
కాళేశ్వరంపై కేసీఆర్ కు షాకిచ్చిన కవిత
ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 21, 22 డబ్బులన్నీ కాంట్రాక్టర్లకే వెళ్ళినట్లు ఆరోపించారు
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు ఆయన కూతురు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద షాక్ ఇచ్చారు. శుక్రవారం ‘జనంబాట’(Janambata) నేపధ్యంలో కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతు ప్రాజెక్టు వల్ల కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరాకూ నీళ్ళు రాలేదన్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 21, 22 డబ్బులన్నీ కాంట్రాక్టర్లకే వెళ్ళినట్లు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టువల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని కుండబద్దలు కొట్టినట్లు కవిత(Kavitha) చెప్పారు. ఈవిషయాలు చెబితే బీఆర్ఎస్ నేతలు తనమీద నోరువేసుకుని పడిపోతున్నట్లు ఎద్దేవాచేశారు. కుట్రచేసి తనను బీఆర్ఎస్(BRS) లో పంపించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. బీసీ రిజర్వేషన్లగురించి మాట్లాడుతు మొదటి ద్రోహి బీజేపీ అయితే రెండో ద్రోహి కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయంఏమిటంటే కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని కేసీఆర్, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వాదిస్తున్నారు. కాళేశ్వరంపై విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తో పాటు హైకోర్టులో కూడా కేసీఆర్, హరీష్ ఇదే చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగకపోయినా జరిగినట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు కుట్రలుచేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని పై ఇద్దరు కోర్టుకు చెప్పారు. తమను కేసుల్లో ఇరికించే కుట్ర జరుగుతోందని కూడా కేసీఆర్, హరీష్ వాదిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీరందించినట్లు కేసీఆర్, హరీష్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే కవిత మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తమకు ప్రాజెక్టువల్ల ఎలాంటి ఉపయోగంలేదన్న విషయాన్ని రైతులే తనతో చెప్పినట్లు కవిత చెప్పారు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే కాళేశ్వరం ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క ఎకరాకు కూడా నీరందలేదన్నది వాస్తవమే అనిపిస్తోంది.
ఇక రెండో పాయింట్ ఏమిటంటే ప్యాకేజీ 21, 22 పనుల్లో డబ్బంతా కాంట్రాక్టరకే పోయినట్లు కవిత ఆరోపించారు. రెండుజిల్లాల్లో చేసిన ప్రాజెక్టు ప్యాకేజీల్లో చుక్క కూడా నీరు రావటంలేదంటే అసలు పనులు ఎందుకు చేసినట్ల ? ఆ పనులకు సంబంధించిన ప్యాకేజీ బిల్లులు ఎవరిజేబుల్లోకి వెళ్ళినట్లు ? అవసరంలేకపోయినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీల పేరుతో ప్రజాధనాన్ని కేసీఆర్, హరీష్ వృధాచేశారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కవిత చెప్పిందే నిజమైతే కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్ చెబుతున్నది అబద్ధమనే అర్ధం.

