
టైం చూసుకుని కవిత కొడుకుని దింపిందా ?
ఇంతమంది నేతలు వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఒక యువకుడు మాత్రం మీడియా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు
శనివారం తెలంగాణ బంద్ సందర్భంగా వివిధ పార్టీల్లోని అనేకమంది నేతలు ఉదయం నుండి రోడ్లమీదకు వచ్చారు. నగరం అంతా ర్యాలీగా తిరుగుతు బంద్ ను విజయవంతంచేయమని జనాలకు విజ్ఞప్తులు చేశారు. తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) కూడా ఇలాగే ఆటో మీద నగరంలో తిరిగారు. ఇంతమంది నేతలు వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఒక యువకుడు మాత్రం మీడియా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతను ఎవరంటే కల్వకుంట్ల ఆదిత్య. ఆదిత్య(Kalvakuntla Aditya) అంటే కల్వకుంట్ల కవిత పెద్ద కొడుకు. ఇప్పటివరకు కొడుకును కవిత బహిరంగ వేదికలమీద ఎప్పుడూ పరిచయంచేయలేదు.
అలాంటిది ఒక్కసారిగా ఆదిత్య బీసీ బంద్ రోజు రాజకీయ వేదికమీద ప్రత్యక్షమయ్యాడు. దీనివెనుక పెద్ద కథే ఉందనే ప్రచారం మొదలైపోయింది. ఖైరతాబాద్ సెంటర్లో ఆదిత్య రోడ్డుమీద కూర్చుని బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అనే ప్లకార్డును ప్రదర్శించాడు. కవిత కొడుకు ఆదిత్య రిజర్వేషన్లకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించాడన్న విషయం తెలియగానే ఎలక్ట్రానిక్ మీడియా ఫోకస్ అంతా అతనివైపు మళ్ళింది. దాంతో ఎలక్ట్రానిక్ మీడియా అంతా అతని బైట్స్ కోసం ఎగబడ్డారు.
సరిగ్గా బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న బంద్ రోజే ఆదిత్యను కవిత ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లు ? ఎందుకంటే లాంచింగ్ బాగుంటే తర్వాత ప్రయాణం సజావుగా సాగుతుందని భావించినట్లున్నారు. రాష్ట్రంలోని అన్నీ పార్టీలు బీసీలకు మద్దతుగా రోడ్లపైకి చేరి బంద్ ను విజయవంతం చేశాయి. కాబట్టి ఈ సమయంలోనే కొడుకును రాజకీయ వేదికమీదకు తీసుకొచ్చి పరిచయంచేస్తే అందరి దృష్టిలో పడటం తేలికగా ఉంటుందని అనుకున్నట్లున్నారు. అందుకనే జాగృతి నేతలు, క్యాడర్ ను తోడిచ్చి కొడుకు ఆదిత్యను జనాలకు పరిచయంచేశారు. కవిత ఊహించినట్లుగనే ఆదిత్య మీద మీడియా ఫుల్లుగా ఫోకస్ పెట్టి బాగా హైలైట్ చేసింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడుకు హిమాంశు రాజకీయాల్లోకి తొందరలోనే ప్రవేశించబోతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే సడెన్ గా కవిత కొడుకు ఎంట్రీ ఇచ్చేశాడు. బీసీ బంద్ రోజున ఆధిత్య రోడ్డుమీద బైఠాయించి మళ్ళీ వెనక్కు వెళిపోతాడని అనుకుంటే పొరబాటే. ఒకరోజు ప్రచారంతో తృప్తిపడి వారసులు తెరవెనక్కు వెళ్ళిపోతారని అనుకోవటం తప్పు. ఈరోజు జనాలకు పరిచయం చేయటంలో కవిత పెద్ద ప్లానే వేసుంటారనటంలో సందేహంలేదు. అదేమిటో తొందరలోనే అందరికీ అర్ధమవుతుంది.