బీఆర్ఎస్ నేతలకు కడియం కౌంటర్
x
Source: Twitter

బీఆర్ఎస్ నేతలకు కడియం కౌంటర్

తనను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలకు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజల సమస్యలు తీర్చడానికే పార్టీ మారానన్నారు. ప్రతిపక్షంలో ఉంటే అది సాధ్యపడదన్నారు.


బీఆర్‌ఎస్‌కు టాటా చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమర్తె కడియం కావ్యపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కడియం శ్రీహరి ఓ పెద్ద అవకాశవాది అని, ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన బీఆర్‌ఎస్‌కు కష్టకాలంలో వెన్నుపోటు పొడిశారంటూ తీవ్రాతి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా వీటిపైన స్పందించిన కడియం శ్రీహరి తాను ఎన్నడూ అవకాశ వాదిని కానని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నేతలకు ఆ హక్కు లేదు
కాంగ్రెస్‌లో చేరతానని తాను చర్చలకు వెళ్లలేదని, తనన పార్టీలోకి కాంగ్రస్ నేతలే ఆహ్వానించారని, అందుకే పార్టీ మారానని తేల్చి చెప్పారు. ‘‘పార్టీ మారడం కోసం నేనెవరి కాళ్లూ గడ్డాలు పట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానంతోనే కండువా మార్చుకున్నా. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చా. రాజకీయంగా కేసీఆర్.. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అందుకు నేను ఎన్నటికీ కృతజ్ఞుడను. అయితే ఇటీవల కాలంలో అనేక మంది నేతలు బైఆర్‌ఎస్ పార్టీ నుంచి జంప్ అయ్యారు. కానీ నన్నే ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి.. బీఆర్ఎస్‌కు పట్టిన ఓ చీడపరుగు. అలాంటి వాళ్ల వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఓడింది. ఇప్పుడు నేతలు క్యూలు కట్టి బయటకు వెళ్తుంది కూడా. ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు’’అని ఆయన ధ్వజమెత్తారు.
బీజేపీపై కడియం గుస్సా
బీఆర్‌ఎస్‌పై మండిపడిన కడియం శ్రీహరి.. బీజేపీనీ వదిలి పెట్టలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన స్వలాభాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని విమర్శించారు. ‘‘ప్రతిపక్ష నేతలను కేసుల్లో ఇరికించి.. ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తోంది. కానీ ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న నేత అయినా కాషాయ కండువా కప్పుకుంటే పునీతులవుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం నేను ఎక్కడా చూడలా. ఇలాంటి బీజేపీ అరాచకాలను అడ్డుకోవడానికే కాంగ్రెస్‌లో చేరాను. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించలేం. అందుకే బీఆర్ఎస్ నుంచి తప్పుకున్నా’’అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

కడియం కావ్యకే వరంగల్ టికెట్
వరంగల్ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం కడియం కావ్యకు ఖరారు చేసింది. ఇప్పటి వరకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించలేదు. తాజాగా వరంగల్ సీటుపై క్లారిటీ రాగా మిగిలిన మూడు స్థానాల అభ్యర్థుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వీటిలో హైదరాబాద్ ఎంపీ స్థానంలో బలమైన ముస్లిం నేతను నిలబెట్టాలని కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ అభ్యర్థిగా మస్కత్ అలీ పేరు జోరుగా వినిపిస్తోంది. అదే విధంగా ఖమ్మం ఎంపీ స్థానం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ పోటీ పడుతున్నారు. దీంతో పాటు కరీంనగర్ స్థానం కోసం తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. దీంతో ఈ మూడు సీట్ల అభ్యర్థుల విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు. మరి త్వరలో ఈ స్థానాలపై కాంగ్రెస్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.


Read More
Next Story