
బీఆర్ఎస్ దయ్యాలు ఎవరో తెలిసిపోయిందోచ్
దెయ్యాలు ఎవరన్న విషయం మాత్రం ఇంతకాలం సస్పెన్స్ గానే ఉండిపోయింది
కొంతకాలంగా తెలంగాణ ప్రజానీకానికి, బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ ను ఒక ప్రశ్న పట్టి పీడిస్తోంది. అదేమిటంటే బీఆర్ఎస్(BRS) లో దెయ్యాలు ఎవరు ? అసలు బీఆర్ఎస్ లో దెయ్యాలు ఎందుకున్నాయి ? పార్టీలో దెయ్యాలున్నట్లు ఎలా తెలిసింది ? ఎలాగ తెలిసిందంటే కల్వకుంట్ల కవిత(Kavitha) చెప్పబట్టే అందరికీ ఈ విషయం తెలిసింది. దాదాపు మూడునెలల క్రితం అమెరికా(America) నుండి కవిత హైదరాబాదు(Hyderabad)కు తిరిగిరాగానే మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ లో దెయ్యాలున్నట్లు పెద్ద బాంబుపేల్చారు. తాను కేసీఆర్(KCR) కు రాసిన లేఖ లీక్ అయ్యిందన్న మంటతో కవిత అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
అప్పట్లో ఆమె ఏమన్నారంటే పార్టీలో కేసీఆర్ దేవుడట అయితే దేవుడి చుట్టు కొన్ని దెయ్యాలు చేరాయని. కేసీఆర్ ను నేరుగానే దేవుడితో పోల్చిన కవిత దెయ్యాలు ఎన్ని ? ఆ దెయ్యాలు ఎవరు అన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. దాంతో పార్టీలో దెయ్యాలున్నయన్న విషయం తెలిసింది. అయితే ఆ దెయ్యాలు ఎవరన్న విషయం మాత్రం ఇంతకాలం సస్పెన్స్ గానే ఉండిపోయింది. అలాంటిది బుధవారం మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతు ఆ దెయ్యాలు ఏవో కూడా చెప్పేశారు. ఇంతకీ కవిత చెప్పిన దెయ్యాలు ఎవరంటే తన్నీరు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ రావు.
హరీష్ అంటే మాజీమంత్రి, ఇపుడు సిద్ధిపేట ఎంఎల్ఏ అన్న విషయం చాలామందికి తెలుసు. మరి సంతోష్ ఎవరు ? అంటే జోగినపల్లి సంతోష్ రాజ్యసభ మాజీ ఎంపీ. ఈయన కూడా కేసీఆర్ కు దగ్గర బంధువే. నీడలాగ ఎప్పుడూ కేసీఆర్ ను వెన్నంటే ఉంటారు. అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటూ తెరవెనుక నుండి చక్రం తిప్పారని ప్రచారంతో పాటు ఆరోపణలను కూడా చాలానే ఎదుర్కొన్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం కేసీఆర్ కు దూరమైనా మళ్ళీ హఠాత్తుగా ఎర్రవల్లి ఫామ్ హౌసులో చేరిపోయారు. కేసీఆర్ కు ఇపుడు సంతోషే బాగా దగ్గర వ్యక్తి. హరీష్, సంతోష్ కు కవితతో ఎక్కడ, ఎప్పుడు చెడిందో ఎవరికీ తెలీదు.
మొత్తంమీద కవితతో పై ఇద్దరికీ గట్టిగానే గట్టుతగాదాలు జరిగినట్లు అర్ధమవుతోంది. ఆ గట్టు తగాదాలే పెరిగి పెరిగి ఇపుడు రోడ్డున పడ్డాయి. గడచిన మూడేళ్ళుగా ఏదో సందర్భంలో కవిత పై ఇద్దరు దెయ్యాలపైన పరోక్షంగా ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెడుతునే ఉన్నారు. దాంతో గొడవలు పెరిగిపోయి చివరకు ఫామ్ హౌసులోకి ఎంట్రీ కూడా కవితకు లేకుండాపోయింది. దాంతో కవిత మరింతగా మండిపోయింది. గొడవలు పెరిగి, పెరిగి చివరకు పార్టీలో నుండి కవితను సస్పెండ్ చేసేదాకా చేరుకుంది. అందుకనే ఈరోజు మీడియాలో మాట్లాడుతు తాను ఇంతకాలం దెయ్యాలంటు చెప్పింది హరీష్, సంతోష్ గురించే అని కవిత చెప్పేశారు. ఈ రెండు దయ్యాలే పార్టీని నాశనం చేసేస్తున్నట్లు మండిపోయారు. కేసీఆర్ కు తాను రాసిన లేఖను కూడా సంతోషే లీక్ చేసినట్లు కవిత మండిపోయారు. కవిత చేసిన ఆరోపణలన్నీ నిజాలేనా అన్నది తేలకపోయినా దెయ్యాలంటే మాత్రం హరీష్, సంతోష్ అన్న విషయం అందరికీ తెలిసిపోయింది.