సమ్మె సైరన్.. ఆసుపత్రుల్లో ఇబ్బందులు తప్పవా
x
Photo Credits : Google

సమ్మె సైరన్.. ఆసుపత్రుల్లో ఇబ్బందులు తప్పవా

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించనున్నారు. దీంతో ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల సేవలు కొరవడి ట్రీట్మెంట్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.


తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించనున్నారు. ఈ నెల 22 నుంచి స్ట్రైక్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల సేవలు కొరవడి ట్రీట్మెంట్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, జూనియర్ డాక్టర్లు వారికి రావాల్సిన స్టైఫండ్ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఆందోళనలు చేపట్టిన జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మెబాట పట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సమ్మె నోటీసును జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ డీఎంఈ వాణికి సోమవారం అందించారు.

ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా స్టైఫండ్ సమస్య ఉందన్నారు. రెండు నెలల నుంచి స్టైఫండ్ అందక ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. ఇది కేవలం ఒక్క నెల సమస్య కాదని, ప్రతి నెలా ఇదే తంతుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా 15 వరకు స్టైఫండ్ అందజేస్తామని వైద్యశాఖ మంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా చర్యలేవి తీసుకోలేదని స్పష్టం చేశారు. టోకెన్ నెంబర్ తీసుకుని సెక్రటేరియట్, డీఎంఈ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని మండిపడ్డారు.

ఏపీలో జీవో 36 ద్వారా రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం స్టైఫండ్ కు నిధులు మంజూరు చేస్తోంది. కానీ, ఇక్కడ ఆ పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలోనే సమ్మె నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ఈ నిరసనల్లో పీజీలు, ఇంటర్న్ షిప్ విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఇక ఉస్మానియాలో పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా యూజీ, పీజీ హాస్టళ్ల సౌకర్యాలను పెంచడం, గవర్నమెంట్ ఆసుపత్రులలో ట్రాన్స్ పోర్ట్ వంటి సౌకర్యాలు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం చొరవ తీసుకొని జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు కోరారు.

Read More
Next Story