
ఎంఎల్సీ పదవికి కవిత రాజీనామా
ఎంఎల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాధమిక సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు.
ఎంఎల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాధమిక సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. మంగళవారం తనను పార్టీనుండి సస్పెండ్ చేసిన తర్వాత కవిత బుధవారం జాగృతి(Telangana Jagruthi) కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత(Kavitha) తన సస్పెన్షన్ పై మాట్లాడుతు ‘‘నోటీసులో చెప్పినట్లు తాను ఎప్పుడూ బీఆర్ఎస్(BRS) పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేద’’న్నారు. ‘‘తనను అక్రమకేసులో ఇరికించి జైలులో పెట్టిన తర్వాత బెయిల్ పై విడుదలైన దగ్గర నుండి ప్రజాజీవితంలోనే ఉన్న’’ట్లు చెప్పారు. ‘‘బీసీ రిజర్వేషన్లు(BC Reservations), మహిళలకు 2500 రూపాయలు, వృద్ధులకు పెన్షన్లు, తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్పు, బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, భద్రాచలం ముంపు గ్రామాలపై రౌండ్ టేబుల్ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి’’నట్లు గుర్తుచేశారు. ‘‘45 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను బలేపేతం చేసేందుకు పర్యటించటం పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలేనా’’ ? అని నిలదీశారు.
ఇవన్నీ తాను బీఆర్ఎస్ కండువా కప్పుకునే చేసినట్లు తెలిపారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలేనా అని పార్టీ పెద్దలు ఆలోచించాలన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్లపై తాను మాట్లడుతుంటే తనపైన పార్టీలో వ్యతిరేకంగా మాట్లాడించార’’ని మండిపడ్డారు. ‘‘సామాజికతెలంగాణ గురించి తాను మాట్లాడటం తప్పు ఎలాగ అవుతుంద’’ని ప్రశ్నించారు. కేసీఆర్ దగ్గర నుండే సామాజికతెలంగాణ స్పూర్తి పొందినట్లు చెప్పారు. ‘‘సామాజికతెలంగాణ గురించి మాట్లాడంగానే ఇదేపేరుతో కొత్తపార్టీ పెడుతున్నట్లు హరీష్, సంతోష్ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయించార’’ని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ వచ్చినట్లేనా ? సామాజిక తెలంగాణ వచ్చినపుడే కదా బంగారు తెలంగాణ వచ్చినట్లు’’ అని సూటిగా ప్రశ్నించారు.
‘‘పార్టీలో తనమీద కుట్రలు జరగుతున్నట్లు చెబితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత లేదా’’ అని నిలదీశారు. 103 రోజులుగా కేటీఆర్ తనతో ఫోన్లో మాట్లాడలేదన్నారు. ‘‘కేసీఆర్ ఎన్నో పనులతో బిజీగా ఉన్నా కనీసం కేటీఆర్ నుండి సమాధానం రావాలి కదా’’ అని అడిగారు. తనకు నోటీసు ఇవ్వగానే మొదటిసారి పార్టీలోని మహిళా నేతలు ఐదుగురు ప్రెస్ మీట్ పెట్టడం సంతోషం కలిగించిందన్నారు. కేసీఆర్, కేటీఆర్, తానది పదవులకోసం ఉన్న బంధం కాదన్నారు. తమది రక్త సంబంధం అని గుర్తుచేశారు. ‘‘తాము ముగ్గురము కలిసి ఉండకూడదని కొందరు ప్రయత్నించినట్లు’’ ఆరోపించారు. ఇందులో భాగంగానే మొదట తనను పార్టీలో నుండి బయటకు పంపేసినట్లు మండిపడ్డారు. ‘‘పార్టీలో ఏమి జరుగుతోందో కేసీఆర్ గ్రహించాల’’ని హితవు పలికారు. ‘‘తనకు ఈరోజు జరిగిందే రేపు కేటీఆర్, తర్వాత కేసీఆర్ కు కూడా జరిగే అవకాశముంద’’ని ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘ఎనుముల రేవంత్ రెడ్డి, హరీష్ ఒకే విమానంలో ప్రయాణంచేసిన తర్వాత తనపైన కుట్రలు మొదలైనట్లు’’గా కవిత ఆరోపించారు. తానుచెప్పింది అవునా కాదా చెప్పాలని హరీష్, రేవంత్ ను డిమాండ్ చేశారు. ‘‘కేటీఆర్ ను విచారణపేరుతో మూడుసార్లు పిలిపించిన ప్రభుత్వం, హరీష్ అవినీతి మీద ఎందుకు కేసులు పెట్టలేద’’ని ప్రశ్నించారు. పాలవ్యాపారం మీద గతంలో హరీష్ మీద ఆరోపణలు వచ్చిన రెండోరోజే ఆగిపోయిందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలో భూములు కబ్జాచేశారని హరీష్ మీద ఆరోపణలు వచ్చిన మరుసటిరోజే ఆరోపణలు మాయమైపోయిందన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆమలుచేయాల్సింది మంత్రి హరీషే కదా’’ ? అన్నారు. అసెంబ్లీలో రేవంత్ ఆరోపణలన్నీ కేసీఆర్ మీద మాత్రమే జరిగాయని హరీష్ ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.
‘‘హరీష్, సంతోష్ పైకి నటిస్తున్నారు కాని కేసీఆర్, కేటీఆర్ మంచి కోరుకునే వాళ్ళు కాద’’న్నారు. కేసీఆర్ కు సీబీఐ విచారణ, నోటీసులు వచ్చాయంటే కారణం హరీషే అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ మొదటినుండి లేరన్న బాంబుపేల్చారు. పార్టీకి చెడ్డపేరు వచ్చినపుడు హరీష్ వెళ్ళి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దగ్గర కనబడలేదా అని ఎద్దేవా చేశారు. ‘‘హరీష్ ఈజ్ నాటే ట్రబుల్ షూటర్..హీ ఈజ్ ఏ డబుల్ షూటర్’’ అని ఎద్దేవా చేశారు. దాసోజో శ్రవణ్ ఎంఎల్సీ విషయంపైన కూడా హరీష్ బీజేపీతో మాట్లాడుకున్నట్లు చెప్పారు. ‘‘పార్టీలో ట్రబుల్ క్రియేట్ చేసేది హరీషే, దాన్ని పరిష్కరించినట్లు నటించేది హరీషే’’ అని కవిత ఎద్దేవాచేశారు. ‘‘హరీష్ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీతో టచ్ లో ఉన్నార’’ని బాంబుపేల్చారు. ‘‘2018 ఎన్నికల్లో 25 మంది ఎంఎల్ఏలకు హరీష్ డబ్బులు ఇచ్చేంతగా నిధులు ఎక్కడినుండి వచ్చాయి’’ ? కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి డబ్బే అని గట్టిగా చెప్పారు.
‘‘2009లో కేటీఆర్ ను ఓడించేందుకు ఒంటేరు ప్రతాప్ రెడ్డికి హరీష్ రు. 60 లక్షలు పంపార’’ని చెప్పారు. ‘‘ఒకవైపు కేసీఆర్, కేటీఆర్, కవితను ఓడగొట్టే ప్రయత్నం చేస్తూనే మరోవైపు పార్టీ కోసం కష్టపడుతున్నట్లు నటిస్తున్నార’’ని అన్నారు. ‘‘పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ పట్టించుకోవటంలేదన్న బాధతోనే తాను మాట్లాడుతున్న’’ట్లు కవిత చెప్పారు. ‘‘అధికారంలో ఉన్నంతకాలం పార్టీలో తనను ప్రతిపక్ష నేతగానే చూశార’’ని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ బాగుండాలనే కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు సమావేశం నిర్వహించి కేసీఆర్ ను తిడుతుంటే రేవంత్ ను ఎదుర్కంటున్నట్లు హరీష్ యాక్టింగ్ చేశార’’న్నారు. ‘‘హరీష్ వల్లే జగ్గారెడ్డి, ఈటల రాజేందర్, మైనంపల్లి హనుమంతరావు, రఘునందనరావు, విజయశాంతి లాంటి నేతలు పార్టీని వదిలేశార’’ని అన్నారు.
పార్టీలో ఇంతమంది ఓడిపోతే తాను ఒంటరిపోరాటంచేసి గెలిచినట్లు హరీష్ మీడియాలో రాయించుకున్నారు. ‘‘హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల గెలుపులో హరీష్ పాత్రుంద’’న్నారు. ‘‘పార్టీలో నుండి బయటకు పంపేసినందుకు తనకు బాధలేదని, ఉద్యమంలో నుండి వచ్చాను కాబట్టి మళ్ళీ ఉద్యమంలోకే వెళతా’’నని స్పష్టంచేశారు. ఉద్యమాలు చేసి లాఠీదెబ్బలుతిని, జైళ్ళకు వెళ్ళాలనే ఉద్యమంలోకి వచ్చామన్నారు. సంతోషం వంటకాన్ని చెడగొట్టే ఉప్పులాంటి వాడన్నారు. ‘‘సంతోష్ కు ధనదాహం చాలా ఎక్కువ’’న్నారు. ‘‘హరితహారమని కేసీఆర్ ప్రోగ్రామ్ పెడితే వెంటనే సంతోష్ గ్రీన్ ఇండియా అని మరో ప్రోగ్రామ్ పెట్టి ప్రత్యేకంగా జీవో తెప్పించినట్లు’’ మండిపడ్డారు. ‘‘సంతోష్ ముగ్గురు, నలుగురు పోచంపల్లి లాంటి వ్యక్తులను పెట్టుకుని డబ్బులు సంపాదించినట్లు’’ ఆరోపించారు. ‘‘హరీష్, సంతోష్ పైన ఉన్న బీజేపీతో, ఇక్కడున్న రేవంత్ తో మంచి సంబంధాలు పెట్టుకున్న’’ట్లు ఆరోపించారు.
బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో పాటు సొంత కుటుంబసభ్యులను ఉద్దేశించి మాట్లాడుతు ‘‘పార్టీతో తనకు ఏమి సంబంధం అని నోటీసు పంపటం చాలా బాధాకర’’మన్నారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తనకు వ్యతిరేకంగా ఐదుగురు మహిళా నేతలు తనకు వ్యతిరేకంగా మాట్లాడటం విచిత్రంగా ఉంద’’న్నారు. ‘‘తన జీవితంలో బీఆర్ఎస్ కు తప్ప ఇంకో పార్టీకి ఓట్లేయమని అడగలేదు, ఇంకో పార్టీ గెలుపుకు పనిచేయలేద’’న్నారు. ‘‘పార్టీకి తన కంట్రిబ్యూషన్ ఏమీలేదా’’ ? అని బాధపడుతు ప్రశ్నించారు. పార్టీ బలోపేతంలో హరీష్, సంతోష్ కంట్రిబ్యూషన్ మాత్రమే ఉందా ? ‘‘వీళ్ళిద్దరు మేకవన్నె పులులని కేసీఆర్ గ్రహించాలి. వీళ్ళున్నంతవరకు పార్టీ బాగుపడదు. భగవంతుడు వాళ్ళకు అంతకంతకు చేస్తాడు, వాళ్ళూ అనుభవిస్తార’’ని వేదాంతం వినిపించారు.