
చిరు, నాగ్ బాటలో జూనియర్ ఎన్‌టీఆర్
వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్‌టీఆర్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తి హక్కుల పరిరక్షణ కోరుతూ ఆయన ఈ పిటిషన్ వేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కూడా ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఫొటోలు, వీడియోలను తమ అనుమతులు లేకుండా కమర్షియల్ అవసరాలకు వినియోగించకుండా కోర్టు ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్‌టీఆర్ కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఎన్‌టీఆర్ పిటిషన్‌ను జస్టిస్ మన్నీత్ ప్రీతమ్ సింగ్ అరోర విచారించారు.
ఈ విచారణలో ఈ-కామర్స్ సైట్స్, సోషల్ మీడియా వేదికల్లో కంటెంట్.. ఎన్‌టీఆర్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని ఎన్‌టీఆర్ తరుపు న్యాయవాది సాయి దీపక్ వివరించారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం.. ఐటీ నిబంధనలు-2021 కింద ఈ-కామర్స్ వేదికలు, సోషల్ మీడియా సంస్థలు.. ఎన్‌టీఆర్ పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించాలని జస్టిస్ అరోరా పర్కొన్నారు. మూడు రోజుల్లోపు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు.
చిరు, నాగ్ కూడా..
గతంలో సోషల్ మీడియాలో తన అనుమతి లేకుండా కొందరు తన ఫొటోలు, వీడియోలు, వాయిస్‌ను వినియోగిస్తున్నారని, తద్వారా తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని చిరంజీవి.. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నటుడు చిరంజీవి పేరు, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించరాదని న్యాయస్థానం స్పష్టంగా హెచ్చరించింది. టీఆర్పీలు లేదా లాభాల కోసం ఆయన పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ‘MEGA STAR’, ‘CHIRU’, ‘ANNAYYA’ పేర్లతో AI ద్వారా మార్ఫింగ్ చేసిన కంటెంట్‌ను ప్రచారం చేసే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లపై కూడా కోర్టు ఆంక్షలు విధించింది. కింగ్ నాగార్జున కూడా ఇదే తరహాలో హైకోర్టును ఆశ్రయించారు. తమ హక్కులను పరిరక్షించుకోవాలని ఆదేశాలు తెచ్చుకున్నారు.

