
రోడ్డు ప్రమాదం కాదు అది... హత్యే
జోగులాంబ జిల్లాలో మాజీ సర్పంచ్ హత్యకేసును ఛేధించిన పోలీసులు
సినీ ఫక్కీలోబొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మాజీ సర్పంచి ఇటీవల చనిపోయారు. తొలుత ఇది అంతా రోడ్డు ప్రమాదమని భావించారు. కానీ కుటుంబ సభ్యుల్లో మాత్రం రోడ్డు ప్రమాదం కాదు. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్య జరిగిందని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించారు. అది ప్రమాదం కాదని తేల్చేశారు. రూ.25 లక్షలు సుపారీ ఒప్పందం కుదుర్చుకుని చేసిన హత్య అని నిర్ధారించారు. మాజీ సర్పంచ్ ను హత్య చేయడానికి నిందితులు నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నందిన్నె మాజీ సర్పంచి చిన్నభీమ రాయుడిని హత్య చేయించడం జిల్లాలో సంచలనం రేపింది.
కేసు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 21న నందిన్నె మాజీ సర్పంచి చిన్నభీమ రాయుడు ద్విచక్ర వాహనంపై గద్వాల నుంచి సొంతూరు నందిన్నెకు బయల్దేరారు. మార్గ మధ్యలోవెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఆయన్ను బలంగా ఢీకొట్టింది. కొద్ది దూరం మాజీ సర్పంచ్ ను ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే చనియారు. బొలెరో ముందు భాగంలో బైక్ ఇరుక్కు పోయింది. దీంతో డ్రైవర్ సహా నిందితులందరూ పరారయ్యారు. ఈ ఘటనను తొలుత ప్రమాదంగా భావించినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారం రోజుల్లోనే కేసును ఛేదించారు.

