రాజకీయాల నుంచి జగ్గారెడ్డి బ్రేక్..
x

రాజకీయాల నుంచి జగ్గారెడ్డి బ్రేక్..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఎవరో చెప్పిన నేత.


దసరా ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తేల్చి చెప్పారు. మరో 10 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాతనే తాను మళ్ళీ ఎన్నికల బరిలో నిలబడతానన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. అసలు ఏమైందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు? అన్న చర్చ గట్టిగానే జరుగుతోంది. పార్టీ నేతలతో కొంతకాలంగా జగ్గారెడ్డికి పొసగడం లేదని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్దగా కనిపించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే తాను పోటీ చేయడం లేదన్న ప్రకటన కన్నా.. తన స్థానంలో తన భార్య నిర్మల బరిలో నిలుస్తారని జగ్గా రెడ్డి చేసిన ప్రకటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిర్మల పోటీ చేస్తారని జగ్గారెడ్డి చప్పడం కాదని, ఆమెకు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ ఓకే చెప్తుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

పదేళ్లు బ్రేక్..

దసరా పండగ వేడుకల సందర్భంగా తన రాజకీయ కార్యాచరణపై మాట్లాడిన జగ్గారెడ్డి. పదేళ్ల తర్వాత మళ్ళీ తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. దాంతో అప్పటి వరకు ఆయన రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకుంటారని స్పష్టం అవుతోంది. ‘‘నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. నన్ను గెలిపించిన నియోజకవర్గం కోసం ఏం చేయాలో.. అంతా చేశాను. రాజకీయ పరంగా నేనో నిర్ణయం తీసుకున్నా. దానిని ప్రజలకు ముందుగానే చెప్పాలి. వాళ్లకి క్లారిటీ ఇవ్వాలి. సంగారెడ్డిలో మళ్ళీ నేను ఎన్నికల్లో నిలబడేది పదేళ్ల తర్వాతే. ఈ మధ్యలో ఇంకెవరైనా పోటీ చేయొచ్చు. అందుకే ఇప్పుడే చెప్తున్నా.. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను’’ అని జగ్గారెడ్డి చెప్పారు.

యువతకు కీలక సందేశం..

ఈ సందర్భంగానే యువత కూడా మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసలై యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. అదే విధంగా వాహనాలు నడిపే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అతివేగం అవసరం లేదని, అది అనర్థాలనే తెస్తుందని అన్నారు. యువత అనుక్షణం తమ లక్ష్య సాధనకోసం పరితపించాలని, జీవితంలో విజయం సాధించడంపైనే దృష్టి పెట్టాలని అన్నారు.

Read More
Next Story