తుదిఘట్టానికి  చేరుకున్న జూబ్లీహిల్స్  ప్రచారం
x

తుదిఘట్టానికి చేరుకున్న జూబ్లీహిల్స్ ప్రచారం

ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెర


జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారం తుదిఘట్టానికి చేరుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగుస్తుంది. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో నాలుగు లక్షల వోటర్లు ఉన్నారు. లక్షాపాతికవేల ముస్లిం మైనార్టీల వోట్లు కీలకం కావడంతో ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది అనే ప్రచారం జరుగుతోంది.


జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన తమ్ముడు , ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ముస్లింవోటర్లను ఆకర్షించడానికి గట్టి ప్రచారం చేస్తున్నారు.

అందరి కంటే ముందే బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటి ప్రచారం, పాదయాత్ర, రోడ్ షోలు ప్రారంభించారు. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ తరపున కెటీఆర్, బిజెపి తరపున కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రోడ్ షో, కార్నర్ మీటింగుల్లో పాల్గొని తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. బిఆర్ ఎస్ బైక్ ర్యాలీలు చేస్తోంది. శనివారం షేక్ పేట నుంచి బోరబండవరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలి జరిగింది. జన ప్రియ అపార్ట్ మెంట్ వద్ద వోటర్లను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కలుసుకుని బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు.


మరో వైపు బిజెపి చీఫ్ రాంచందర్ రావు ఎర్రగడ్డ వద్ద బ్రేక్ ఫాస్ట్ మీట్ లో పాల్గొన్నారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో బిజెపి, బిఆర్ఎస్ మధ్య వోట్ల మార్పిడి జరుగుతోందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ బిజెపికి సహకరించిందని, దానికి బదులుగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తోందని ఆయన అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కెటిఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వటంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాత్సారం చేస్తున్నారని పొన్నం ఆరోపించారు. చివరి రెండు రోజుల్లో వోటర్లను ఆకర్షించడానికి అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

Read More
Next Story