బీఆర్ఎస్ చేతులెత్తేసిందా ?
x
KCR KTR and Harish Rao

బీఆర్ఎస్ చేతులెత్తేసిందా ?

పదేళ్ళు తెలంగాణను ఎదురులేకుండా పాలించిన ఉద్యమపార్టీ బీఆర్ఎస్ పరిస్ధితి ఇపుడు అగమ్యగోచరంగా తయారైంది.


పదేళ్ళు తెలంగాణను ఎదురులేకుండా పాలించిన ఉద్యమపార్టీ బీఆర్ఎస్ పరిస్ధితి ఇపుడు అగమ్యగోచరంగా తయారైంది. పోటీచేయటానికి కూడా వెనకాడుతోంది. ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే దాదాపు చేతులెత్తేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రఎన్నికల కమీషన్ తెలంగాణ(Telangana)లోని మూడు ఎంఎల్సీ సీట్లకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది. ఈ మూడుస్ధానాల్లో ఒకగ్రాడ్యుయేట్ సీటుతో పాటు రెండు టీచర్స్ ఎంఎల్సీల సీట్లున్నాయి. గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ సీటులో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. టీచర్స్ ఎంఎల్సీ ఎన్నికలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాలతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాలున్నాయి.

పైమూడుస్ధానాలు గెలుచుకునేందుకు అధికారకాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీలు గట్టిగా కసరత్తు చేస్తుండగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) మాత్రం చేతులెత్తేసింది. పార్టీతరపున అధికారికంగా అభ్యర్ధులు పోటీచేయటంలేదు అని అర్ధంవచ్చేట్లుగా నేతలు చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. దీని అర్ధం ఏమిటంటే ఎన్నికలో పార్టీ పోటీచేయకుండా ఎవరైనా గట్టి అభ్యర్ధి ఉంటే మద్దతు ఇవ్వాలని అధినేత కేసీఆర్(KCR) డిసైడ్ చేసినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈసీటుపరిధిలోనే మెడక్ జిల్లాఉన్నా పోటీకి పార్టీ వెనకాడుతుండటం. మెదక్ జిల్లా ఉన్నంతమాత్రాన పార్టీ పోటీచేయాలని ఏమన్నా ఉందా ? అనే అనుమానం రావచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)(HarishRao) ఈజిల్లాలోనే ఉన్నారు. హరీష్ కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. వీళ్ళముగ్గురూ ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలనుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కేసీఆర్ తో పాటు ఇద్దరు అగ్రనేతలున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీతరపున పోటీచేయటానికి గట్టిఅభ్యర్ధే లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పార్టీ అగ్రనేతల వ్యవహారం ఎలాగుందంటే అధికారంలో ఉంటే మాత్రమే తాము పులలమని లేకపోతే పిల్లులమే అన్నట్లుగా ఉంది. ఈసీటులో పార్టీ తరపున పోటీకి ఒకపుడు రవీందర్ సింగ్ పేరు వినబడినా కొంతకాలంగా ఎందుకో ఆ ప్రచారం ఆగిపోయింది. విచిత్రం ఏమిటంటే మెదక్ జిల్లా కాకపోయినా నాలుగు జిల్లాల్లో రెండోది నిజామాబాద్ జిల్లా నుండి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత(Kavitha) కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకపుడు నిజామాబాద్ ఎంపీగా గెలిచి తర్వాత ఎన్నికల్లో కవిత ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆతర్వాత జరిగిన లోకల్ బాడీ ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేసిన కవిత గెలిచారు. ఇదంతా ఎప్పుడంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే. మరిపుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నపుడు నాలుగు జిల్లాల్లో ఒక్క గట్టి అభ్యర్ధిని కూడా తయారుచేసుకోలేకపోవటమే విచిత్రంగా ఉంది.

ప్రభుత్వ వ్యతిరేకత ఉత్తదేనా ?

తెల్లవారిలేస్తే ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్, కవితలు విరుచుకుపడుతుంటారు. రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం అన్నింటిలోను ఫెయిలైందని, ప్రజావ్యతిరేకత పెరిగిపోయిందని, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెడితే జనాలు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు రెడీగా ఉంటారని పైముగ్గురూ పదేపదే చెప్పిందే చెబుతుంటారు. వీళ్ళుచెబుతున్నట్లుగా నిజంగానే ప్రభుత్వంమీద జనాల్లో అంత వ్యతిరేకత ఉంటే మరి ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేయచ్చు కదా ? ఎందుకు వెనకాడుతున్నట్లు ? తమ పార్టీ తరపున మూడు సీట్లకు ముగ్గురు అభ్యర్ధులను పోటీలోకి దింపితే జనాలే గెలిపించుకుంటారు కదా. కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించి తమఅభ్యర్ధులను అఖండమెజారిటితో గెలిపించుకోవచ్చు కదా ? అప్పుడు రేవంత్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందని వీళ్ళు చెబుతున్నది నిజమే అని అందరికీ తెలుస్తుంది. ఇంతటి బంగారంలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకునే విషయంలో బీఆర్ఎస్ ఎందుకు వెనకాడుతోందో అర్ధంకావటంలేదు.

ఓటర్లు ఎంతమంది ?

గ్రాడ్యుయేట్ సీటు పరిధిలోకి వచ్చే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆరు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 3.41 లక్షల ఓట్లున్నాయి. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి టీ. జీవన్ రెడ్డి పోటీచేసి గెలిచారు. అప్పటి ఎన్నికలో కూడా ఈ సీటులో బీఆర్ఎస్ తరపున ఎవరూ పోటీచేయలేదు. పోటీచేసిన మాజీ అధికారి చంద్రశేఖర్ కు మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ మద్దతు ప్రకటించినా చంద్రశేఖర్ గెలవలేదు. తొందరలో జరగబోయే ఎన్నికలో కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి కాకుండా కొత్త అభ్యర్ధి రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ తరపున గోదావరి అంజిరెడ్డి పోటీచేయబోతున్నారు. అంజిరెడ్డి అభ్యర్ధిగా పార్టీ కొద్దిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. రెడ్డి ప్రచారంలోకి కూడా దిగేశారు.

Read More
Next Story