తెలంగాణ పాలిటిక్స్‌లో పవన్ టెన్షన్ !
x

తెలంగాణ పాలిటిక్స్‌లో పవన్ టెన్షన్ !

తెలంగాణ రాజకీయాల్లో తమ మార్క్ చూపించడానికి మున్సిపల్ ఎన్నికలను తొలి మెట్టుగా మలుచుకోవాలని భావిస్తున్న జనసేన.


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది. వీటిలో విజయం సాధించి రాజకీయంగా తమ సత్తా చూపించుకోవాలని అధికార ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో జనసేన పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీలను ఇటీవల రద్దు చేశారు.

వాటి స్థానంలో అడ్‌హక్‌ కమిటీలను నియమించనున్నట్లు కూడా చెప్పారు. అవి 30రోజులు రాష్ట్రంలో పనిచేసి రిపోర్ట్ అందిస్తాయని, ఆ రిపోర్ట్ ప్రకారం పార్టీ బలోపేతం కసరత్తులు స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. ఆ సమయం ముగియకముందే జనసేన మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో తమ మార్క్ చూపించడానికి మున్సిపల్ ఎన్నికలను తొలి మెట్టుగా మలుచుకోవాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. జనసేన తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త టెన్షన్‌కు కారణమైంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉండాల్సిన త్రిముఖ పోరు ఇప్పుడు చతుర్ముఖంగా మారే పరిస్థితి ఏర్పడింది.

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మరింత తీవ్రతరమైంది. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నిర్ణయం వెనుక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

తెలంగాణలో ఇప్పటివరకు పరిమిత కార్యకలాపాలకే పరిమితమైన జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పాల్గొన్న జనసేన, ఈసారి స్వతంత్రంగా బరిలోకి దిగడం ద్వారా తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు సంపాదించుకోవాలని భావిస్తోంది. ఈ పరిణామం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు కొత్త సవాల్‌గా మారుతోంది.

ఇప్పటికే జనసేన బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. జనవరి 10న విడుదల చేసిన ప్రకటనలో ఎన్నికల ప్రచారానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పార్టీ పిలుపునిచ్చింది. ఈ ప్రకటనతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా, అదే సమయంలో ప్రధాన పార్టీల్లో ఆందోళన మొదలైంది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో “పవన్ టెన్షన్”గా మారింది.

జనసేన ఎంట్రీ ఏ పార్టీ ఓటు బ్యాంక్‌ను ప్రభావితం చేస్తుందన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. అయితే పట్టణ ప్రాంతాల్లో యువత, మధ్యతరగతి వర్గాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆదరణ ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్వల్ప ఓటు తేడాలతో ఫలితాలు తేలే మున్సిపాలిటీల్లో జనసేన ప్రభావం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పార్టీ గుర్తుపై జరిగే మున్సిపల్ ఎన్నికలు ప్రతి రాజకీయ పార్టీకి ప్రతిష్టాత్మకమైనవే. ఈ నేపథ్యంలో పెద్దగా యాక్టివ్‌గా లేని జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల సీట్ల సంఖ్య కంటే రాజకీయ ప్రభావమే ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్ల విభజన ద్వారా రాజకీయ సమీకరణాలను మార్చే శక్తి జనసేనకు ఉందన్న భావన ప్రధాన పార్టీల టెన్షన్‌ను పెంచుతోంది.

మొత్తంగా చూస్తే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పాలన వరకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే ఎన్నికలుగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో “పవన్ టెన్షన్” మరింత పెరగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read More
Next Story