బీసీ ఉద్యమాన్ని కల్వకుంట్ల కవిత హైజాక్ చేస్తున్నదా?
x
Kalvakuntla Kavitha

బీసీ ఉద్యమాన్ని కల్వకుంట్ల కవిత హైజాక్ చేస్తున్నదా?

బీసీలలో ఎందుకు అందరినీ ఏకం చేసే నేత తయారవడం లేదు?


తెలంగాణలో బీసీఉద్యమం విచిత్రమైన పోకడలుపోతోంది. మామూలుగా ఎక్కడైనా ఏ సామాజికవర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆ సామాజికవర్గానికి చెందిన నేతలే నాయకత్వం వహిస్తారు. ఒక సామాజికవర్గం సమస్యలపై మరో సామాజికవర్గంనేత నాయకత్వంవహించటం బహుశా తెలంగాణ(Telangana)లోనే జరుగుతున్నదేమో. ఇపుడు విషయం ఏమిటంటే బీసీ సమస్యల పరిష్కారానికి కల్వకుంట్ల కవిత నాయకత్వం వహిస్తున్నారు. నాయకత్వం వహిస్తున్నారు అనటంకన్నా బీసీ ఉద్యమాన్ని కవిత హైజాక్ చేశారని అంటే బాగుంటుందేమో. విచిత్రం ఏమిటంటే బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ర్యాగ కృష్ణయ్య కూడా కవిత నాయకత్వానికి జిందాబాద్ కొట్టడమే.

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో ఇరుక్కున్న కవిత తీహార్ జైలులో ఆరుమాసాలు గడిపి బెయిల్ పైన బయటకు వచ్చారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత కొంతకాలం కవిత(Kavitha) ఎవరితోను కలవలేదు. ఆ తర్వాత జనాల్లోకి రావాలన్నా ఆమెకు ఏ ఇష్యూ కనబడలేదు. అయితే అప్పటికే స్ధానికసంస్ధల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం పార్టీలు, జనాల మధ్య నలుగుతోంది. ఇంకేముంది వెంటనే బీసీ ఇష్యూని పట్టుకుని కవిత రంగంలోకి దూకేశారు. ‘భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కాని సామాజిక తెలంగాణ ఇంకా రాలేద’నే నినాదం ఇచ్చి కవిత హడావుడి మొదలుపెట్టేశారు. కొన్ని బీసీ సంఘాల నేతలను వెంటేసుకుని తిరగటంతో పాటు సమావేశాలు కూడా పెడుతున్నారు. కవిత హడావుడి చూసిన కొందరు బీసీ నేతలు ఆశ్చర్యపోయారు. బీసీల సమస్యల పరిష్కారానికి కవిత నాయకత్వం అవసరంలేదని తామే చూసుకుంటామని కాంగ్రెస్ పార్టీ వేములవాడ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ లాంటివాళ్ళు గట్టిగానే చెప్పారు.

తెలంగాణలో బీసీ సంఘాలు చాలానే ఉన్నాయి. అన్నీ ఒక వేదికమీదకు వచ్చి సమస్యల పరిష్కారానికి సంఘాలు అన్నీ కలిపి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వంలోనే తమ సమస్యల పరిష్కారానికి బీసీలే ఆందోళనలు చేయచ్చు. ఈ విషయాన్ని వదిలేసి కొన్ని సంఘాల నేతలు కవిత నాయకత్వంలో పనిచేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

అయినా కవిత పట్టించుకోకుండా పదేపదే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మాట్లాడుతు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునే ఉన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయల్సిందే అని, రిజర్వేషన్ అమలుచేయకపోతే స్ధానికసంస్ధల ఎన్నికలు జరగనిచ్చేదిలేదని, జ్యోతిరావుపూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుచేయాలని రకరకాల డిమాండ్లతో కవిత హడావుడి పెరిగిపోతోంది. కవిత డిమాండ్లను రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఈ విషయం కవితకు తెలిసినా తనుమాత్రం పదేపదే డిమాండ్లతో వార్తల్లో నిలుస్తున్నారు. దీనికితోడు ఈమధ్యనే తండ్రికి లేఖ రాసి అన్న కేటీఆర్ పైన తిరుగుబాటు లేవదీసిన తర్వాత పార్టీకి దూరమయ్యారు. దాంతో ఆమె పూర్తిగా బీసీల సమస్యల పరిష్కారం అనే పాయింట్ మీదే పెట్టి మరింత జోరుపెంచారు.

కృష్ణయ్యతో భేటీ


సరిగ్గా ఈ నేపధ్యంలోనే రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య(MP R. Krishnaiah) ఆఫీసుకు వెళ్ళి కవిత భేటీ అవటమే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. బీసీల సమస్యల పరిష్కారానికి కవిత ఆందోళనలకు ఎంపీ మద్దతు ప్రకటించటం ఇంకా ఆశ్చర్యం. బీసీల సమస్యల పరిష్కారానికి కవిత ఉద్యమంపేరుతో చేస్తున్న ప్రకటనల్లో కృష్ణయ్య ఎంతచిత్తశుద్ది కనబడిందో ఎవరికీ అర్ధంకావటంలేదు. దాదాపు 30 ఏళ్ళుగా బీసీల సమస్యలపై పోరాటాలు చేస్తున్న కృష్ణయ్య తాజాగా కవిత ఆందోళనలకు మద్దతు పలకటమే విచిత్రంగా అనిపిస్తోంది. జూలై 17వ తేదీన జాగృతి ఆధ్వర్యంలో జరగబోయే రైల్ రోకోలకు కృష్ణయ్య మద్దతు పలికారు. అధికారంలో ఉన్నంతకాలం కవిత బీసీల సమస్యలగురించి ఏరోజూ మాట్లాడింది లేదు. ఈ విషయం ఎంపీకి బాగా తెలుసు. రాజ్యాంగపరంగా బీసీలకు స్ధానికసంస్ధల్లో ఇప్పటికిప్పుడు 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యంకాదని కవిత, కృష్ణయ్యకు కూడా బాగా తెలుసు. మరి ఆరిజర్వేషన్లు ఏవో పార్టీపరంగా కల్పించాలని కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అధికారంలో ఉన్నపుడు ఎందుకు అడగలేదు ?

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు అసెంబ్లీలో జ్యోతిరావుపూలే విగ్రహం పెట్టించాలన్న ఆలోచన కవితకు ఎందుకు రాలేదు ? ప్రతిపక్షంలోకి రాగానే, జైలు నుండి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చిన తర్వాతే కవితకు బీసీల సమస్యలు గుర్తుకురావటం విడ్డూరమే. మరి ఈ విషయాలన్నీ ఎంపీకి తెలీకుండానే ఉంటాయా ? అయినా కవితకు మద్దతు ఇచ్చారంటే తెరవెనుక ఏదో జరుగుతోందనే అనుమనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కృష్ణయ్య ఉత్త కృష్ణయ్య కాదు బీజేపీ ఎంపీ అన్న విషయం మరచిపోకూడదు. కవిత-కృష్ణయ్య భేటీని బీసీల సమస్యల ఆందోళనలకు మద్దతు పలకటాన్ని బీజేపీ(Telangana BJP) నాయకత్వం ఎలాగ చూస్తోందో అర్ధంకావటంలేదు. బీసీల సమస్యలపైన చేసే ఉద్యమాలేవో ఎంపీ బీజేపీ తరపునే చేయచ్చుకదా ? బీజేపీ నేతలు నూరుశాతం కవితను వ్యతిరేకిస్తుంటే కృష్ణయ్య మాత్రం మద్దతు పలికటం గమనార్హం.

సీపీఎందీ అదే దారా ?

కృష్ణయ్య వ్యవహరం ఇలాగుంటే సీపీఎం వ్యవహారం మరోలాగుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం వామపక్షాలను అంటే సీపీఐ, సీపీఎంను కేసీఆర్ అవసరానికి వాడుకుని తర్వాత కరివేపాకులాగ తీసి పారేసిన విషయం అందరికీ తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలవాలంటే వామపక్షాల సహకారం లేకపోతే సాధ్యంకాదని కేసీఆర్ కు అర్ధమైంది. అందుకని రెండుపార్టీల కార్యదర్శులతో పాటు కీలకమైన నేతలతో రెగ్యులర్ గా భేటీ అయ్యేవారు. ఈ రెండుపార్టీలతో 2023 ఎన్నికలకు సంబందించి సీట్ల సర్దుబాట్లపై కేసీఆర్ హామీలు కూడా ఇచ్చారు. కేసీఆర్ హామీలను నమ్మి బీఆర్ఎస్ నేతలకన్నా వామపక్షాల నేతలు చెమటోడ్చి పనిచేశారు. ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత వామపక్షాల నేతలను కేసీఆర్ ప్రగతిభవన్ గేటు కూడా ముట్టుకోనియ్యలేదు. అపాయిట్మెంట్ కోసం ఎన్నిసార్లు వామపక్షాల నేతలు ప్రయత్నించినా కనీసం మొహంకూడా చూడలేదు. ఆ కోపంతోనే 2023 ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్ తో పొత్తుకు ప్రయత్నించింది.

సీట్ల సర్దుబాటులో ఒప్పందం కుదరటంతో సీపీఐ-కాంగ్రెస్(Telangana Congress) తో కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి. సర్దుబాటు కుదరకపోవటంతో సీపీఎం ఒంటరిగా పోటీచేసింది. అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటంతో కేసీఆర్ కు వామపక్షాల అవసరం ఇప్పటివరకు రాలేదు. ఈ నేపధ్యంలో కేసీఆర్ కూతురు కవితకు సీపీఎం మద్దతు పలకటమే విచిత్రంగా ఉంది. సీపీఎం కార్యాలయంకు వచ్చిన కవితతో పార్టీ కార్యదర్శి జాన వెస్లీ సమావేశమయ్యారు. జూలై 17వ తేదీన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చేయబోతున్న రైలురోకోకు మద్దతు పలికారు వెస్లీ. కవిత నాయకత్వంలో జరుగుతున్న ఆందోళనలకు వెస్లీ మద్దతు పలకటం అంటే ఆమె నాయకత్వాన్ని అంగీకరించటమే కదా. ఇదే పద్దతిలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమక్రసి ఆఫీసుకు వెళ్ళిన కవిత కేంద్రకమిటి సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు, జేవీ చలపతిరావు తదితరులతో భేటీ అయ్యారు. వాళ్ళు కూడా కవిత ఆందోళనలకు మద్దతు పలికారు. న్యూడెమక్రసీ అంటే చాలామందికి తెలియని పార్టీ కాబట్టి సరిపెట్టుకున్నా మరి బీఆర్ఎస్ అధినేతతో ఉన్న విభేదాలను పక్కనపెట్టి కూతురు కవితకు సీపీఎం ఎలాగ మద్దతు పలికిందో అర్ధంకావటంలేదు. మొత్తానికి బీసీ ఉద్యమాన్ని కవిత సక్సెస్ ఫుల్ గా హైజాక్ చేసిందన్న విషయం అర్ధమవుతోంది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.

Read More
Next Story