హైదరాబాద్  ప్రముఖ హోటళ్లలో ఐటీ సోదాలు
x
It raids in Big Hotels

హైదరాబాద్ ప్రముఖ హోటళ్లలో ఐటీ సోదాలు

ఏకకాలంలో 30 చోట్ల..


హైదరాబాద్ నగరంలో ఆదాయపన్ను శాఖ బుధవారం ఏక కాలంలో 30 చోట్ల సోదాలు చేపట్టింది. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు జరిపి పలు డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. పిస్తా హౌస్‌, షా గౌస్‌, మెహిఫిల్‌ హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ హోటళ్లు ఏటా వందలకోట్ల టర్నోవర్ వ్యాపారం చేస్తున్నాయి. పిస్తా హౌస్‌, షా గౌస్‌ హోటళ్లు ఇతర నగరాల్లోనూ బ్రాంచీలు ఉన్నాయి. దుబాయ్‌లోనూ వాటికి బ్రాంచ్‌లు ఉన్నాయి. భారీగా పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్‌ యజమాని మాజిద్‌ ఇంట్లో, శాలిబండలోని పిస్తాహౌస్‌ ప్రధాన బ్రాంచ్‌ల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

వాస్తవాదాయానికి, రికార్డుల్లో ఆదాయానికి తేడా


ఈ క్రమంలో రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హవాలామార్గంలో అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పిస్తా హౌస్ యజమాని మజీద్ నివాసంలో ఆరు బృందాలు సోదాలు జరుపుతున్నాయి. పిస్తా హౌస్‌లో పనిచేసే వర్కర్ల నివాసాల్లోనూ, వర్కర్లకు కల్పించిన వసతి నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వారికి సంబంధించిన ఫోన్లు, కంప్యూటర్లను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఫోన్లలో, కంప్యూటర్లో ఉన్న డేటాను ఐటీ శాఖకు సంబంధించిన హ్యాకర్లు పరిశీలిస్తున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఐటీ అధికారులు ఇతర సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. బినామీల పేర్లతో పిస్తా హౌజ్ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో వర్కర్ల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ కి సంబంధించిన హార్డ్ డిస్కులు, కీలక పత్రాన్ని అధికారులు చేజిక్కించుకున్నారు. అంతే కాకుండా వర్కర్ల నుంచి ఐటీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. సుమారు 600 మంది పైగా ఐటీ అధికారులు 30 బృందాలుగా విడిపోయి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు.

షేక్‌పేట్‌లోని మేహిఫిల్ రెస్టారెంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లో మొత్తం 15 చోట్ల మేహిఫిల్ హోటల్స్ ఉన్నాయి. ప్రతీ యేడు కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆదాయ , వ్యయాలు, ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తున్నారు. వాస్తవాదాయానికి రికార్డుల్లో చూపించిన ఆదాయానికి మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు కూడా ఐటీ అధికారుల సోదాల్లో వెల్లడైంది.

Read More
Next Story