బీసీ సంఘాలను రేవంత్ ప్రభుత్వం ఖాతరుచేయటంలేదా ?
x
Revanth and BC leaders

బీసీ సంఘాలను రేవంత్ ప్రభుత్వం ఖాతరుచేయటంలేదా ?

ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ తన హామీని నిలుపుకోలేకపోయారు


గతంలో ఎప్పుడూ లేనంతగా ఇపుడు తెలంగాణలో బీసీ వాదం వినబడుతోంది. అయితే ఈ వాదాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం ఖాతరుచేయటంలేదు. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలుకు ప్రభుత్వం చట్టపరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించలేకపోతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ బీసీలకు స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ తన హామీని నిలుపుకోలేకపోయారు. నిజానికి స్ధానికసంస్ధల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు ఆచరణసాధ్యంకాదని హామీ అని ఇచ్చిన రేవంత్ కూ తెలుసు బీసీలకూ తెలుసు.

అప్పట్లో రేవంత్ హామీ ఇచ్చాడు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సిందే అని బీసీ సంఘాల నేతలు గట్టిగా డిమాండ్లు చేస్తున్నారు. అయితే పార్లమెంటులో చట్టసవరణ కాకుండా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు అసాధ్యమని అందరికీ తెలుసు. అందుకనే కంటితుడుపుగా అసెంబ్లీలో రిజర్వేషన్లపై రేవంత్ మూడుసార్లు బిల్లులను ఆమోదింపచేసుకుని వాటిని రాష్ట్రపతి, గవర్నర్ కు పంపేశారు. తాను చేయగలిగింది చేశాను ఇంతకన్నా చేయగలిగింది ఏమీలేదన్నట్లుగా రేవంత్ ఇపుడు వ్యవహరిస్తున్నారు. అయినా సరే, బీసీ సంఘాలు రేవంత్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడలేకపోతున్నాయి.

ఈనెల 25వ తేదీన క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో బీసీలకు చట్టబద్దంగా అమలవ్వాల్సిన 42శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా అమలుచేయబోతున్నట్లు నిర్ణయం తీసుకునే అవకాశముంది. 42శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా కాదు చట్టబద్దంగానే కావాలని బీసీ సంఘాలు డిమాండ్లు చేయటంమినహా పోరాటం చేసే పరిస్ధితుల్లో లేవన్నది వాస్తవం. మరీ పరిస్ధితుల్లో పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని క్యాబినెట్ డిసైడ్ చేస్తే బీసీ సంఘాలు ఏమిచేస్తాయి ? అన్నది పెద్ద ప్రశ్న. అసలు రేవంత్ ప్రభుత్వంపై బీసీ సంఘాలు ఎందుకని గట్టిగా పోరాడలేకపోతున్నాయి ? అన్నది రెండో ప్రశ్న.

మొదటిప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఎన్నికలను బహిష్కరించేంత సీన్ బీసీ సంఘాల నేతలకు లేదు. అందుకనే ఎన్నికల్లో పాల్గొనాలనే సంఘాలనేతలు ఆలోచిస్తున్నారు. ఎన్నికలను బహిష్కరిస్తే బీసీలే అంతిమంగా నష్టపోతారనేది బీసీ సంఘాల నేతల ఆలోచన.

ఎన్నికలను బహిష్కరించం : చిరంజీవులు

ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయి ప్రస్తుతం బీసీ మేథావుల వేదిక అధ్యక్షుడిగా యాక్టివ్ గా పనిచేస్తున్న తొగరాల చిరంజీవులు ఏమంటారంటే ఎన్నికలను బహిష్కరించేది లేదన్నారు. ‘‘పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి పాస్ చేసేట్లుగా బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలి’’ అని సూచించారు. ‘‘బిల్లుకు చట్టబద్దత సాధించలేకపోతే బీసీల ఓట్లు ఇతర అభ్యర్ధులకు వేయకూడదని పిలుపిస్తాము’’ అని హెచ్చరించారు. బీసీ సంఘాలు ఎప్పటికీ ఏకతాటిపైకి రావని తేల్చిచెప్పేశారు. అలాగే ‘‘బీసీ జనాలు స్పందించకపోతే బీసీ సంఘాలు కూడా ఏమీ చేయలేవు’’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనలో బీసీ జనాలు పెద్దగా రోడ్లపైకి రావటంలేదు’’ అని అంగీకరించారు.

రేవంత్ ప్రభుత్వంలో నిజాయితి లేదు : పర్వతం

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలులో రేవంత్ ప్రభుత్వానికి నిజాయితీ లేదని బీఆర్ అంబేద్కర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్షిరర్, బీసీ అంశాల్లో యాక్టివ్ గా ఉండే డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ చెప్పారు. ‘‘కులగణన లెక్కలు రేవంత్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించకపోవటంతోనే బీసీ వాదన బలహీనపడింది’’ అని ఆరోపించారు. ‘‘ప్రభుత్వం కులగణన లెక్కలను ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టులో సమర్పించలేదు’’ అని మండిపడ్డారు. ‘‘తొందరలోనే బలమైన ఉద్యమం నిర్మితమవుతుందని, ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. ‘‘42శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు తొందరలోనే దీక్షలే కాకుండా ఆమరణ దీక్షలు కూడా చేస్తాయి’’ అని చెప్పారు. ‘‘ఎన్నికలను బహిష్కరించే ఆలోచన లేదని అందరు పాల్గొంటారు’’ అని పర్వతం వెంకటేశ్వర్ తెలిపారు.

ప్రజలు స్వచ్చందంగా పాల్గొంటున్నారు : జాజుల

‘‘42శాతం రిజర్వేషన్ల సాధనలో ప్రజలందరు స్వచ్చంధంగా పాల్గొంటున్నారు’’ అని బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ చెప్పారు. ‘‘రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తాము’’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో రిజర్వేషన్లతోనే రేవంత్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించినా వేరేదారిలేదు కాబట్టి ఎన్నికల్లో పాల్గొంటాము’’ అని చెప్పారు.

ఎన్నికలను బహిష్కరించే ఆలోచన : కొండలరావు

హై కోర్టు అడ్వకేట్ కొండలరావు మాట్లాడుతు ‘‘42శాతం రిజర్వేషన్లు అమలుచేయకుండా ఎన్నికలు నిర్వహించటాన్ని తాము అంగీకరించము’’ అని చెప్పారు. ‘‘ఒకవేళ పాత రిజర్వేషన్లతోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటే ఎన్నికలను బహిష్కరించాలనే ఆలోచన బీసీ సంఘాల నేతల్లో ఉన్నది’’ అని చెప్పారు. ‘‘రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి బీసీ సంఘాలకు మధ్య ఘర్షణ వాతావరణం కనబడుతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘రిజర్వేషన్ల సాధనలో బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి రాకపోవటం సంఘాల్లోని పెద్ద బలహీనత’’ అని లాయర్ అంగీకరించారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లుగా బీసీలకు రాజ్యాంగపరమైన రక్షణ లేదు’’ అని లాయర్ వాపోయారు. ‘‘చట్టసభల్లోకూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్ అన్నది రాజ్యాంగంలో లేదని, న్యాయ వ్యవస్ధ పెట్టిన సీలింగే’’ అని స్పష్టంగా చెప్పారు.

ఇందుకే ఖాతరు చేయటంలేదా ?

సరే, ఇపుడు రెండో పాయింట్ ను గమనిస్తే బీసీ సంఘాల నేతలను ప్రభుత్వం ఎందుకు ఖాతరుచేయటంలేదు ? ఎందుకంటే బీసీ సంఘాల నేతలకు మామూలు జనాలకు మధ్య చాలాఅంతరం ఉన్నట్లు అర్ధమవుతోంది. ప్రత్యేక తెలంగాణ డిమాండును మామూలు జనాలు ఓన్ చేసుకున్నట్లుగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల డిమాండును బీసీ జనాలు ఓన్ చేసుకోలేదు. కారణం ఏమిటంటే డిమాండ్లు చేస్తున్న సంఘాల నేతలు రిజర్వేషన్లు సాధించగలరు అన్న భ్రమలు జనాల్లో లేకపోవటమే. దీనికి మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే బీసీల్లోని ముఖ్యమైన ఐదు కులాలు ముదిరాజ్, యాదవ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి కులాల్లో ఏ ఒక్కదానికి మరో కులంతో పడదు. ఒక కులం నాయకత్వాన్ని మరో కులం అంగీకరించదు. జనాభా రీత్యా నాయకత్వంలో ఉన్న ఈ ఐదు కులాల్లోని ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి రావటంలేదు.

కులాల మధ్య ఆధిప్యత పోరాటమే కాకుండా పై కులాలు పార్టీ లైన్ దాటి ఏకం కాలేకపోతున్నాయి. బీసీల్లోని జనాలు పార్టీల ప్రజాప్రతినిధుల వెంట ఉన్నారే కాని బీసీ సంఘాల నేతలతో లేరు. ప్రజాప్రతినిధులేమో తమ పార్టీ లైన్ దాటి బయటకు రాలేకపోతున్న కారణంగా సంఘాలనేతల డిమాండ్లకు రావాల్సినంత సానుకూలత రావటంలేదు. సంఘాల నేతల్లో ప్రముఖంగా చెలామణి అవుతున్న వారిలో ఉన్నతోద్యాగాల్లో, న్యాయవ్యవస్ధలో రిటైర్ అయినవారు, ఉద్యోగులు, వృత్తినిపుణులు అనేకమంది ఉన్నారు. వారి డిమాండ్లలో నిజాయితీ ఉన్నా మామూలు జనాలతో వారికి లింకులేదు. ఉద్యోగాల్లో, వృత్తుల్లో ఉన్నపుడు మామూలు జనాలతో పెద్దగా సంబంధాలు లేవు. రిటైర్ అయిన తర్వాత మాత్రమే బీసీ అంశంపై ఇపుడు యాక్టవ్ అయ్యారు. అందుకనే ఇలాంటి మేథావులతో మామూలు జనాల మమేకం కాలేకపోతున్నారు.

బీసీ సంఘాలనేతల మధ్య ఐక్యత లేకపోవటం, బీసీ జనాలను కలుపుకుని పోలేకపోతుండటం వల్లే రేవంత్ ప్రభుత్వం సంఘాల నేతల డిమాండ్లను పట్టించుకోవటంలేదనే భావన పెరిగిపోతోంది. బీసీ సంఘాల్లోని వీక్ నెస్ రేవంత్ కు బాగా తెలుసు కాబట్టే తనిష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాడు.

Read More
Next Story