
కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పొడిగింపు, ఎందుకు?
ప్రాజక్టుతో సంబంధం ఉన్న రాజకీయనాయకులైన కెసిఆర్, హరీష్ రావు, ఈటెల వంటి రాజకీయనాయకులను విచారణకు పిలుస్తారా
అన్నీ ప్రశ్నార్థకాల మధ్య కాళేశ్వరం ప్రాజక్టు (Kaleswaram Project) నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద విచారణ జరిపేందుకు నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Pinaki Chandra Ghose) జ్యుడిషియల్ కమిషన్ గడువును తెలంగాణ ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది.
ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తుంది. అయితే, జులై 31 వరకు పొడిగిస్తూ సోమవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్లో కమిషన్ తదుపరి విచారణ జరిపి విచారణను పూర్తి చేసి జులై 31 నాటికి రిపోర్టును సమర్పించేందుకు వీలుగా ఈ పొడిగింపు అని ఉత్తర్వుల్లో కార్యదర్శి పేర్కొన్నారు.
మాజీ మంత్రులను ఎందుకు విచారించలేదు?
నిజానికి నెలాఖరు లోపు ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేస్తుందని అంతా భావించారు. ఇప్పటి వరకు ప్రాజక్టుతో సంబంధం ఉన్న అధికారులను, ఇంజనీర్లను కమిషన్ విచారించింది. వారిచ్చిన సమాచారం మేరకు నివేదిక తుది మెరుగులు దిద్దుతున్నది. ఇలాంటపుడు ఉన్నట్లుండి ప్రభుత్వం కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించడం, మళ్లీ విచారణ అంటూ ఉత్త ర్వుల్లో పేర్కొనడం విశేషం.కమిషన్ గడువును ఇలా పొడిగించడం ఇదే ఏడోసారి.
కమిషన్ మళ్లీ సిట్టింగ్స్ నిర్వహిస్తుందని ప్రభుత్వం చెప్పడంఈ సారి ఎవరిని విచారణకు పిలుస్తారు అనేది ప్రశ్న.
వాన్ పిక్ కేసులో జైలుకు వెళ్లిన నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ
అయితే, గత కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, మాజీ నీటిపారుదల మంత్రి టి హరీష్ రావు, మాజీ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ లను కమిషన్ విచారించకపోవడం మీద రాష్ట్రం లో పెద్ద చర్చ నడుస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజక్టు డిజైన్ తయారు చేసిందే తానే కెసిఆర్ ఎపుడూ చెప్పుకొస్తూ వచ్చారు. ఆయన కనుసన్నల్లోనే ప్రాజక్టు నిర్మాణం జరిగిందని, తమకు ఏమీ సంబంధం లేదని విచారణలో పలువురు అధికారులు చెప్పారు. ఈ ప్రాజక్టును మొత్తం హరీష్ రావు దగ్గిర ఉండి నిర్మించారు. ఇక డబ్బులకు సంబంధించిన శాఖ ఆర్థిక శాఖ. ఈ ముగ్గురు ప్రాజక్టు దగ్గిరనిలబడి హెల్మెట్లు పెట్టుకుని పనిచేయకపోయినా, ప్రాజక్టుకు ప్రాణం పోసింది వీరే. ఇలాంటి వ్యక్తులను కమిషన్ ముందుకు పిలవకపోవడం పట్ల రాష్ట్రంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఓబులాపురం మైనింగ్ కేసులో నాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ విచారించింది
ఎందుకంటే, ఎవైనా అవకతవకలు జరిగినపుడు సంబంధిత శాఖల మంత్రులను విచారణకు పిలవడం జరిగింది.ఓబులాపురం మైనింగ్ కేసులో మైనింగ్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని విచారించారు. వాన్ పిక్ పెట్టుబడులకేసులో అప్పటి మంత్రి మోపి దేవీ వెంకటరమణ అరెస్టయ్యారు, జైలుకు కూడా వెళ్లాడు.
ఇలాంటపుడు కుంగిపోయిన ప్రాజక్టునిర్మాణంలో కీలక పాత్రవహించిన నాటి మంత్రులను ఇంకా విచారణకు పిలవకపోవడం ఏమిటనే ప్రశ్న రాష్ట్రంలో బాగా చర్చనీయాంశమయింది. జస్టిష్ ఘోస్ విచారణ కంటి తుడుపు మాత్రమేఅనే నిట్టూర్పలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ గడువును పొడిగించింది.
కమిషన్ ఎపుడొచ్చింది...
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మే డిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయిం ది. బరాజ్ లోని ఏడో బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ ఏ), ఇటు విజిలె న్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాయి. న్యాయపరంగా విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ను నియమించారు.
2024 జూన్ 30లోపు విచారణ పూర్తి చేయాలి. అప్పటికి ఇంకా ఎంక్వైరీ కూడా మొదలుకాలేదు. ప్రాథమిక దశలోనే ఉండడంతో గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ జూన్ 29న తొలిసారి గడువును పొడి గించింది. మళ్లీ విచారణ నత్తనడకే సాగింది. దీంతో రెండోసారి అక్టోబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ప్రభు త్వం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు విచారణకు ఓపెన్ కోర్టులు నిర్వహించాల్సి ఉండడంతో డిసెంబర్ 31 వరకు గడువును మూడోసారి పొడిగిస్తూ నవంబర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగోసారి 2025 ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగిస్తూ 2024 డిసెంబర్ 21న, ఐదోసారి 2025 ఏప్రిల్ 30 వరకు పొడిగి స్తూ 2025 ఫిబ్రవరి 20న, ఆరోసారి గడువును 2025 మే 31 వరకు పొడిగిస్తూ 2025 ఏప్రిల్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏడోసారి గడువును పొడిగిస్తూ జులై 31 వరకు కమిషన్ రిపోర్టుకు గడువు ఇచ్చింది.