తెలంగాణ కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టికెట్ మంట..!
x

తెలంగాణ కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టికెట్ మంట..!

ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అయిపోయిన పార్టీ హైకమాండ్.


తెలంగాణ కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్ అగ్గి రాజేసింది. ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ విషయంలో పార్టీలో వర్గాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో పార్టీ అధిష్టానం క్లారిటీతో ఉందని, ఇప్పటికే అభ్యర్థిని ఎంపిక చేయగా ప్రకటించడమే మిగిలి ఉందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అయితే స్థానికులకే టికెట్ ఇవ్వాలని కోరేవారు, సమర్థుడైన నాయకుడికే టికెట్ ఇవ్వాలని కోరేవారు అనే రెండు వర్గాలు ఏర్పడినట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అనిపిస్తోంది. జూబ్లీహిల్స్ టికెట్‌ను స్థానికులకే ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కాగా ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తీవ్రంగా తప్పుబట్టడం ఈ చర్చలకు దారితీశాయి. స్థానికులకే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అవకాశం ఇవ్వాలన్న పొన్నం వ్యాఖ్యలను సరైనవి కావని ఫిరోజ్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

సీఎం ఉండే నియోజకవర్గం అది: ఫిరోజ్

తెలంగాణ కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టి పోటీ ఉంది. ఈ టికెట్ తనదే అని ఒకవైపు అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఫిరోజ్ ఖాన్ కూడా ఒకరు. ఇప్పుడు స్థానికత అనే అంశం తెరపైకి రావడంతో ఫిరోజ్ ఘాటుగా స్పందించారు. ‘‘రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పుట్టి పెరిగారా? వాళ్లెందుకు వయనాడ్‌లో పోటీ చేస్తున్నారు? ఎన్నికల్లో పోటీ అనేది అభ్యర్థి సత్తా, ప్రచారం జరిగే తీరుపై ఆధారపడి ఉంటాయి. సీఎం ఉండే నియోజకవర్గం ఇది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం. జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఉంటేనే సీటు ఇస్తారా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖరారు..!

అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అయిపోయిందని సమాచారం. ఈ టికెట్ కోసం ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన మహ్మద్ అజహారుద్దీన్, పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి, రేవంత్‌కు సన్నిహితుడైన రోహిన్‌రెడ్డిలతో పాటు నాంపల్లిలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్, బండి రమేష్, నవీన్ యాదవ్‌ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మైనారిటీ నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ను కలిసి ఈ టికెట్ అంశంపై చర్చించారు. కేబినెట్‌లో మైనారిటీ నేతలకు ప్రాతినిధ్యం లేనందుకు ఈ ఉపఎన్నిక టికెట్‌ను తమ వర్గం వారికి అందించాలని కోరినట్లు సమాచారం. అదే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్.. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో మరోసారి అజారుద్దీన్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కాగా అజారుద్దీన్‌కు టికెట్ ఖరారు చేయడంపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసే ఫిరోజ్ ఖాన్ ఘాటు స్పందించారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story