కేసీఆర్.. గురివిందలా మాట్లాడుతున్నారు: కడియం
x

కేసీఆర్.. గురివిందలా మాట్లాడుతున్నారు: కడియం

కేసీఆర్ హాయంలో ఎన్కౌంటర్ లు కూడా జరిగాయి. రాజకీయ పబ్బం కోసం మావోయిస్టుల అంశం ఎత్తుకున్నారు అని కడియం.. విమర్శించారు.


తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వరంగల్‌ బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. అందులో కేసీఆర్ ప్రసంగంపై కడియం స్పందించారు. కేసీఆర్ మాటలు అచ్చం గురివింద గింజలా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. గురివింద గింజ తన నలుపును తాను చూసుకోదని, అంతే కేసీఆర్ కూడా వాళ్ల వైఫల్యాలు, తప్పులను వాళ్లు చూసుకోరంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు. ఇప్పుడు మావోయిస్టులు శాంతి చర్చలకు రెడీ అంటున్నా కేంద్రం వినిపించుకోకుండా ఊచకోత కోస్తోందని, అందుకు అలనాడు కేసీఆర్ చేసిన భ్రష్టు పాలనేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గురివింద తన నలుపును చూసుకోదు. కేసీఆర్ తీరు కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ పై విషం చిమ్మడం, అసత్య ఆరోపణలు మానుకో కేసీఆర్’’ అని సూచించారు.

‘‘కేసీఆర్ ఇప్పుడు కగార్ గురించి నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు. ధర్నా చౌక్ ఎత్తేసి, ఎంతో మందిపై కేసులు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ హాయంలో ఎన్కౌంటర్ లు కూడా జరిగాయి. రాజకీయ పబ్బం కోసం మావోయిస్టుల అంశం ఎత్తుకున్నాడు. అవినీతి అక్రమాలతో పదేళ్లు పాలన చేశాడు. నీ అవినీతికి వంతపాడిన ఐఏఎస్, ఐపీఎస్ లు దేశాన్ని విడిచి పారిపోయారు. కొందరు జైళ్ళకి వెళ్లారు. అధికారులను అడ్డం పెట్టుకొని వేల కోట్లు మీ కుటుంబం సంపాదించి సివిల్ సర్వీస్ అధికారులు కేసులపాలయ్యారు’’ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ విఫలమైంది అక్కడే

‘‘కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని పాఠం చదివాడు కేసీఆర్. మేం చేసిన అద్భుతమైన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. కాంగ్రెస్ చేసిన 2లక్షల రుణమాఫీ, కులగణన, షెడ్యూల్ కులాల వర్గీకరణ దేశంలో ఎక్కడా జరగలేదు. మీరు పదేళ్లలో ఆకర్శించలేని పెట్టుబడులు 16నెలల్లో కాంగ్రెస్ సాధించింది. ఇవన్నీ మీ కళ్లకు కనపడట్లేదా. అప్పులు ఏ రకంగా చేసి, రాష్ట్రాన్ని దివాలా తీసారో అసెంబ్లీలోనే బయటపెట్టాం. బొనస్ అంటే బోగస్ అని చెప్పిన కేసీఆర్, సన్న వడ్లకి మేము ఇచ్చే బోనస్ కనిపించట్లేదా. పేదల కడుపు నింపే సన్నబియ్యం పంపిణీ ఘనత మా ప్రభుత్వానిది’’ అని అన్నారు. ‘కేసీఆర్ ఎన్ని చెప్పినా పాత రోత, ఓటమిని జీర్ణించుకోలేని భాద తప్ప ఏమి లేదు. గురివింద తన నలుపును చూసుకోదు. కేసీఆర్ తీరు కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ పై విషం చిమ్మడం, అసత్య ఆరోపణలు మానుకో కేసీఆర్’’ అని హితవు పలికారు.

Read More
Next Story