రేపే జూబ్లీ పోలింగ్, పూర్తయిన ఏర్పాట్లు..
x

రేపే జూబ్లీ పోలింగ్, పూర్తయిన ఏర్పాట్లు..

ఉత్కంఠభరితంగా మారిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక.


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం జరగనుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య హోరాహోరీ పోటీ జరగనున్నట్లు వాతావరణం ఉంది. ప్రతి పార్టీ అభ్యర్థి కూడా ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలన్న కసితో గత 18 రోజుల పాటు ప్రచారం చేశారు. పార్టీల బడా నేతలు సైతం ఈ ప్రచారంలో తమ అభ్యర్థులకు వెన్నంటే ఉన్నారు. ఈ ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం కూడా భారీగాఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. వారిని సోమవారం కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉపఎన్నిక రాష్ట్రమంతా హాట్ టాపిక్‌గా మారింది. పేరుకు ఉపఎన్నికే అయినా.. అసెంబ్లీ ఎన్నికల తరహాలో దీని గురించ చర్చించుకుంటున్నారు. ఇందులో ఎవరు విజయం సాధిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అదే విధంగా పార్టీలు కూడా జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకోవడానికి చాలా పట్టుదలతో పనిచేస్తున్నాయి.

జూబ్లీ బరిలో 58 మంది..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 150 మంది వరకు నామినేషన్లు వేయగా.. ఆఖరికి 58 మంది అభ్యర్థులు మిగిలారు. కాగా వీరిలో బీఆర్ఎస్ తరుపున మాగంటి సునీత.. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే ఒక మోస్తరు ప్రచారం కూడా స్టార్ట్ చేసేశారు. ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతోనే బీఆర్ఎస్ చాలా స్పీడ్‌గా తమ అభ్యర్థిని ప్రకటించేసింది. ఆ తర్వాత కాస్తంత టైమ్ తీసుకుని.. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడింది. ఆఖరికి ఓటర్ల ప్రాతిపదికన.. స్థానికత ప్రాతిపదికన.. నవీన్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా వెల్లడించింది. కాలా మిగిలిన పార్టీలు ప్రచారం చేసేస్తున్నా బీజేపీ మాత్రం నిమ్మకునీరెత్తినట్లు కూర్చుంది. ఆఖరుగా నామినేషన్ల వేయడానికి ఆఖరు రోజున లంకల దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించి.. అదే రోజు నామినేషన్ వేయించింది. అప్పటి నుంచి మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. రాత్రింబవళ్లు బడా నేతలు సైతం గల్లీల వెంట తిరిగి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు.

గంట అదనంగా పోలింగ్..

మంగళవారం ఉదయం 7 గంటలకే ఉపఎన్నిక పోలింగ్ షురూ కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే నియోజవకర్గమంతా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ఉపఎన్నిక.. సాధారణ ఎన్నికలకన్నా గంటసేపు అదనంగా జరగనుంది. నియోజకవర్గ పరిధిలో 4లక్షలకుపైగా ఓటర్లు ఉండటంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 986 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు అధికారులు. అత్యధికంగా పోలింగ్ స్టేషన్ 9లో 1,233 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నెంబర్ 263లో 540 మంది ఓటర్లే ఉన్నారు. మొత్తం 11 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు.

ఓటర్ల వివరాలిలా..

నియోజవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మందిగా ఉన్నారు. అంతేకాకుండా 18 మంది సర్వీస్ ఓటర్లు, 25 మంది ఇతరులు, 123 మంది విదేశీ ఓటర్లు కూడా ఉన్నారు. మొత్తం 1,908 మంది వికలాంగులు, 6,859 మంది 18 నుంచి 1 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఉన్నారు. అంటే వీరు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సీనియర్ ఓటర్లలో 85ఏళ్లు పైబిన వారు 2,134 మంది ఉన్నారు.

భారీగా భద్రత..

ఉపఎన్నిక కోసం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. డీసీపీలు, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, హెడ్ కానిస్టుబుళ్లు, మహిళా కానిస్టుబుళ్లు, హోమ్ గార్డులతో సహా 1,761 మంది సిబ్బందితో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. శాంతి భద్రతలకు ఏమాత్ర విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎనిమిది కంపెనీలను కలిగి ఉన్న 73 పారామిలిటరీ దళాల విభాగాలు మోహరించాయి. ఓటర్లకు జారీ చేసే ఓటరు సమాచార స్లిప్లు గుర్తింపు రుజువు కావు. అవి మార్గదర్శకంగా మాత్రమే పనిచేస్తాయి. ఓటర్లు EPIC కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే IDని లేదా ECI పేర్కొన్న 12 పత్రాలలో దేనినైనా తీసుకెళ్లాలి.

Read More
Next Story