
జీఓ 49కు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన
మనిషి గొప్పా, టైగర్ గొప్పా
ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీలకు టైగర్ కారిడార్ దెబ్బ
తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వుగా పర్యావరణ,అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం ప్రకటిస్తూ జీఓఎంఎస్ నంబరు 49 నంబరుతో మే 30వతేదీన ఉత్తర్వులు జారీ చేయడంపై ఆదివాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 సెక్షన్ 36 ఎ ప్రకారం తెలంగాణలోని కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని మహారాష్ట్రలోని తడోబా-అంథారీ టైగర్ రిజర్వుతో అనుసంధానిస్తూ కొమురంభీం టైగర్ కారిడార్ గా ప్రకటించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఏమిటీ టైగర్ కారిడార్ ?
తెలంగాణతోపాటు పరిసర సరిహద్దు రాష్ట్రాల్లోని పులుల అభయారణ్యాలను కలుపుతూ టైగర్ కారిడార్ ను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని కవ్వాల్ పులుల అభయారణ్యం, మహారాష్ట్రలోని తడోబా- అంథారీ టైగర్ రిజర్వ్, కన్హర్ గావ్, తిప్పేశ్వర్, చప్రాలా వన్యప్రాణుల అభయారణ్యాలు, ఛత్తీస్ ఘడ్ లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ను కలుపుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రాంతాన్ని టైగర్ కారిడార్ గా ప్రకటించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని టైగర్ రిజర్వుల నుంచి పులులు మేటింగ్ సీజనులో సంతానోత్పత్తి కోసం సరిహద్దులు దాటి సంచరిస్తుంటాయి. పులులే కాకుండా చిరుతలు, అడవి కుక్కలు, తోడేళ్లు, హైనా, జంగిల్ క్యాట్ , సాంబార్, నీలుగాయి, చీతల్ తదితర వన్యప్రాణులు మూడు రాష్ట్రాల్లో అభయారణ్యాల నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ఇటీవల ఏనుగుల సంచారం కూడా మొదలైంది.కొమురం భీం జిల్లా అడవుల్లో వన్యప్రాణులే కాకుండా 240 రకాల పక్షి జాతులున్నాయి.ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పులుల పరిరక్షణ కోసం టైగర్ కారిడార్ గా సర్కారు ప్రకటించింది.
టైగర్ కారిడార్ లో ఏ ఏ ప్రాంతాలు వస్తున్నాయంటే...
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 1492.88 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పరిరక్షణ రిజర్వుగా ప్రభుత్వం జీఓఎంస్ నంబరు 49 ద్వారా ప్రకటించింది. కెరమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, సిర్పూర్ (టి), కౌటాల, బెజ్జూర్, కాగజ్ నగర్, రెబ్బన,పెంచికల్ పేట్, కర్జెల్లీ, దహేగావ్,తిర్యాణీ మండలాల్లోని 349 గ్రామాలను ఈ పరిరక్షణ రిజర్వులోకి తీసుకువచ్చారు. దీనిలో 78 రిజర్వు ఫారెస్టు బ్లాకుల్లో గార్లపేట్, అడా,తూర్పు మాణిక్ గడ్,పశ్చిమ మాణిక్ గడ్, ధనోరా, గూడెం, బెజ్జూర్, గిరాలీ ఆర్ఎఫ్ లున్నాయి.
జీవ వైవిధ్య పరిరక్షణ కోసమే...
కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతిపాదిత పరిరక్షణ రిజర్వు ప్రాంతంలోని 1492 కిలోమీటర్ల ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ, ఆవాస పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నారు.ఈ టైగర్ కారిడార్ రిజర్వు ప్రాంతంలో జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, జన్యు వైవిధ్య రక్షణ, వృక్షాలు, జంతు జాతులను సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. జాతీయ ఉద్యనవనాల అభివృద్ధి, అభయారణ్యాల పరిరక్షణ ద్వారా వన్యప్రాణులు, పులుల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ప్రజలు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నారు.
జలవనరుల పరిరక్షణకు...
కొత్తగా ఏర్పాటు చేసిన కొమురంభీం ఆసిఫాబాద్ పరిరక్షణ రిజర్వు గోదావరి నదీ బేసిన్ పరిధిలోకి వస్తుంది. వార్ధా, ప్రాణహిత ఉపనదులతో పాటు పెద్దవాగు, నాగులవైవాగు, బొక్కివాడు, వట్టివాగు, చెల్మెలవాగు, పెనుగంగా, ఉపనదులు కూడా ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తున్నాయి. వేసవిలో వాగులు ఎండిపోవడంతో వన్యప్రాణులకు తాగునీరు అందించేందుకు సౌర బోరు బావులు, ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. బెజ్జూరులోని మఠాడి, సమ్మక్కసార్క ఉట్లు, గూడెం రిజర్వు ఫారెస్ట్ లోని శివపల్లి, గార్లపేట, జోగాపూర్, సర్కేపల్లి శాశ్వత నీటిబుగ్గలున్నాయి. పెద్ద వాగుపై 1500 హెక్టార్ల విస్తీర్ణంలో కొమురం భీం రిజర్వాయర్ ఉంది. వట్టివాగుపై 1100 హెక్టార్లలో ఆనకట్ట నిర్మించారు. ఈ రిజర్వు ప్రాంతంలో జల వనరుల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.
కొమురం భీం అభయారణ్యంలో జంతుజాలం
కొమురం భీం అభయారణ్యంలో వృక్షాలే కాదు జంతుజాలం కూడా అధికంగా ఉంది. 240 రకాల పక్షులు, 23 రకాల కీటకాలు, 34 జాతుల సరీసృపాలు, పులులు, చిరుతలు, ఇండియన్ కోబ్రా, రస్సెల్ వైపర్ , రాక్ పైథాన్, స్టార్ తాబేళ్లు, జింకలున్నాయి.
గ్రామస్థులను సంప్రదించకుండానే జీఓ జారీ
కొమురం భీం అభయారణ్యంకొమురం భీం అభయారణ్యం జీఓను 339 గ్రామాల ప్రజలను సంప్రదించకుండానే జారీ చేశారని తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయకుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జిల్లా అటవీశాఖ అధికారులు, 339 గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరిపాకే ఈ ప్రాంతాన్ని పరిరక్షణ రిజర్వుగా ప్రకటించామని జీఓలో పేర్కొన్నారని, అది అబద్ధమని ఆయన తెలిపారు. అటవీశాఖ అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, పశుసంవర్థకశాఖ, వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు కూడా టైగర్ కారిడార్ ప్రతిపాదనకు మద్ధతు ఇచ్చారని జీఓలో పేర్కొన్నారని ఆయన ఆరోపించారు.
జీఓ 49 ను రద్దు చేయాలని డిమాండ్
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ లో ఆదివాసీ సంస్థలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వేలాది మంది ఆదివాసీలు తమ పూర్వీకుల ఆవాసాలు స్థానభ్రంశం చెందకుండా ,తమ వారి జీవనోపాధికి అంతరాయం కలగకుండా నిరోధించడానికి టైగర్ కారిడార్ ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చిన జీఓ 49 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉట్నూర్ లోని ఆదివాసీ భవన్ లో ఆదివాసీ హక్కులా పోరాట సమితి అయిన తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పూర్వపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదివాసీ సంస్థలైన రాయి సెంటర్ల ప్రతినిధులు, గోండ్వానా సంఘం,గిరిజన గణతంత్ర,గిరిజన సంక్షేమ పరిషత్ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గిరిజన హక్కులను కాపాడటానికి 49 జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని డిమాండ్
ఆదివాసీల సాగుభూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన జీవో-49ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని 4లక్షల ఎకరాలను అదానీకి అప్పజెప్పిందని ఆయన ఆరోపించారు.
గిరిజనుల వరుస ఆందోళనలు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన టైగర్ కారిడార్ ను రద్దు చేయాలని ఆదివాసీ, గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. దండేపల్లి మండలంలోని కోయపోచంగూడా గ్రామంలో వారు ఫ్ల కార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.జీవో నెంబర్ 49తో ఆదివాసుల హక్కులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఆ జీవోను రద్దు చేయాలని వారు కోరారు.
గిరిజనుల ర్యాలీ
జీఓ 49కు వ్యతిరేకంగా గిరిజన సంఘాల ప్రతినిధులు ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ర్యాలీ తీశారు. 339 గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి టైగర్ కారిడార్ జీఓను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర తుడుం దెబ్బ అధ్యక్షుడు కోట్నాక విజయకుమార్ కోరారు. ఈ జీఓ రద్దుకు ఆసిఫాబాద్ లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తీర్మానం చేశామని ఆయన చెప్పారు.
గిరిజన ఎమ్మెల్యేల సమావేశం తీర్మానం
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోసం అటవీశాఖ తీసుకొచ్చిన జీవో 49ను రద్దు చేయాలని గిరిజన ఎమ్మెల్యే సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలంగాణ మంత్రి సీతక్క వెల్లడించారు. గ్రామసభల అనుమతులు లేకుండా ఏకపక్షంగా జీవో 49 ని విడుదల చేయడాన్ని గిరిజన ఎమ్మెల్యేల సమావేశంలో తప్పుపట్టారు. తడోబా టైగర్ రిజర్వ్ (Tiger Reserve) నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ తెలంగాణ పర్యావరణ, అటవీ శాఖ జారీ చేసిన జీవో 49 ని రద్దు చేయాలని గిరిజన ఎమ్మెల్యేల సమావేశంలో తీర్మానం చేసిందని మంత్రి సీతక్క చెప్పారు.
జీవో 49 పత్రాల దహనం
ఆదివాసీలకు ఇబ్బంది కలిగించే జీవో 49ని రద్దు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివాసీలు సాగుచేస్తున్న భూముల నుంచి, వారు నివసిస్తున్న ప్రాంతాల నుంచి వారిని దూరం చేసి కార్పొరేట్ కంపెనీలకు అడవులను కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవో 49 టైగర్ కంజర్వేషన్‌ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ మిడియం బాబురావు డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట టీఏజీఎస్ ఆధ్వర్యంలో జీవో 49 పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు.
పులులపై ఉన్న ప్రేమ ఆదివాసీలపై ఏది?
టైగర్ జోన్ పేరిట ఆదివాసులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వానికి గిరిజనులు వార్నింగ్ ఇచ్చారు. టైగర్ జోన్ జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అడవి బిడ్డలు నివసిస్తున్న ప్రాంతంలో జీవో నెంబర్ 49ను తీసుకువచ్చి ఆదివాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేంద్రంపై మాజీ ఎంపీ సోయం బాపూరావ్ మండిపడ్డారు. పులులు, జింకలు, అడవి జంతువులపై ఉన్న ప్రేమ ఆదివాసులపై లేదా అని ఆయన ప్రశ్నించారు.
ఆదివాసీల రిలే నిరాహార దీక్షలు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 10 రోజులుగా సాగుతున్న దీక్షలకు మద్దతుగా మాజీ ఎంపీ సోయం బాపూరావ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని ఆదివాసులకు మద్దతు తెలిపారు.ఆదివాసుల ప్రాణాల కంటే, పులుల సంరక్షణే ముఖ్యమా? అనీ బీఅర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జీఓ 49 సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ కమిటీ
కవ్వాల్ టైగర్ రిజర్వ్, తడోబా అంధారి రిజర్వ్ మధ్య టైగర్ కారిడార్‌ను కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించిన ప్రభుత్వ ఉత్తర్వు (జిఓ) నంబర్ 49 ను సమీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ జీఓపై గిరిజనుల ఆందోళనలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.తెలంగాణ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు, పీసీసీఎఫ్ పి. సువర్ణలు ఈ అంశంపై చర్చించి, ఆందోళనలను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Next Story