పార్టీలో చేరిన 10 నిమిషాలకే జితేందర్ రెడ్డికి మంత్రి హోదా
x

పార్టీలో చేరిన 10 నిమిషాలకే జితేందర్ రెడ్డికి మంత్రి హోదా

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి పార్టీని వీడనున్నారు అనే ప్రచారం నిజమైంది.


ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి పార్టీని వీడనున్నారు అనే ప్రచారం నిజమైంది. ఈ మేరకు జితేందర్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి రాజీనామా లేఖని పంపారు. అనంతరంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి సమక్షంలో కుమారుడితో కలిసి కాంగ్రెస్ లో చేరారు.




కాగా, పార్టీలో చేరిన పది నిమిషాల్లోనే ఆయనకి కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధితో పాటు, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు)గా రాష్ట్ర మంత్రి హోదాలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


జితేందర్ రెడ్డి లేఖలో రాజీనామాకి కారణం ఏమని ఉందంటే...

"బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని నలుమూలలకు తీసుకెళ్లారు. బీజేపీ వల్ల దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే, రాష్ట్ర నాయకత్వం మారిన తర్వాత పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యం. ఇక్కడ పార్టీ కనీసం 25 సీట్లు గెలవాల్సి ఉంది. కానీ 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 8 సీట్లు మాత్రమే సాధించగలిగాము. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో కూడా ఇటీవల పార్టీలో చేరిన బయటి వ్యక్తులకు ప్రాధాన్యత దక్కింది. నేను చాలాసార్లు జాతీయ నేతల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అందుకే, తీవ్ర విచారంతో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈ లేఖను పార్టీకి రాజీనామా లేఖగా పరిగణించవచ్చు" అని జితేందర్ రెడ్డి తన రాజీనామాకి కారణాన్ని వివరించారు.





Read More
Next Story