
Justice PC Ghosh | పీసీ ఘోష్ రిపోర్టుపై బీఆర్ఎస్ ప్లాన్ ఇదేనా ?
రిపోర్టులోని అంశాలను కోర్టులో సవాలు చేయాలని బీఆర్ఎస్(BRS) ప్లాన్ చేస్తోందా ?
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) రిపోర్టులోని అంశాలను కోర్టులో సవాలు చేయాలని బీఆర్ఎస్(BRS) ప్లాన్ చేస్తోందా ? మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ గుంటకండ్ల ఏమన్నారు ? ఏమన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై(Kaleswaram Project) ఎలాంటి విచారణలను అయినా ఎదుర్కోవటానికి కేసీఆర్, హరీష్ రావు సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. ఎంత విచారించినా కేసీఆర్(KCR) కడిగిన ముత్యంలాగ ఆరోపణల నుండి బయటపడతారని మాజీమంత్రి చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎలాంటి విచారణను అయినా ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నారని అనటంలో అర్ధమేమిటి ?
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణాల్లో భారీగా జరిగిన అవినీతి, అవకతవకలకు కేసీఆర్, హరీష్, మాజీమంత్రి ఈటల రాజేందరే కారణమని జస్టిస్ ఘోష్ తన రిపోర్టులో చెప్పారని ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. రెండురోజులుగా ఇవే అంశాలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కారణాలు తెలీటంలేదుకాని జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు 48 గంటలపాటు అసలు నోరేవిప్పలేదు. ఇపుడు జగదీష్ మీడియాతో మాట్లాడుతు కేసీఆర్, హరీష్ ఎలాంటి విచారణను అయినా ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నారని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఘోష్ రిపోర్టుపై చర్చించేందుకు ఎనుముల రేవంత్ రెడ్డి క్యాబినెట్ 4వ తేదీన ప్రత్యేకంగా సమావేశం అవబోతోంది.
క్యాబినెట్ సమావేశంలో రిపోర్టుపై చర్చించిన తర్వాత బాధ్యుతలపై చర్యలకు ఎలాగ ముందుకువెళ్ళాలనే విషయం నిర్ణయమవుతుంది. రిపోర్టు మీద అధ్యయనంచేసి యాక్షన్ తీసుకునేందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను నియమిస్తుందా ? లేకపోత రిపోర్టు ఆధారంగా యాక్షన్ తీసుకోమని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని ఆదేశిస్తుందా ? అదీకాకపోతే ఇప్పటికే ప్రాజెక్టుల్లో జరిగిన అవిసీతిపై విచారణచేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంటునే బాధ్యులపై యాక్షన్ తీసుకోమని క్యాబినెట్ ఆదేశిస్తుందా అన్నది తెలీదు. బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించగానే వెంటనే న్యాయస్ధానాన్ని ఆశ్రయించే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందా ? అనే అనుమానాలు జగదీష్ మాటలతో పెరిగిపోతోంది.
జస్టిస్ ఘోష్ రిపోర్టు ఆధారంగా తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకునేందుకు లేదని కేసీఆర్, హరీష్ కోర్టులో కేసులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి, అవకతవకలు జరింగిదన్న అర్ధమవుతోంది. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయి కాబట్టే మేడిగడ్డ బ్యారేజిలోని మూడు పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన కారణంగా డ్యాం ప్లాట్ ఫారమ్ పగుళ్ళిచ్చేసింది. దీనివల్ల బ్యారేజీ నీటినిల్వకు పనికిరాకుండాపోయిందన్న విషయం ఎవరైనా చెప్పగలుగుతారు. పిల్లర్లు కుంగిపోయి చీలిపోవటం, డ్యాం ప్లాట్ ఫారమ్ లో చీలకలు అందరి కళ్ళకు స్పష్టంగా కనబడుతోంది. నాసిరకంగా నిర్మించారు కాబట్టే, నిర్మాణాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదన్న విషయం చెప్పటానికి నిపుణులు అవసరమే లేదు. ఎందుకంటే పైన అంశాలన్నీ మామూలు జనాల కళ్ళకు స్పష్టంగా కనబడుతున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ నీటినిల్వకు పనికిరాదంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచేందుకు లేదు. ఒకవేళ నీటిని నిల్వ ఉంచితే ఆఒత్తిడికి ప్రాజెక్టు కుప్పకూలిపోవటం ఖాయం. అందుకనే రేవంత్, మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరమని ఎద్దేవాచేస్తున్నది. అలాగే సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల నుండి నీళ్ళు లీకవుతున్నాయి. వీటికి అమర్చిన గేట్లు కూడా సరిగాలేవు. కాబట్టి ఈ ప్రాజెక్టుల్లో కూడా నీటిని నిల్వ ఉంచేందుకు లేదు. ఈ విషయాలన్నింటిపైనా జస్టిస్ ఘోష్ 119 మందిని విచారణ జరిపారు. ఘోష్ విచారణకు హాజరైన వారిలో ఇంజనీరింగ్ ఉన్నతాదికారులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, రిటైరైన ఉన్నతాధికారులతో పాటు ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ నిపుణులు కూడా ఉన్నారు. అందరితో మాట్లాడిన తర్వాతే ఘోష్ రిపోర్టు తయారుచేసి ప్రభుత్వానికి అందించారు.
జస్టిస్ ఘోష్ తన రిపోర్టులో కేసీఆర్, హరీష్, ఈటల వాదనలు కూడా పొందుపరిచారు. అన్నీ అంశాలను పరిశీలించిన తర్వాతే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అవకతవకల్లో కేసీఆర్, హరీష్, ఈటల పాత్రే కీలకమని నిర్ధారించినట్లు సమాచారం. రిపోర్టు ఆధారంగా రేవంత్ ప్రభుత్వం తమపై కేసులు నమోదుచేసి యాక్షన్ కు దిగుతుందుని కేసీఆర్, హరీష్ ఊహించలేని అమాయకులు కారు. అందుకనే క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో చూసిన తర్వాత వెంటనే కోర్టును అప్రోచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నట్లు అనుమానంగా ఉంది. కేసీఆర్, హరీష్ కేసు దాఖలుచేస్తే కోర్టు వెంటనే స్పందిచవచ్చు లేదా సమయం తీసుకోవచ్చు. వెంటనే స్పందిస్తే ఓ,కే అలాకాదని సమయం తీసుకుంటే కేసుతేలేందుకు కోర్టులో ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు.