
హీటెక్కిన తెలంగాణ అసెంబ్లీ.. చిన్నబుచ్చుకున్న స్పీకర్
ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్పీకర్ చెయిర్‌ను ఆయన ఉద్దేశపూర్వకంగానే కించపరిచారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమ పార్టీ నేత జగదీష్ రెడ్డి ఏమాత్రం తప్పుమాట్లాడలేదని బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, కాంగ్రెస్ నేతలు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని, స్పీకర్‌ను కించపరిచేలా ఆయన ఎలా మాట్లాడతారని, ఆయన తాను చేసిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని, స్పీకర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడానికి గురువారం సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జగదీష్ రెడ్డిని అసహనానికి గురికావొద్దంటూ స్పీకర్ అన్నారు. అందుకు స్పందించిన జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సభ అందరిదీ. సభ్యులందరికీ సభలో సమాన హక్కులు ఉన్నాయి. మా అందరి తరుపున పెద్దమనిషిగా స్పీకర్ స్థానంలో మీరు కూర్చున్నారు. అంతే తప్ప ఈ సభ మీకు కూడా ఏమీ సొంతం కాదు’’ అని అన్నారు. ఆయన మాటలతో సభలో తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, చెయిర్‌ను అవమానించేలా మాట్లాడటం దారుణమని అన్నారు.
కాంగ్రెస్ నేతలంతా ముక్తకంఠంతో క్షమాపణలు డిమాండ్ చేస్తుండగా.. హరీష్ రావు స్పందించారు. జగదీష్ రెడ్డి అన్నదాంట్లో ఏం తప్పుందన్నారు. ఆయన సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, కాంగ్రెస్‌కు మాత్రమే అన్ని హక్కులు ఉండవని అన్నారు తప్పితే.. చెయిర్‌ను ఉద్దేశించి అనలేదని చెప్పారు. కాగా ఈ రసాబాసతో స్పీకర్ తీవ్ర మనస్థాపం చెందారు. దీంతో ఆయనతో మంత్రులు సమావేశమయ్యారు. ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. జగదీష్ రెడ్డి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత స్పీకర్‌పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్పీకర్‌పై ఇంత అహంకారంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడటం తానెప్పుడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్‌కు కొన్ని అధికారాలు ఉంటాయని, జగదీష్ రెడ్డిపై సీరియస్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్‌ను కలిశారు. జగదీష్ రెడ్డి.. స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. బీఆర్ఎస్ నేత ఉద్దేశపూర్వంగా స్పీకర్‌ను అనలేదని చెప్పారు. సభ చర్చ సందర్భంగామా సభ్యుడు జగదీష్ రెడ్డి ‘మీ’ అని కాంగ్రెస్‌ను దృష్టిలో పెట్టుకుని అన్నారని వివరించారు. అధికారపక్షాన్ని ఉద్దేశించే ఆయన ‘మీ’ అని అన్నారని, చైరన్‌ను అగౌరవ పరిచే విధంగా వ్యవహరించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించారు. సభసజావుగా సాగేలా చూడాలని వారు కోరారు. కాగా సభ ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.