లడ్డూ వివాదంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
x
Congress leader Jaggareddy

లడ్డూ వివాదంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

. శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నది తేల్చకుండా రాజకీయాలు మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు


తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీలో అసలు విషయం మరుగునపడిపోయి రాజకీయాలు పెరిగిపోయాయి. లడ్డూ ప్రసాదంలో కల్తీ అన్న ఆరోపణతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని భూస్ధాపితం చేసేయాలని చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నట్లు వైసీపీ నేతలు ఎదురుదాడులు చేస్తున్నారు. ఇంతలో లడ్డూ ప్రసాదం వివాదంలోకి దేశంలోని చాల రాజకీయపార్టీలు చొరబడిపోయాయి. పార్టీలు, నేతలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేస్తుండటంతో భక్తుల్లో గందరగోళం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణా కాంగ్రెస్ లో సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి ఏమన్నారంటే లడ్డూ వివాదంలోకి రాజకీయాలు దూరిపోయినట్లు చెప్పారు. శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నది తేల్చకుండా రాజకీయాలు మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జరుగుతున్న వివాదం చూస్తుంటే రాజకీయ ఆరోపణల వెనుక బీజేపీ ఉందేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నట్లు చెప్పారు. బీజేపీనే వెనకుండి చంద్రబాబునాయుడుతో జగన్ కు వ్యతిరేకంగా రాజకీయపరమైన ఆరోపణలు చేయిస్తున్నట్లుందన్నారు. నిజంగానే ప్రసాదంలో కల్తీ జరిగుంటే ఎవరి హయాంలో జరిగింది ? ఎప్పుడు జరిగింది ? అందుకు బాధ్యులెవరు ? అన్న విషయాలను విచారించకుండా కేవలం రాజకీయపరమైన ఆరోపణలతోనే కాలయాపన చేయటం ఏమిటని నిలదీశారు.

మతాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయటం బీజేపీకి మొదటినుండి ఉన్న అలవాటే అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. ఆమధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఓల్డ్ సిటీలో ఓట్ల కోసం బీజేపీ మతాన్ని ఏ స్ధాయిలో వాడుకున్నదో అందరికీ తెలిసిందే అన్నారు. ఇపుడు కూడా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అడ్డంపెట్టుకుని జనాల్లోకి చొచ్చుకుని పోయే ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నట్లు తనకు అనుమానంగా ఉందన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ విషయాన్ని సాంకేతికంగా మాత్రమే పరిమితం చేసి రాజకీయాలు చేయటం తగదని హితవు పలికారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని లడ్డూ ప్రసాదంలో కల్తీ వివాదాన్ని రాజకీయం చేయటం తగదని చెప్పారు. కల్తీ జరిగిందని నిజంగానే తేలితే భవిష్యత్తులో ఇలాంటి పొరబాట్లు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలన్నారు.

అయితే ఆ దిశగా చర్యలు తీసుకోకుండా బీజేపీనే చంద్రబాబుతో మతపరమైన రాజకీయాలు చేయిస్తోందనే అనుమానాలు వ్యక్తంచేశారు. బీజేపీ అజెండా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం అని కాకుండా మతపరమైన రాజకీయాలే అన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. జనాల భావోద్వేగాలను రెచ్చగొట్టి అడ్వాంటేజ్ తీసుకోవటమే బీజేపీ టార్గెట్ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Read More
Next Story