
మేడిగడ్డ ప్రాజెక్టుకు పగుళ్లు
Kaleshwaram Project| ఇంజనీర్లు, ఐఎఎస్ అధికారులు ఏమి చేశారంటే...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై అధికారుల పాత్రను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎత్తి చూపించింది.
1.ఐఎఎస్ అధికారి ఎస్ కె జోషి : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తెలంగాణ అప్పటి నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ కె జోషి పలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను టర్న్ కీ పద్ధతిలో చేపట్టడంలో జోషి విఫలమయ్యారని పేర్కొంది. ప్రాజెక్టు ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించి ఆర్థిక సాంకేతిక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు జోషి కూడా బాధ్యత వహించాలని పేర్కొంది.
2.ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ : అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందడంలో విఫలమయ్యారని కమిషన్ ఎత్తి చూపింది. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం కార్యదర్శి నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరించారని, ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు ఆమె బాధ్యత వహించాలని కమిషన్ నిర్ధారించింది.
అక్రమాల్లో అధికారుల పాత్ర
3.ప్రభుత్వ కార్యదర్శులు : అప్పట్లో తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శులు 2016వ సంవత్సరం మార్చి 1వతేదీన జీఓఆర్టీ నంబరు 231, 232,233 పేరిట జీఓలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేకుండా, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ జారీ చేశారని కమిషన్ తేల్చి చెప్పింది. దీనికి ఆయా కార్యదర్శులు బాధ్యత వహించాలని కోరింది.
4.సీనియర్ ఇరిగేషన్ అధికారులు : తెలంగాణ నీటిపారుదల శాఖ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీతోపాటు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సభ్యులు ప్రాజెక్టు పనుల మంజూరు యాంత్రికంగా చేశారని, నిర్లక్ష్యం గా వ్యవహరించారని, నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు జారీ చేశారని కమిషన్ పేర్కొంది. తప్పుడు నిర్ణయాలకు అధికారులు బాధ్యత వహించాలని కమిషన్ స్పష్టం చేసింది.
5.కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ సి మురళీధర్ : నిజాయితీగా వ్యవహరించాల్సిన ఇంజినీర్ ఇన్ చీఫ్ సి మురళీధర్ సవరించిన అంచనాలను అమలుకు ఒత్తిడి చేయడంలో దురుద్ధేశం వెలుగుచూసిందని కమిషన్ తెలిపింది. టర్న్ కీ పద్ధతిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలను ఈఎన్ సీ తొక్కి పట్టారు. కాళేశ్వరం సీనియర్ ఇంజినీర్లు సాంకేతిక ఆదేశాలు లేకుండా బ్యారేజీ నిర్మాణ స్థలాలను మార్చారు. రివైజుడ్ అంచనాలను నిర్లక్ష్యంగా ఆమోదించారు. చట్టవిరుద్ధ అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. మురళీధర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
6.ఇంజినీర్ ఇన్ చీఫ్ జి అనిల్ కుమార్ : కాళేశ్వరం ప్రాజెక్టు గ్రౌటింగ్ ను తప్పుదారి పట్టించేలా తప్పుడు సాంకేతిక సమర్ధన సమర్పించారు. నిర్మాణ నాణ్యత లోపాలకు ఈయన బాధ్యత వహిస్తారు.
7.ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్ రావు : కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరుగా 2021 జనవరి 1వతేదీ నుంచి ఆపరేషన్ అండ్ మెయిన్ టెనెన్స్ విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యారని కమిషన్ తప్పుపట్టింది. తన బాధ్యత నుంచి విముక్తి పొందేందుకు నిందను ఇతరులపైకి నెట్టేందుకు యత్నించారు. మూడు బ్యారేజీలకు నష్టం కలిగించిన చర్యకు బాధ్యత వహించాల్సి ఉంది.
8.చీఫ్ ఇంజినీర్ టి ప్రమీల : కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు టి ప్రమీల ఆనకట్టల భద్రతా చట్టం ప్రకారం పనిచేయలేదని దర్యాప్తులో తేలింది.
9.చీఫ్ ఇంజినీర్ శంకర్ నాయక్ : కాళేశ్వరం ప్రాజెక్టు హైడ్రాలజీ చీఫ్ ఇంజినీర్ శంకర్ నాయక్ బాధ్యతా రహితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి నందుకు అతన్ని అరెస్టు చేయాలని కమిషన్ సూచించింది.
10. చీఫ్ ఇంజినీర్ టి శ్రీనివాస్ : కాళేశ్వరం ప్రాజెక్టు రివైజుడ్ ఎస్టిమేట్స్, ప్రణాళికపై కమిషన్ కు తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు అతనిపై చర్య తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది.
11.రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సర్దార్ ఓంకార్ సింగ్ : న్యాయవిచారణ కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య సాక్ష్యం చెప్పినందుకు చర్యకు కమిషన్ సిఫార్సు చేసింది.
12. చీఫ్ ఇంజినీర్ బి హరిరామ్ : కాళేశ్వరం కమిషన్ మందు ప్రాజెక్టు గురించి అసత్య సాక్ష్యం చెప్పినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ తర్వాత సంపాదనకు మించిన ఆస్తుల కేసులో హరిరామ్ అరెస్టు అయ్యారు.
13.చీఫ్ ఇంజినీర్ ఎ నరేందర్ రెడ్డి : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ ముందు అసత్య సాక్ష్యం చెప్పినందుకు నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది.
Next Story