
కేటీఆర్ కు పోటీగా జాగృతిలో వర్కింగ్ ప్రెసిడెంట్
ఎస్టీసామాజికవర్గానికి చెందిన లకావత్ రూప్ సింగ్ నాయక్ ను వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించారు
బీఆర్ఎస్ లో అన్న కేటీఆర్ కు ఎందులోనూ తగ్గకూడదని అనుకున్నారో ఏమోకాని జాగృతిలో ఒక వర్కింగ్ ప్రెసిడెంటును నియమించారు కల్వకుంట్ల కవిత. జాగృతిసంస్ధ ప్రస్తుతం సాంస్కృతిక సంస్ధా ? లేకపోతే రాజకీయపార్టీయా అన్న క్లారిటి జనాల్లో లేదు. బీఆర్ఎస్(BRS) నుండి బయటకు వచ్చేసిన కవిత(Kavitha) ఇపుడు జాగృతి(Telangana Jagruthi) సంస్ధ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్ధలో దసరా పండుగ సందర్భంగా కొన్ని నియామకాలు చేశారు. అందులో ఎస్టీసామాజికవర్గానికి చెందిన లకావత్ రూప్ సింగ్ నాయక్ ను వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించారు. అలాగే కొన్ని జిల్లాలకు అధ్యక్షులను, కొందరిని అనుబంధ విభాగాల్లోను, జాగృతి నియోజకవర్గ బాధ్యులుగాను, కొందరు మహిళలను జిల్లాల అధ్యక్షులుగాను, ఆటోజాగృతి విభాగంలో మరికొందరిని జిల్లాల అధ్యక్షులుగా నియమించారు. దీంతో పాటు ప్రధాన కార్యదర్శిగా రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులుగా రియాజుద్దీన్, మంచాల వరలక్ష్మి, పుస్కూరి శ్రీకాంత్ రావు, కొట్టాల యాదగిరి, కోల శ్రీనివాస్ నియమించారు. రాష్ట్ర కార్యదర్శలుగా జాడి శ్రీనివాస్, గుంటి సుందర్, సేనాపతి అర్చనను కూడా నియమించారు.
ఇపుడు చేసిన నియామకాలన్నీ జాగృతికి అనుబంధసంఘాలుగా కవిత పేర్కొన్నారు. మొన్నటివరకు జాగృతి సంస్ధే బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉండేది. అలాంటిది ఇపుడు జాగృతికి కొన్ని అనుబంధ సంస్ధలు తయారయ్యాయి. బీఆర్ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నపుడు తన జాగృతికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఉండకూడదని కవిత ఆలోచించినట్లున్నారు. అందుకనే సమాజిక తెలంగాణ అని పదేపదే ఇపుడు చెబుతున్న కవిత ఆ పోస్టులో ఒక ఎస్టీ నేతను నియమించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం కవితకు సామాజిక తెలంగాణ అస్సలు గుర్తుకేరాలేదు.
స్ధానికసంస్ధల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్న కవిత తన తండ్రి కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు ఏరోజూ బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు ఇచ్చితీరాల్సిందే అనిగోలచేస్తున్న కవిత తన తండ్రి మొదటి క్యాబినెట్లో ఒక్క మహిళను తీసుకోకపోయినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో మహిళలకు 33శాతం దామాషాలో టికెట్లు ఇవ్వకపోయినా, పదవుల్లో నియమించకపోయినా అడగాలనే అనిపించలేదు. బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు కవితకు ఎప్పుడు గుర్తుకొచ్చాయంటే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, తాను పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసిన తర్వాతే అనే ఆరోపణలకు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు.
తాజాగా జాగృతిలో కొన్నినియామకాలు చేసిన కవిత తొందరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటనలకు రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గంలో 80శాతం పదవులను బడుగు, బలహీనవర్గాలకే కేటాయించినట్లు చెప్పారు. జిల్లాల పర్యటనల్లో మేథావులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల్లోని నిపుణులతో సమావేశం అవుతానని తెలిపారు. జాగృతి సంస్ధనే రాజకీయపార్టీగా మార్చాలా ? లేకపోతే కొత్తపార్టీ పెట్టాలా అన్న విషయాన్ని తగిన సమయంలో ఆలోచిస్తానని కవిత చెప్పారు.