రాజకీయ రంగు పులుముకున్న కరీంనగర్ హనుమాన్ శోభాయాత్ర
కరీంనగర్ లో శనివారం రాత్రి జరిగిన హనుమాన్ శోభాయాత్రకి రాజకీయ రంగు పులుముకుంది. హనుమాన్ మాలాధారణలో ఉన్న భక్తులు నిర్వహించిన ర్యాలీలో అన్య వ్యక్తి ఎంట్రీతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
కరీంనగర్ లో శనివారం రాత్రి జరిగిన హనుమాన్ శోభాయాత్రకి రాజకీయ రంగు పులుముకుంది. హనుమాన్ మాలాధారణలో ఉన్న భక్తులు నిర్వహించిన ర్యాలీలో అన్య వ్యక్తి ఎంట్రీతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆరుగురు హనుమాన్ మాల ధరించిన భక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయడంపై హనుమాన్ భక్తులు, బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి.
తల్వార్ తిప్పడంతో మొదలైన వివాదం...
కరీంనగర్ కేంద్రంలో శనివారం రాత్రి నిర్వహించిన హనుమాన్ భక్తుల ర్యాలీ జిల్లా కేంద్రాసుపత్రి సమీపంలోని మంచిర్యాల చౌక్ కు చేరుకోగా.. ఓ యువకుడు ర్యాలీలోకి ప్రవేశించి చేతిలో తల్వార్ తో వీరంగం సృష్టించాడు. అతనిని అడ్డుకునేందుకు హనుమాన్ భక్తులు ప్రయత్నించగా మాటా మాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించగా, భక్తులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు, భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ర్యాలీలో హంగామా సృష్టించిన యువకుడిని పోలీసులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని హనుమాన్ భక్తులు ఆరోపించారు. పోలీసులు యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, ఓ భక్తుడు పోలీసు వాహనం డోర్ పట్టుకున్నాడు. భక్తుడు డోర్ కి వేలాడుతున్నప్పటికీ దాదాపు వంద మీటర్ల వరకు పోలీసు వాహనం ఆపలేదు. ముందుకి వెళ్ళాక ఆపడంతో భక్తుడు వాహనాన్ని వదిలేసాడు.
రాజకీయ రంగు...
పోలీసుల ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు, మంచిర్యాల చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరందరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. అలాగే పలువురు భక్తులను అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసుల అదుపులో ఉన్న హనుమాన్ భక్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
పోలీసు అధికారులు భారీ బలగాలను మోహరించి స్వల్పంగా బలప్రయోగం చేసి ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు, భక్తులను పీటీసీ సెంటర్‌కు తరలించారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించినందుకుగానూ కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హనుమాన్ శోభాయాత్రకు ఆటంకం కలిగించిన వారిని సపోర్ట్ చేస్తూ... హిందువుల మనోభావాలు తీసేలా పోలీసులు ప్రవర్తించారంటూ బీజేపీ రాష్ట్ర బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ హనుమాన్ శోభాయాత్ర సమయంలో అన్యమతస్థులు ఇదే విధంగా ప్రవర్తించారని, ఇప్పుడు కూడా అదే తరహాలో ఇబ్బందులు పెడుతున్నా అధికార ప్రభుత్వం స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కరీంనగర్‌లో హనుమాన్ దీక్షాపరులపై పోలీసులు దాడి చేసి వారిని బలవంతంగా అక్రమ అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దుర్ఘటనకు కారణమైన అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అంటూ బీజేపీ తెలంగాణ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కరీంనగర్‌లో హనుమాన్ దీక్షాపరులపై పోలీసులు దాడి చేసి వారిని బలవంతంగా అక్రమ అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది.
— BJP Telangana (@BJP4Telangana) May 25, 2024
ఈ దుర్ఘటనకు కారణమైన అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
We… pic.twitter.com/z1BlAFNaC8
మరోవైపు బీజేపీ కార్యకర్తల తీరును కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తప్పుబట్టారు. మాలధారుల వల్ల సమస్యలేదు, బీజేపీ కార్యకర్త కత్తి తిప్పడంతోనే సమస్య వచ్చిందన్నారు నరేందర్‌రెడ్డి. సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు సరికాదన్నారు.
కరీంనగర్ హనుమాన్ శోభయాత్ర ఘటనకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేత ప్రవీణ్‌రావు స్పష్టం చేశారు. కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్త కాదని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అన్నారు. అతను ఎవరో పోలీసులే గుర్తించాలన్నారు. కేవలం హనుమాన్ భక్తులను అరెస్టు చేశారనే సమాచారంతో తాము పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి వారిని విడిచిపెట్టే ప్రయత్నం చేశామని చెప్పారు. హనుమాన్ శోభయాత్రలో బీజేపీ కార్యకర్తలు ఎవ్వరూ లేరని, కావాలంటే సీసీ ఫుటేజీని పరిశీలించాలని పోలీసులను కోరారు.
డీజీపీకి బండి సంజయ్ రిక్వెస్ట్...
భక్తులను రెచ్చగొట్టి వారిపై లాఠీచార్జి చేశారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన పోలీసు అధికారులే సమస్య సృష్టించారని ఆరోపించారు. తాము పోలీసు వ్యవస్థకి వ్యతిరేకం కాదని, తప్పుడు సమాచారంతో పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చిన పోలీసులకే వ్యతిరేకమని స్పష్టం చేశారు. డీజీపీతో మాట్లాడిన బండి.. హనుమాన్ భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Strongly condemn the high-handed behaviour of Telangana police against Hanuman Deeksha Swamis at Karimnagar.
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) May 25, 2024
We immediately demand unconditional release of the Hanuman Deeksha Swamis who have been arrested.
Your job is to maintain law and order, not create issues. We will… pic.twitter.com/al6hozNLMD
స్పందించిన త్రీ టౌన్ పోలీసులు...
త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల క్రాస్ రోడ్డు వద్ద హనుమాన్ భక్తులు ర్యాలీగా బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరో వర్గానికి చెందిన వ్యక్తి ర్యాలీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం మొదలైంది. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే, పోలీసులు ఆ వ్యక్తిని పెట్రోలింగ్ కారులో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, ఒక హనుమాన్ భక్తుడు పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని పట్టుకున్నాడు. దీంతో పోలీసులపై దాడి జరుగుతుందనే భయంతో డ్రైవర్ ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో భక్తుడు వాహనాన్ని వదలకుండా అలానే పట్టుకున్నాడు. దీంతో డ్రైవరు వాహనం కొంచెం ముందుకి కదలాగానే నిలిపేసాడు. పోలీసు వాహనాన్ని ఎవరూ వెంబడించకుండా కరీంనగర్‌కు చెందిన ఎస్సై కిందకు దిగారు. అయితే, సబ్-ఇన్‌స్పెక్టర్ పైకి గుంపులు గుంపులుగా వందలాది మంది రావడంతో వారిని ఆపేందుకు బలగాల్ని మోహరించినట్లు తెలిపారు. కాగా, కత్తితో హల్ చల్ చేసిన వ్యక్తిని జయదేవ్ సింగ్ గా పోలీసులు గుర్తించారు.