
ఎన్నికలకు టీడీపీని దూరంగా ఉంచటంలో చంద్రబాబు వ్యూహమిదేనా ?
బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడితే కాని టీడీపీ పుంజుకునే అవకాశంలేదు.
తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు కూడా తెలుగుదేశంపార్టీ దూరంగా ఉండబోతోంది. తెలంగాణ తమ్ముళ్ళతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) మంగళవారం రాత్రి ఉండవల్లిలో చాలాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలతో చంద్రబాబు మాట్లాడుతు ఎన్నికల్లో పాల్గొనేందుకు టీడీపీ(TDP) సిద్ధంగా లేదని తెలిపారు. ఇదేసమయంలో ఏపార్టీకి కూడా టీడీపీ మద్దతు ఇవ్వదన్నారు. ఒకవేళ బీజేపీ(Telangana BJP) మద్దతుకోరితే అప్పుడు ఏమిచేయాలో ఆలోచిద్దామని కూడా తనను కలసిన నేతలతో చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. 2023 ఎన్నికల్లో కూడా పోటీచేసేందుకు టీడీపీ సిద్ధంగా లేదని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే అప్పటినుండి ఇప్పటికీ పోటీకి టీడీపీ రెడీకాలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ పెద్దన్నపాత్ర పోషిస్తోంది. అదేజట్టు తెలంగాణలో కూడా కూటమిగా ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అయితే టీడీపీతో కలవటానికి తెలంగాణ బీజేపీ సిద్ధంగా లేదు. ఏపీలో బీజేపీని పట్టించుకునేవారు లేరు కాబట్టి ఏదో ఒక పెద్ద పార్టీతో పొత్తుఅవసరం. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయటం ఖాయమని పార్టీ నేతలు పెద్ద ఆశలతో ఉన్నారు. ఆంధ్రాపార్టీగా ముద్రపడిన టీడీపీతో పొత్తుపెట్టుకుంటే తెలంగాణ సెంటిమెంటు రాజుకుని పార్టీ నష్టపోవటం ఖాయమని మెజారిటి బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. కేంద్రమంత్రులు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావుతో పాటు చాలామంది సీనియర్లు టీడీపీతో పొత్తు వద్దే వద్దంటున్నారు.
టీడీపీతో పొత్తువద్దని బీజేపీ అనుకుంటున్నపుడు చంద్రబాబు మాత్రం ఏమి చేయగలరు ? అందుకనే ఎన్నికల్లో పోటీచేయటానికి టీడీపీ సిద్ధంగా లేరని చెప్పేశారు. ఎన్నికలపై దృష్టిపెట్టేబదులు పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయటంపై దృష్టిపెట్టాలని భేటీలో తెలంగాణ తమ్ముళ్ళకు గట్టిగా చెప్పారు.
ఇదేసమయంలో తెలంగాణ స్ధానికసంస్ధల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు దూరంగా ఉండాలన్న చంద్రబాబు వ్యూహంలో కాంగ్రెస్ కు సాయం చేయటమే అసలైన కారణంగా అనిపిస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీమాంధ్రుల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సినీపరిశ్రమ అందులోను కమ్మ సామాజికవర్గం పట్టు ఎక్కువగా ఉంటుంది. హ్యాట్రిక్ ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్ మొదటసారి 2014లో గెలిచింది టీడీపీ అభ్యర్ధిగానే. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. తర్వాత 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగానే గెలిచాడు. గోపీ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే కాకుండా కమ్మ సామాజికవర్గంలో ప్రముఖుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకడు కాబట్టే వరుసగా మూడుసార్లు గెలిచాడు. అయితే ఆయన మరణంతో ఇపుడు ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ ఉపఎన్నికలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే ఉండబోతోంది. పోయిన ఎన్నికలో రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, క్యాడర్ బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. అయితే గ్రేటర్ పరిధిలోని మెజారిటి నియోజకవర్గాల్లో మాత్రం సీమాంధ్రులు బీఆర్ఎస్ కే జైకొట్టి గెలిపించారు. బీఆర్ఎస్ ను గెలిపించిన సీమాంధ్రుల్లో కమ్మ, టీడీపీ సానుభూతిపరులు కూడా ఉన్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల్లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీలేదు. కాకపోతే తొందరలోనే జరగబోయే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో దీని ప్రభావం ఉండే అవకాశముంది. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఇదేసమయంలో జనాలు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారని చాటిచెప్పాలన్నది ఎనుముల రేవంత్ రెడ్డి లక్ష్యం. అందుకనే రెండుపార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.
టీడీపీ కోణంలో చూస్తే బీఆర్ఎస్ గెలిస్తే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడితే కాని టీడీపీ పుంజుకునే అవకాశంలేదు. బీఆర్ఎస్ తెలంగాణలో బలంగా ఉన్నంతకాలం చంద్రబాబుకు సమస్యే. అందుకనే ఉపఎన్నికలో బీఆర్ఎస్ ను ఓడించేందుకు అవసరమైతే కాంగ్రెస్ కు లోపాయికారీగా టీడీపీ సాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటిలు, సీమాంధ్రల ఓట్లు పడితే కాంగ్రెస్ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికే ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికలు జరిగితే కాని చంద్రబాబు వ్యూహం ఏమిటన్నది బయటపడదు.