
'రైతులు నష్టపోయినా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తలేవు'
లింబాద్రి గుట్టలో కవిత ఆవేదన
ఈ ప్రాంతమంతా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు, ప్రాంతమంతా వాళ్ల కంట్రోల్ లోనే ఉంది. అయినా సరే రైతుల కష్టాలు తీరడం లేదని తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి, జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ రోజు లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
లింబాద్రి గుట్ట బాల్కొండ నియోజకవర్గం బీమ్ గల్ మండలంలో ఉంటుంది. నేడుకార్తీక పౌర్ణమి రోజున ఆమె ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం సందర్శించారు.
“రాష్ట్రంలో కీలకమైన కాంగ్రెస్ నాయకులలో చాలా మంది ఈ ప్రాంతం వారే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ మండలానికి చెందిన వారే, మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా ఈ ప్రాంతం వారే. ఇక్కడి ఎమ్మెల్యే ఎవరన్నది పక్కన పెడితే.. వ్యవహారమంతా రూలింగ్ పార్టీదే నడుస్తోంది.” అంటూ “అయినా సరే రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు,” అని ఆమె విమర్శించారు.
“మక్కలు 80 శాతం కొన్న తర్వాత ఇప్పుడు కాంటా పెడుతున్నారు. ఇది దారుణం, అన్యాయం. తడిసిన వరి కూడా కొంటలేరు. కొంటామని కూడా చెప్పటం లేదు. మొన్న నేను యంచ గ్రామానికి వెళ్లిన తర్వాత కలెక్టర్ గారు ఆ ప్రాంతాన్ని విజిట్ చేశారు. అలాగే అన్ని చోట్లకు వెళ్లాలని కోరుతున్నా.ఈ ప్రాంతంలోని కొన్ని చెక్ డ్యామ్ లు డ్యామేజ్ అవటంతో బాల్కొండలో పంట పొలాలు మునిగాయి. వారికి పంట నష్టం ఇస్తామని ప్రభుత్వం ధైర్యం చెప్పటం లేదు,” అని కవిత అన్నారు.
ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని నిలదీయాలె, రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయాలె అని అన్నారు.
రైతులనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం దేవస్థానాన్ని కూడా పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు.
“కేసీఆర్ గారు లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు. గతంలో లింబాద్రి స్వామి వారికి రూ. 5 కోట్లు కేటాయించారు. దాంతో గుడిని అభివృద్ధి చేసుకున్నాం. ఐతే మహిళలకు టాయిలెట్స్, ఛేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. గుట్ట కింద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పూర్తి కావటానికి రూ. 20 లక్షలు అవసరం. ప్రభుత్వం వాటినివెంటనే కేటాయించాలి,” అని కవిత డిమాండ్ చేశారు.
పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధి కి కృషి చేయాలని అన్నారు.
నింబాద్రి లింబాద్రి గా మారింది
కార్తీక పౌర్ణమి సందర్భంగా భీంగల్ మండలంలోని లింబాద్రి స్వామి ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుందని ఈయన చాలా పవర్ ఫుల్ దేవుడు, అందుకే కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని చెప్పారు.
“నిజానికి ఇది లింబాద్రి ఆలయం కాదు, నింబాద్రి. చాలా మహిమ గల దేవుడు. ఇక్కడ వేప చెట్లు ఉన్నాయని నింబాద్రి అంటారు అని అది కాలక్రమేణా లింబాద్రిగా పేరు వచ్చింది,” అని కవిత వివరించారు. ఈ దేవుడి దయ వల్ల నిజామాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

