డల్లాస్, ఇస్తాన్ బుల్ అయిపోయింది. న్యూయార్క్ మిగిలింది
x
Revanth and KCR

డల్లాస్, ఇస్తాన్ బుల్ అయిపోయింది. న్యూయార్క్ మిగిలింది

డల్లాస్ అయిపోయి ఇస్తాన్ బుల్ కూడా అయిపోయింది. ఇపుడు కొత్తగా న్యూయార్క్ మొదలైంది.


డల్లాస్ అయిపోయి ఇస్తాన్ బుల్ కూడా అయిపోయింది. ఇపుడు కొత్తగా న్యూయార్క్ మొదలైంది. ఏమి అర్ధంకావటంలేదు. తాజాగా రేవంత్ రెడ్డి అమెరికాలోని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ రియలఎస్టేట్ ప్రాపర్టీ సంస్ధ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళతో రేవంత్ మాట్లాడుతు ‘తమ ప్రభుత్వం చేపట్టిన మూసీనది ప్రాజెక్టు, ప్రాంతీయ రింగురోడ్డు, మెట్రోరైలు విస్తరణతో హైదరబాద్ అద్భుతంగా తయారవబోతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో దేశంలోని ఇతర నగరాలతో కాకుండా న్యూయార్క్ అభివృద్ధితో పోటీపడేలా చేస్తామ’ని చెప్పారు.

అభివృద్ధి విషయంలో హైదరాబాద్ ను ప్రపంచదేశాల పక్కన నిలబెట్టాలని తమ ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉందన్నారు. తెలంగాణా నుండి అమెరికాకు వెళ్ళి స్ధిరపడిన వారు, వెళ్ళి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అందుకనే హైదరాబాద్ ను న్యాయార్క్ మహానగంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. ఇక్కడే రేవంత్ డైలాగులు విచిత్రంగా వినబడుతున్నాయి. ఎందుకంటే అభివృద్ధిలో న్యూయార్క్ స్ధాయికి హైదరాబాద్ చేరుకోవాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది ? పాలకుల్లో ఎంతటి చిత్తశుద్ది అవసరం ? ఎన్ని లక్షల కోట్లరూపాయలు ఖర్చవుతుంది ? లాంటి విషయాలను ఆలోచించకుండా న్యూయార్కని వాషింగ్టన్ అని ఏదేదో చెప్పేస్తారు. అందుకనే విన్నవాళ్ళు కూడా వీళ్ళమాటలను చాలా లైటుగా తీసుకుంటారు.

గతంలో కేసీయార్ అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ ను డల్లాస్ నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. చివరకు ఏమైంది ? గట్టిగా ఒక వర్షంపడితే రోడ్డేదో, మ్యాన్ హోల్ ఏదో ? డ్రైనేజీ ఏదో కూడా హైదరాబాద్ జనాలకు తేడా తెలీదు. చేయగలిగింది ముందు చేయండంటే ఆ విషయాన్ని ఆలోచించరు. ఎంతో ముందుచూపుతో ప్రణాళికాబద్దంగా నిర్మించిన నగరాలు ఎక్కడ ? మన హైదరాబాద్ ఎక్కడ ? విదేశాలకు వెళ్ళొచ్చినపుడల్లా ఏ దేశానికి వెళితే ఆ దేశంలాగ హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామనే ప్రకటనలు చాలా మామూలైపోయాయి. ముందు ప్రకటన ఇచ్చేసి తర్వాత దాన్ని గాలికొదిలేయటం పాలకులకు అలవాటైపోయింది. డల్లాస్ తర్వాత హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీని ఇస్తాన్ బుల్ లాగ తీర్చిదిద్దుతానని కేసీయార్ ప్రకటించారు. హైదరాబాద్ డల్లాస్ కాలేదు, ఓల్డ్ సిటీ ఇస్తాన్ బుల్ లాగా కాలేదు.

పదేళ్ళు అపరిమితమైన అధికారాలను అనుభవించి 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. తన హయాంలో వర్షపునీళ్ళు సజావుగా వెళ్ళిపోయేందుకు డ్రైనేజీ వ్యవస్ధను కూడా ఏర్పాటుచేయలేకపోయారు. కేసీయార్ హయాం ముగిసిపోయిందని అనుకుంటుండగానే రేవంత్ తాజాగా న్యూయార్క్ పాటెత్తుకున్నారు. హైదరాబాద్ ను న్యూయార్క్ లాగ తయారుచేస్తారట. జరిగే పని చెప్పండయ్యా, చెప్పింది చేయండయ్యా బాబూ అని జనాలు ఎంత మొత్తుకున్నా పాలకులకు చెవికెక్కటంలేదు. ఊరికే డల్లాస్, ఇస్తాన్ బుల్, న్యూయార్క్ అని నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు.

Read More
Next Story