‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా’.. కౌశిక్ రెడ్డి విచారణ పూర్తి..
x

‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా’.. కౌశిక్ రెడ్డి విచారణ పూర్తి..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసబ్‌ట్యాంక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసబ్‌ట్యాంక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్‌తో కలిసి కౌశిక్ రెడ్డి వెళ్లారు. ముందుగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అడ్వకేట్‌ను పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల జోక్యంతో న్యాయవాదికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు గంటపాటు కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం బయటకొచ్చిన కౌశిక్.. మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు పూర్తి సహకారం అందించానని చెప్పారు. గంట విచారణలో తనను 32 ప్రశ్నలు అడిగినట్లు ఆయన వెల్లడించారు.

ఇదొక అక్రమ కేసు

‘‘నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 హామీలు పై ప్రశ్నిస్తే నా పై కేసులు పెడుతున్నారు. 420 హామీలు, 6 గ్యారెంటీలు పై ప్రశ్నిస్తునే ఉంటాను. డిసెంబర్ 4 రోజున నేను బంజారాహిల్స్ పీఎస్ కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీడుకొని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపై కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదు పై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పండుగ రోజు కూడా నన్ను దొంగ మాదిరి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఈరోజు మాసబ్ ట్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు. అడిగిన ప్రశ్నే అడిగారు.. నేను అన్నిటికీ సమాధానం చెప్పాను’’ అని వెల్లడించారు.

అసలు జరిగింది ఇది..

అయితే తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతుందని పేర్కొంటూ ఫిర్యాదు ఇవ్వడం కోసం బుధవారం మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర బయటకు వెళ్తున్నారు. అది గమనించిన కౌశిక్ రెడ్డి.. తన ఫిర్యాదు తీసుకున్న తర్వాత వెళ్లాలని డిమాండ్ చేశారు. తాను ఒక అర్జెంట్ పనిపైన వెళ్తున్నానని, తిరిగి వచ్చాక ఆయన ఫిర్యాదును స్వీకరిస్తానని సీఐ చెప్పారు. దాంతో కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి అనుచరులు సీఐ వాహనాన్ని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సీఐ వెనక్కు వచ్చి కౌశిక్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. అనంతరం తనను తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ కౌశిక్ రెడ్డి సహా ఆయన అనుచరులపై సీఐ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ సహా 20మంది ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 57, 126(2), 132, 224, 333, 451(3), 191(2), r/w 190, r/w 3(5) సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించే శుక్రవారం కౌశిక్‌ను మాసబ్‌ ట్యాంక్ పోలీసులు విచారించారు.

Read More
Next Story