
సీబీఐ కోర్టులో ముగిసిన జగన్ విచారణ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు జగన్(YS Jaganmohan Reddy) గురువారం సీబీఐ(CBI court) కోర్టుకు వచ్చారు.
హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణ ముగిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు జగన్(YS Jaganmohan Reddy) గురువారం సీబీఐ(CBI court) కోర్టుకు వచ్చారు. ఇన్నిసంవత్సరాల విచారణలో జగన్ కు వ్యక్తిగతహాజరునుండి మినహాయించిన కోర్టు తాజాగా వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేసింది. వ్యక్తిగత మినహాయింపును సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపధ్యంలోనే ఈరోజు జరిగిన విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉదయం హైదరాబాదు(Hyderabad)లోని బేగంపేట విమానాశ్రయానికి జగన్ చేరుకుని అక్కడి నుండి నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.
బేగంపేట విమానాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. నేతలు, అభిమానులకు అభివాదం చేస్తు విమానాశ్రయంనుండి బయటకు వచ్చిన జగన్ తో పాటు అభిమానులు భారీఎత్తున ర్యాలీగా సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎయిర్ పోర్టు, కోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కోర్టులో జగన్ తో పాటు లాయర్లను తప్ప ఇంకెవరినీ పోలీసులు అనుమతించలేదు. విచారణ ప్రక్రియ ముగియగానే జగన్ లోటస్ పాండ్ లోని తన నివాసంకు చేరుకున్నారు. కాసేపటిలో అక్కడినుండి తల్లి విజయమ్మ దగ్గరకు వెళ్ళబోతున్నారు. జగన్ హైదరాబాదుకు చాలా కాలం తర్వాత వచ్చారు. దాంతో ఎయిర్ పోర్టుతో పాటు కోర్టు దగ్గర అభిమానులు పెద్దఎత్తున హడావుడిచేశారు.

