మోడీని ప్రసన్నం చేసుకునేందుకు జగన్ పాట్లు ?
గాలి ఏ స్ధాయిలో ఎదురు వీస్తోందంటే మోడి, అమిత్ షా అపాయిట్మెంట్ కోసం జగన్ ఎంత ప్రయత్నంచేసినా దొరకనంతగా.
బండ్లు ఓడలు..ఓడలు బండ్లు అవుతాయనటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదంతమే నిదర్శనం. ఎన్నికలు జరగకముందు వరకు జగన్ ఏమనుకుంటే ఢిల్లీ లెవల్లో అది జరిగిపోయేది. నరేంద్రమోడి, అమిత్ షా అపాయింట్మెంట్ ఎప్పుడు కావాలంటే ఒకరోజు అటు ఇటుగా దొరికేది. రెండు రోజుల్లో రెండుసార్లు మోడీని జగన్ కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పట్లో జగన్ హవా ఢిల్లీలో అలాగుండేది మరి.
సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అసెంబ్లీల్లోనే కాదు పార్లమెంటు ఎన్నికల్లో కూడా పార్టీ బాగా దెబ్బతినేసింది. దాంతో అప్పటివరకు నడుస్తున్న జగన్ హవా ఒక్కసారిగా తిరగబడింది. గాలి ఎదురు వీయటం మొదలైంది. గాలి ఏ స్ధాయిలో ఎదురు వీస్తోందంటే మోడి, అమిత్ షా అపాయిట్మెంట్ కోసం జగన్ ఎంత ప్రయత్నంచేసినా దొరకనంతగా. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు దెబ్బకు జగన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. బాగా సఫోకేషన్ ఫీలవుతున్నారు. ఆ సఫోకేషన్లో నుండి బయటపడేందుకు మార్గం ఏమిటంటే మోడిని కలవటం ఒక్కటే.
మోడీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించి ప్రభుత్వం లేదా టీడీపీ దాడుల నుండి రక్షణ కోరుకుంటున్నారు. అయితే మోడి లేదా అమిత్ షా ఏమో అపాయిట్మెంట్ ఇవ్వటంలేదు. అందుకనే సడెన్ గా ఎన్డీయే వ్యతిరేక స్టాండ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్యనే కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు బాగా వివాదాస్పదమవుతోంది. ఈ సవరణ బిల్లును ముస్లిం సంఘాలు, పార్లమెంటులో ముస్లిం ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగి ఓటింగ్ అనివార్యమైతే అప్పుడు బిల్లు గెలవటం అన్నది మోడీ ప్రభుత్వానికి చాలా ప్రిస్టేజి అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు జగన్ ప్రకటించకుండా తన ఎంపీలు, పార్టీలోని ముస్లిం నేతలతో వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు.
రాజ్యసభలో బిల్లును పాస్ చేయించుకునేందుకు ఎన్డీయేకి మెజారిటిలేదు. ఈ నేపధ్యంలో వైసీపీకి ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీల ఓట్లు చాలా కీలకమవుతుంది. రాజ్యసభలో ప్రస్తుతం 229 మంది ఎంపీలున్నారు. ఇందులో ఏ బిల్లు నెగ్గాలన్నా కచ్చితంగా 115 ఓట్లు అవసరం. ఎన్డీయేకి ఉన్నది 111 ఎంపీలు మాత్రమే. ఈ పరిస్ధితుల్లో వైసీపీ 11 మంది ఎంపీల పాత్ర ఎంతటి కీలకమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వైసీపీతో పాటు ఒడిస్సాలోని బీజూ జనతాదళ్ కు 6 మంది ఎంపీలున్నారు. ఇప్పటి పరిస్ధితుల కారణంగా బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఎన్డీయేకి మద్దతివ్వటం కష్టమే.
ఇక్కడ రెండు విషయాలున్నాయి. అవేమిటంటే మొదటిది ఎన్డీయేకి జగన్ ఎంపీల మద్దతు చాలా అవసరం. రెండో విషయం ఏమిటంటే ఏపీలో జరుగుతున్న పరిణామాల్లో మోడీ నుండి జగన్ రక్షణ కోరుకుంటున్నారు. అందుకనే మోడీ అపాయిట్మెంట్ కోరుతుంటే పట్టించుకోవటంలేదు. అందుకనే అవకాశం దొరికింది కాబట్టి వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు వివాదాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లున్నారు. బిల్లు ఓటింగును అడ్డం పెట్టుకుని మోడీనుండి తనకు పిలుపువచ్చేట్లుగా జగన్ ప్రయత్నాలు చేసుకుంటున్నట్లున్నారు. బిల్లుకు జగన్ మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్నది వేరే విషయం. ముందైతే మోడీ నుండి పిలుపు రప్పించుకోవాలి అన్నది మాత్రమే జగన్ టార్గెట్ గా కనబడుతోంది. ఒకవైపు మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తునే అదే సమయంలో మోడీపై ఒత్తిడి పెంచి భేటీకి పిలుపొచ్చేట్లుగా జగన్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.