
శాంతిచర్చల ప్రకటనలో మావోయిస్టుల ‘హిడెన్ అజెండా’ ఇదేనా ?
శాంతిచర్చలు జరపాలని పదేపదే మావోయిస్టుల అధికార ప్రతినిధులు కేంద్రప్రభుత్వాన్ని బతిమలాడుకోవటంలోనే ఈ విషయం అర్ధమైపోతోంది
మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. శాంతిచర్చలు జరపాలని పదేపదే మావోయిస్టుల అధికార ప్రతినిధులు కేంద్రప్రభుత్వాన్ని బతిమలాడుకోవటంలోనే ఈ విషయం అర్ధమైపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా భద్రతా దళాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టులపై ఆరురాష్ట్రాల్లో విరుచుకుపడుతున్నాయి. దొరికినవాళ్ళని దొరికినట్లుగా ఊచకోత కోసేస్తున్నాయి. భద్రతాదళాల దాడుల్లో పది, ఇరవైమందికి తక్కువ కాకుండా చనిపోతున్నారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక, ఆపరేషన్ కగార్(Operation Kagar) నుండి తప్పించుకునే మార్గం కనబడకే మావోయిస్టులు శాంతిచర్చలకు సిద్ధమని కేంద్రప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తులు పంపుతున్నారు. వారంరోజుల్లో రెండుసార్లు మావోయిస్టుల(Maoists) అధికారప్రతినిధులు శాంతిచర్చలకు సిద్ధమని ప్రకటించటంతోనే మావోయిస్టుల పరిస్ధితి ఎలాగ తయారైందో అర్ధమైపోతోంది.
తాజాగా భద్రతాదళాలు శాంతిచర్చలకు అంగీకరించాలని బస్తర్ ఏరియా ఉత్తర, పశ్చిమ జోనల్ సబ్ ఏరియా అధికార ప్రతినిధి రూపేష్ కేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్రప్రభుత్వాలకు లేఖ రాశారు. ఈమధ్యనే మావోయిస్టు అధికారప్రతినిధి అభయ్ కూడా శాంతిచర్చలకు సిద్ధమని ప్రభుత్వాలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అభయ్ లేఖకు కాని రూపేష్ లేఖకు కాని ప్రభుత్వాలు ఏ విధంగాను స్పందించలేదు. మావోయిస్ట్ ముక్త భారత్ కోసం భద్రతాదళాలు, కోబ్రా, గ్రే హౌండ్స్, పోలీసులు ఏకతాటిపైకివచ్చి మావోయిస్టుల షెల్టర్ జోన్లను జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కగార్ పేరుతో రాష్ట్రప్రభుత్వాల సాయంతో కేంద్రం పెద్దఎత్తున అనేక రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేస్తున్నది. ఈఆపరేషన్లను మావోయిస్టులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఎన్ కౌంటర్లు, ఎదురుకాల్పుల్లో వందలమంది మావోయిస్టులు చనిపోయారు. మరికొన్ని వందలమంది లొంగిపోయారు.
కీలకనేతల అనారోగ్యాలు, వృద్ధాప్యాలు, జనాల్లో తగ్గిపోతున్న ఆధరణ, ఇన్ఫర్మర్ల వ్యవస్ధ దెబ్బతినటం తదితరాల కారణంగా మావోయిస్టులబలం బాగా తగ్గిపోతోంది. ఈనేపధ్యంలోనే ఆపరేషన్ కగార్ దెబ్బకు మూలిగే నక్కమీద తాటిపండు లాగ తయారైంది మావోయిస్టుల పని. అందుకనే కాస్త విరామం తీసుకుని మళ్ళీ పుంజుకోవాలని, ఎన్ కౌంటర్ల మరణాలను తప్పించుకునేందుకే మావోయిస్టులు శాంతిచర్చల ప్రకటనలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ముందు భద్రతాదళాల ఎన్ కౌంటర్లను నిలిపేస్తే మావోయిస్టులకు ఊపిరిపీల్చుకునేందుకు కాస్త సమయం దొరుకుతుంది. కాల్పుల విరమణ, ఎన్ కౌంటర్ల విరమణసమయాన్ని మళ్ళీ పుంజుకునేందుకు ఉపయోగించుకోవాలని మావోయిస్టుల వ్యూహంగా కనబడుతోంది. చత్తీస్ ఘడ్, జార్ఖండ్, తెలంగాణ(Telangana), మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర-ఒడిస్సా ఏరియా(ఏవోబీ)లో భద్రతాదళాల గాలింపులు, ఎన్ కౌంటర్ల(Encounters) దెబ్బకు ఉన్నచోట ఉండలేక మావోయిస్టులు ఈ ప్రాంతానికి, ఆ ప్రాంతానికంటు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. అయినా మావోయిస్టులను భద్రతాదళాలు వదలకుండా వెంటాడుతున్నాయి.
ఏన్ కౌంటర్ల నుండి తప్పించుకోవాలన్నా, కాస్త ఊపిరిపీల్చుకుని మళ్ళీ పుంజుకోవాలన్నా ముందు ఆపరేషన్ కగార్ నిలిపేయాలి. అయితే ఆపరేషన్ కగార్ ను కేంద్రప్రభుత్వం ఆపదు. ఎందుకంటే వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టులను ఏరేస్తున్న ఊపులో కేంద్రం ఉంది. ఇపుడు మావోయిస్టుల ముందు మూడుమార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది భద్రతాదళాల దాడులను ప్రతిఘటించి ఎన్ కౌంటర్లలో చనిపోవటం, రెండవది ఎన్ కౌంటర్లను తప్పించుకుని పారిపోవటం. ఇక మూడవది ఏమిటంటే పోలీసులకు లొంగిపోయి ప్రాణాలను కాపాడుకోవటం. గడచిన నాలుగు నెలల్లో సుమారు 200 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడి తప్పించుకున్నట్లు సమాచారం. ఇదేసమయంలో ఎన్ కౌంటర్లలో సుమారు 250 మంది చనిపోయారు. జరుగుతున్న ఘటనలన్నీ మావోయిస్టులను కోలుకోలేనట్లుగా దెబ్బతీస్తున్నాయి.
అందుకనే సడెన్ గా మావోయిస్టుల నుండి శాంతిచర్చల ప్రకటనలు వెలువడుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఏదోరకంగా ఎన్ కౌంటర్లకు విరామం ప్రకటించేట్లుగా చేసి తాము కోలుకునేందుకు మావోయిస్టులు సమయాన్ని కోరుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మావోయిస్టుల ఆలోచనలను పసిగట్టలేనంత అమాయకత్వంలో లేవు ప్రభుత్వాలు భద్రతాదళాలు. అందుకనే శాంతిచర్చలు అవసరంలేదన్నట్లుగానే గాలింపుచర్యలు, ఎన్ కౌంటర్లలో పాల్గొంటున్న వివిధ విభాగాల ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. 2026కల్లా మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యమని గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రకటించిన విషయం తెలిసిందే. అమిత్ షా లక్ష్యానికి తగ్గట్లుగానే భద్రతాదళాలు మావోయిస్టుల ఏరివేతలో మంచి స్పీడులో దూసుకుపోతున్నాయి.
ఎన్ కౌంటర్లలో కొన్నిసార్లు మావోయిస్టులనుండి గట్టిప్రతిఘటన ఎదురై భద్రతాదళాల్లో కొందరు చనిపోతున్నారు. అయినాసరే తమటార్గెట్ ను రీచవ్వకుండా వెనక్కు తిరిగేదిలేదని భద్రతాదళాలు గట్టిగానే నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. అందుకనే మావోయిస్టుల నుండి వస్తున్న శాంతిచర్చల ప్రకటనలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎలాంటి స్పందన చూపించటంలేదు. ప్రభుత్వాల వైఖరిచూస్తుంటే ఆపరేషన్ కగార్ ను ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నట్లే ఉంది.
మావోయిస్టులు రాజ్యాంగాన్ని గౌరవించాలి
మావోయిస్టుల అధికార ప్రతినిధులు అభయ్, రూపేష్ విజ్ఞప్తిపై తెలుగు రాష్ట్రాల మానవహక్కుల సంఘం సమన్వయకమిటి సభ్యుడు ఆలూరు చంద్రశేఖర్ ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ‘కేంద్రప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని మావోయిస్టులు ఆరోపణలు చేయటంలో అర్ధంలేద’న్నారు. ఎందుకంటే ‘మావోయిస్టులు రాజ్యాంగాన్ని గౌరవించి, ప్రభుత్వాలను గుర్తిస్తే అప్పుడు రాజ్యాంగా ఉల్లంఘనపై కేంద్రాన్ని నిలదీయచ్చ’న్నారు. ‘తాము రాజ్యాంగాన్ని గౌరవించమని, ప్రభుత్వాలను గుర్తించేదిలేదని ఒకవైపు చెబుతున్న మావోయిస్టులు మరోవైపు ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపించటంలో అర్ధంలేద’న్నారు. దశాబ్దాల పోరాటంలో మావోయిస్టులు మొదటిసారి రాజ్యాంగం గురించి ప్రస్తావించినట్లు చంద్రశేఖర్ గుర్తుచేశారు. ‘తాము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు, ప్రభుత్వాలను గుర్తిస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటిస్తే అప్పుడు పౌరసమాజం ప్రభుత్వంతో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంద’ని చెప్పారు.
‘ప్రభుత్వం-మవోయిస్టుల పోరాటంలో మధ్యలో నలిగిపోతున్నది ఆదివాసీలే’ అన్నారు. ‘రెండువైపుల నుండి వస్తున్న ఒత్తిళ్ళ కారణంగా ఆదివాసీలు బలైపోతున్నార’ని ఆలూరు ఆవేధన వ్యక్తంచేశారు. ‘మానవహక్కుల సంఘం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంద’ని చెప్పారు. ‘ప్రభుత్వం శాంతిచర్చలకు అంగీకరించాలంటే అందుకు అవసరమైన వాతావరణాన్ని, వేదికను మావోయిస్టులే సిద్ధంచేయాల’ని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.