపోయింది. సెప్టెంబర్ 8వ తేదీన మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమం అక్టోబర్ 25వ తేదీకి ముగియాలి. తెలంగాణాలో పార్టీ సభ్యత్వ నమోదును తక్కువలో తక్కువ 50 లక్షలకు చేర్చాలన్నది జాతీయ నాయకత్వం ఇచ్చిన టార్గెట్. అయితే ఇప్పటికి అయింది కేవలం 8 లక్షలు మాత్రమే. ఈనెల ముగింపుకు వచ్చేసింది. మరి అక్టోబర్ 25వ తేదీలోగా మిగిలిన 42 లక్షల సభ్యత్వాలు పూర్తవుతాయా అంటే డౌటనుమానమనే చెప్పాలి.

అందుకనే నేతలందరికీ కలిపి ఒకేసారి క్లాసు పీకేందుకే నడ్డా సారు వచ్చారని సమాచారం. చెప్పుకోవటానికి తెలంగాణా నుండి ఇద్దరు కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఉన్నారు. వీళ్ళు కాకుండా మరో ఆరుగురు ఎంపీలు, ఎనిమిదిమంది ఎంఎల్ఏలున్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రే కాకుండా పార్టీ తెలంగాణా అధ్యక్షుడు కూడా. కాకపోతే ఆయనకు జమ్మూ-కాశ్మీర్ ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా బిజీగా ఉన్నారు. కిషన్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బిజీలో ఉన్నారు కాబట్టి తెలంగాణాలో సభ్యత్వాల మీద దృష్టి పెట్టలేకపోయారని అనుకుందాం. మరి మరో కేంద్రమంత్రి బండి ఏమి చేస్తున్నట్లు ? మిగిలిన ఎంపీలు, ఎంఎల్ఏలంతా ఏమి చేస్తున్నారు ?

ఇక్కడ విషయం ఏమిటంటే నేతల మధ్య సమన్వయం లేదని చాలాకాలంగా ప్రచారం జరగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏ విషయంలో కూడా పార్టీ అధిష్టానం నుండి తెలంగాణా ఎంపీలు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలకు, క్యాడర్ కు మధ్య సమన్వయం చేసే వాళ్ళు కరువయ్యారు. అందుకనే విషయం ఏదైనా సరే కేంద్రమంత్రులు ఒకదిక్కు, ఎంపీలు మరో దిక్కు, ఎంఎల్ఏలు, నేతలు తమిష్టం వచ్చిన దిక్కన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటంలో కాని, హైడ్రా, మూసీ బాధితుల విషయంలో కూడా కానీండి. నేతల మధ్య స్పష్టమైన వైరుధ్యాలు కనబడతాయి. హైడ్రాను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫుల్లుగా వ్యతిరేకిస్తుంటే మెదక్ ఎంపీ రఘునందనరావు ఫుల్లు సపోర్టు. ఇద్దరు కూడా తమ పద్దతుల్లోనే హైడ్రా గురించి ప్రకటనలు చేస్తుంటారు. ఈ ఇద్దరి మధ్య సమన్వయం చేసే దిక్కే లేకుండా పోయింది. ఈ నేపధ్యంలోనే నడ్డా హైదరాబాద్ కు వచ్చారు. నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి తిరిగి వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోతారు. మరి నేతలతో నడ్డా ఏమి మాట్లాడుతారో ? దాని ప్రభావం ఎలాగుంటుందో చూడాలి.

టార్గెట్ చేరుకుంటాము

ఇదే విషయమై తెలంగాణా ఫెడరల్ తో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంఎల్సీ ఎన్ రామచంద్రరావు మాట్లాడుతు సభ్యత్వ టార్గెట్ పూర్తి చేస్తామన్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లను సభ్యత్వ నమోదుగా పార్టీ జాతీయ నాయకత్వం టార్గెట్ గా పిక్స్ చేసినట్లు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి 75 లక్షల ఓట్లొచ్చాయన్నారు. 75 లక్షల ఓట్లను సభ్యత్వాలుగా టార్గెట్ చేస్తే కాస్త తగ్గినా 50 లక్షల సభ్యత్వాలు అవుతాయని చెప్పారు. 2014 తర్వాత పార్టీ సభ్యత్వాలు జరగలేదన్నారు. అందుకనే ఇపుడు గ్రామస్ధాయి నుండి మొదలుపెట్టి జీహెచ్ఎంసీ స్ధాయివరకు నేతలంతా కలిసికట్టుగా సభ్యత్వాలపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. అక్టోబర్ 25 వరకు సభ్యత్వాలు పూర్తిచేయటానికి డెడ్ లైన్ ఉంది కాబట్టి టార్గెట్ రీచవ్వటం పెద్ద సమస్య కాదన్నారు.

Read More
Next Story