తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్
x

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.


తెలంగాణ నూతన సీజేగా జస్టిస్ ఏకే సింగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ.. ఏకే సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యామూర్తులుగా ఇప్టపి వరకు ఆరుగురు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు జస్టిస్ ఏకే సింగ్ ఈ బాధ్యతలను స్వీకరించారు. ఆయన త్రిపుర హైకోర్టు నుంచి బదిలీ అయి తెలంగాణ హైకోర్టు సీజేగా నియామకమయ్యారు. జస్టిస్ ఏకే సింగ్.. 1965 జూలై 7న డాక్టర్‌ రాంగోపాల్‌సింగ్‌, డాక్టర్‌ శ్రద్ధ సింగ్‌ దంపతులకు జన్మించారు. ఆయన తల్లివైపు కుటుంబానికి చెందిన తాత జస్టిస్‌ బీపీ సిన్హా సుప్రీంకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తిగా, మరో తాత జస్టిస్‌ శంభుప్రసాద్‌ సింగ్‌ పట్నా హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్‌, న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందిన ఏకే సింగ్..‌ 1990లో ఉమ్మడి పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1990 నుంచి 2000 వరకు పాట్నా హైకోర్టులో, 2001 నుంచి 2012 వరకు జార్ఖండ్‌ హైకోర్టులో న్యాయవాదిగా పలు కీలక కేసులు వాదించారు. 2012లో జార్ఖండ్‌ హైకోర్టు అదనపు న్యాయయమూర్తిగా, 2014లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2022లో జార్ఖండ్‌ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టి్‌స్‌గా సేవలు అందించారు. 2023లో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీపై వచ్చారు.

Read More
Next Story