కారుకు మరో భారీ కుదుపు.. కడియం శ్రీహరి, కావ్య జంప్
బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి తప్పుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరడానికే కూతురు కావ్యతో కలిసి ఢిల్లీకి పయనమయ్యారా..
అసెంబ్లీ ఎన్నికల ముందు కారులో భారీ కుదుపులు వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తప్పడం లేదు. పార్టీ వీడుతున్నట్లు కే కేశవరావు ప్రకటించారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో కీలక నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కారు దిగడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన కుమార్తె కడియం కావ్య.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. అయితే తండ్రీకూతురు కలిసి ఒకేసారి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై చర్చలు చేయడానికి వీరిద్దరూ హస్తినకు పయనమయ్యారని తెలుస్తోంది. ఎంపీ టికెట్‌పై కాంగ్రెస్ నేతలతో చర్చలు చేసి ఈరోజే బీఆర్ఎస్‌ను రాజీనామా చేసి హస్తం గూటికి చేరతారని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.
మారనున్న రాజకీయ సమీకరణాలు
తెలంగాణ రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. బీఆర్ఎస్‌లోని నేతలు వరుసగా వలసలు వెళ్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ చాణక్యుడు అని పేరున్న కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య.. కాంగ్రెస్‌లో చేరితే తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు వస్తాయి. గెలుపు అంచనాలు తారుమారు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీహరి రాజీనామా వరంగల్ బీఆర్ఎస్‌కు తేరుకోలేని దెబ్బగా మారొచ్చని, ఒకవేళ కడియం శ్రీహరి, కావ్య వీరిలో ఎవరైనా వరంగల్‌లో బీఆర్ఎస్ ప్రత్యర్థిగా నిలబడితే కారుకు గెలిచే అవకాశాలు భారీగా సన్నగిల్లుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
పరిణామాలే కారణం!
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా రెపరెపలాడింది. అక్కడ గెలిచి పార్టీని వరంగల్‌లో కొనఊపిరితో ఉంచడంలో కడియం శ్రీహరి కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో వస్తున్న పరిణామాల దృష్ట్యా పార్టీ మారాలని ఆయన కూడా నిశ్చయించుకున్నారని సమాచారం. అందుకనే కాంగ్రెస్‌లో చేరాలని యోచిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ పెద్దలతో చర్చలు చేయడానికి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని తెలుస్తోంది. తనతో పాటు తన కూతురు కావ్యను కూడా కాంగ్రెస్ గూటికి చేర్చాలని నిర్ణయించుకునే ఎంపీ పోటీ నుంచి కూతురును ముందుగా తప్పించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన భవిష్యత్ కార్యాచరణపై ఈరోజు సాయంత్రానికి క్లారిటీ రావొచ్చని విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి.